వివాహాల్లో ఎనిమిది రకాలున్నాయట !
వివాహాల్లో ఎనిమిది రకాలున్నాయట !
- లక్ష్మి రమణ
ఈ రోజుల్లో పిల్లలు సంబంధాలు వెతికి పెళ్లి చేసే అవకాశాన్ని, కష్టాన్ని తల్లిదండ్రులకి చాలా అరుదుగానే ఇస్తున్నారు . ఇటువంటి వివాహాలు తప్పా , ఒప్పా అని వారి బంధం నిర్ణయిస్తుంది . కొంతమంది విషయంలో అటువంటి వివాహం అదృష్టదాయకం, ప్రేమపరిపూర్ణమై ఆనందాన్ని ఇస్తుంది . ఎక్కువమంది విషయంలో మాత్రం చేతులు కాలాక ఆకులు పెట్టుకోలేని చందంగా తయారవుతూ ఉండడం కనిపిస్తూ ఉంది . పైగా స్వధర్మం విడిచి , పరధర్మంలోకి యవ్వనపు ప్రభావంతో వెళ్ళే ఆడవాళ్ళ పరిస్థితి నరకం కంటే ఏమాత్రమూ తక్కువ కాదు . అయితే, మన ధర్మం వివరించిన ఇటువంటి వివాహాలు అష్ట విధానాలని స్కాంద పురాణం చెబుతుంది . ఈ ఎనిమిది అందరికీ విహితమేనా? మంచి దారిలోనే ఉన్నామా అనేది కూడా యువత ఆలోచించుకోవాల్సిన విషయం . అలా చెప్పబడిన విధానాలు కాల మాన పరిస్థితులని బట్టి మాత్రమే అన్వయించుకోతగినవి అని గమనించాలి . ఆ అష్టవిధి విధానాలు ఇలా ఉన్నాయి .
మానవుని లోకంలో వివాహం ఎనిమిది విధాలుగా వుంటుంది. అవి, బ్రాహ్మము, దైవము, ఆర్షము, ప్రాజాపత్యము, ఆసురము, గాంధర్వము, రాక్షసము, పైశాచము.
1. బ్రాహ్మము : యోగ్యుడైన వరుడిని పిలిచి, అలంకరించిన కన్యను ఇచ్చి చేయు వివాహాన్ని బ్రాహ్మము అంటారు. ఈ దంపతులకు పుట్టిన కొడుకు ఇరవైతరాలవరకు వారిని తరింపజేస్తాడు. ఇది సాధారణంగా ఇళ్లలో జరుగుతున్నదే.
2. దైవము : యజ్ఞంనందు ఋత్విజుడుగా వచ్చిన బ్రహ్మచారికి కన్యనిచ్చి చేసే వివాహం దైవము. వీరికి పుట్టిన కుమారుడు పద్నాలుగు తరాలవారిని పవిత్రులుగా జేస్తారు.
3. ఆర్షము : వరుని వద్దనుండి రెండు గోవులను కన్యాశుల్కంగా గ్రహించి,కుమార్తెనిచ్చి చేసే వివాహము ఆర్షము. వీరి కుమారుడు ఆరు తరాలవారిని పవిత్రులుగా చేస్తాడు.
4. ప్రాజాపత్యము : మీరిద్దరు దంపతులై గృహస్థధర్మాన్ని నిర్వర్తించండి అని వధూవరులను దీవించి చేసిన వివాహమే ప్రాజాపత్యము. వీరి కుమారుడు ఆరుతరాలవారిని ఉద్ధరిస్తాడు.
5. ఆసురము : వధువు ఇష్టానిష్టాలతో నిమిత్తం లేకుండా, వరునినుండి ధనం తీసుకొని కన్యను విక్రయించి చేసే వివాహమే ఆసురము.
6. గాంధర్వము : వధూవరులు యుక్తవయస్కులై ఒకరిని చూసి ఇంకొకరు ఇష్టపడి, పెద్దల అనుమతి లేకుండా పంచభూతాల సాక్షిగా చేసుకునే వివాహమే గాంధర్వము. కలియుగంతో సత్యం క్షీణించింది కాబట్టి ఈ వివాహం నిషేధించబడింది. పూర్వం శకుంతలా దుష్యంతులు ఈ విధంగానే దంపతులయ్యారు.
7. రాక్షసము : వధూవరులకు పరస్పరం ఇష్టముంటుంది. పెద్దలు అనుమతించరు. అప్పుడు వరుడు తన భుజబలంతో వారితో పోరాడి గెలిచి, కన్యను తెచ్చుకొని వివాహమాడడం రాక్షసము. పెద్దలు ఈ విధమైన వివాహాన్ని తరుచుగా సమ్మతించరు. శ్రీకృష్ణుడు రుక్మిణిని ఈ విధంగానే చేపట్టాడు.
8. పైశాచము : కన్యకు గానీ, ఆమె కుటుంబంవైపు వారికి గాని ఇష్టముండదు. అయినా వరుడు బలాత్కారంగా కన్యను ఎత్తుకొని పోయి చేసుకునే వివాహమే పైశాచము.
ఈ పై ఎనిమిది వివాహాలలో మొదటి నాలుగు బ్రాహ్మణులకు యోగ్యమైనవి. గాంధర్వ, రాక్షసములు రాజులకు, వైశ్యులకు తగినవి. తన ధర్మపత్నియందు బూతుకాలాన్ని సంగమం చేసేవాడు సదా బ్రహ్మచారిగా పరిగణించబడతాడు. పగటి కాలంలో, తల్లిదండ్రుల శ్రాద్ధదినములలో, సర్వపర్వములందు స్త్రీసంగమం చేయరాదు. చేసినచో ధర్మం నుండి పతితుడవుతారు. దానివల్ల అథోగతులు కలుగుతాయి. కన్యలను నమ్ముకొని ఆ ధనంతో జీవించేవాడు ఒక కల్ప పర్వంతం నరకంలో నుండి పురుగులను ఆహారంగా తింటాడు. వాడేకాక వాని పూర్వులను కూడా నరకంలో తీసుకెళ్తాడు.
తన భర్తతో సంతుష్టి పొందిన పతివ్రతను, తన ధర్మపత్నితో సంతోషం పొందిన భర్త, ఏ గృహంలో అయితే వుంటారో, అక్కడ శ్రీమహాలక్ష్మి, నారాయణునితో సహా నివసించి శుభాలు కలుగుతాయి. గృహస్తులకు నిత్యం పంచసూచనాలతో (ఐదు విధాలైన జీవుల వధ్యస్థానములు) పని వుంటుంది. అవి రోలు, తిరుగలి లేదా సన్నికల్లు, పొయ్యి, నీడి కడవ, చీపురుకట్ట. ఈ ఐదింటిని గృహస్తులు వాడక తప్పదు. వాడినప్పుడు వారికి తెలియకుండా కొంత జీవహింస జరగవచ్చు. ఈ పాపాన్ని తొలగించుకోవడానికి చెప్పిన పంచమహాయజ్ఞములను గృహస్థులు చేయాలి. వాటితో పరిహారమవుతుంది .
#marrages
Tags: marrage, marrages