మాఘమాస పౌర్ణమి నాడు ఇలా చేయండి !
మాఘమాస పౌర్ణమి నాడు ఇలా చేయండి !
- లక్ష్మి రమణ
కార్తీకమాసం ఏవిధంగానైతే జ్ఞానప్రదాయకమైన మాసమో, అదే విధంగా మాఘమాసం జ్ఞానప్రదాయకం. ఈ మాసంలోనే భారతీదేవి జన్మించింది . ఆ రోజున ఆవిడకి వసంత పంచమీ పూజ చేస్తాం . అలాగే మాఘమాసంలో వచ్చే గుప్తనవరాత్రులని నీల సరస్వతి లేదా మాతంగీ నవరాత్రులుగా శారదాదేవీని తొమ్మిదిరోజులపాటు సభాక్తికంగా ఆరాధించుకుంటాం. జ్ఞానప్రకాశకుడైన ఆ సూర్యదేవుని జనం కూడా మాఘమాసంలో వచ్చే రథసప్తమి నాదే జరిగింది . అటువంటి మాఘమాస ప్రత్యేకతని తెలుసుకుందాం .
భా అంటే సూర్యుని ప్రకాశం - జ్ఞానం అని అర్థం . రతి అంటే ఆ వెలుగనే జ్ఞానంలోనే రమించేది అని అర్థం . భారతీయులు ఆమె బిడ్డలు. కనుక వారందరూ జ్ఞానాన్ని పొందేందుకు శ్రమించేవారు. మాఘమాసంలోనే ఆ భారతీ దేవి ఉద్భవించింది . ఆ సూర్యుడు కూడా ఈ మాఘమాసంలోనే జన్మించారు . కాబట్టి ఈ మాఘమాసం అమితమైన ఫలితాలని, సంపూర్ణమైన జ్ఞానప్రకాశాన్ని, అనంతమైన పుణ్యాన్ని ప్రసాదించేది నిస్సందేహంగా చెప్పొచ్చు . అటువంటి ప్రకాశంతో ఆధ్యాత్మిక జగతికి ఆదర్శమూర్తిగా వర్ధిల్లిన మహాయోగి శ్రీరామకృష్ణ పరమహంస జన్మించింది కూడా ఈ మాఘమాసంలో పౌర్ణమి రోజునే కావడం విశేషం .
చంద్రుడు మఖా నక్షత్రానికి దగ్గరగా ఉండడం చేత ఈ మాసాన్ని మాఘమాసం అని పిలుస్తారని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది . ఆగము అనే పదానికి సంస్కృతంలో పాపమని అర్థం. మాఘము అంటే పాపాలను నశింపజేసేది అని అర్థం. పాపాలను తొలగించేది కనుకనే మాఘమాసానికి అత్యధిక ప్రాధాన్యత ఏర్పడింది .
ప్రత్యేకించి మాఘ పౌర్ణమి రోజు గౌరీ దేవి జననం జరిగినట్లు పురాణాలు తెలియజేస్తున్నాయి. శక్తి జననం జరిగిన ఈ పౌర్ణిమ మహా శక్తివంతమైంది. దీన్నే మహా మాఘి అని కూడా అంటారు. ఈ రోజున స్నానము విశేషించి సముద్ర స్నానము విశేష ఫలప్రదము. శివ కేశవార్చనలతో, దేవి పూజతో ఈరోజున గడపడం సర్వశుభాలనూ ప్రసాదిస్తుంది.
కార్తీక మాసంలో ఏవిధంగా అయితే, దీపారాధనకు అత్యంత ప్రాధాన్యత ఉందో , అదే విధంగా మాఘ మాసంలో స్నానం అత్యంత ప్రాధాన్యం . మాఘమాసమంతా ఇలా సూర్యోదయానికి పూర్వమే నదీస్నానం ఆచరించాలని మాఘపురాణం చెబుతోంది . ఉదాత్తమైన ఆ స్నాన మహిమనీ వర్ణిస్తుంది .
కనీసం మాఘ పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ ఉదయమే తల స్నానం ఆచరించాలి. శ్రీ మహా విష్ణువు మాఘ పౌర్ణమి రోజు స్వయంగా గంగలో నివసిస్తాడని శాస్త్రవచనం . అందుచేత ప్రతి ఒక్కరు ఈరోజు పుణ్య నదుల్లో గాని, సముద్రంలో గాని, వారి గృహాల్లో గాని శ్రీమహావిష్ణువును, గంగను స్మరిస్తూ తల స్నానం ఆచరించాలి. మాఘ పౌర్ణమి రోజు తలస్నానం ఆచరించిన వారికి, శ్రీమన్నారాయణన్ని, సూర్యభగవానుడిని, గంగానదిని స్మరించి తర్పణాలు వదిలిన వారికి పాపాలు నశించిపోయి పుణ్యం కలుగుతుందని మాఘపురాణ వచనం .
మాఘ పౌర్ణమి రోజు చేయాల్సిన పనులు:
తలస్నానం చేయాలి. వీలయితే సముద్రస్నానం, లేదా నదీస్నానం ఉత్తమం.
శ్రీమన్నారాయణుణ్ణి, గంగని స్మరిస్తూ తర్పణాలు విడిచి పెట్టాలి. నువ్వులు, రేగి పళ్ళు, అన్నము దానం చేయడం వల్ల పుణ్యఫలం కలుగుతుంది.
ఈ రోజు చేసేటటువంటి జప, తప, హోమాదులకు కోటిరేట్ల పుణ్యఫలం లభిస్తుంది.
విశేషించి మాఘ పౌర్ణమి రోజు ఆచరించేటటువంటి సత్యనారాయణ స్వామి వ్రతానికి అనంత పుణ్యఫలం లభిస్తుందని సత్యనారాయణ వ్రత కథ తెలియజేస్తోంది
#maghapournami #satyanarayanavratam
Tags: magha, pournami, satyanarayana swami vratam