అగ్ని ప్రధానమైన ఆరాధనని ఋషులు ఎందుకు విధించారు ?
అగ్ని ప్రధానమైన ఆరాధనని ఋషులు ఎందుకు విధించారు ?
- లక్ష్మి రమణ
అగ్ని ప్రధాన దైవంగా మనధర్మంలో పూజించడం జరుగుతుంది . ఈశ్వరుణ్ణి అగ్నిస్వరూపంగా ఆరాధిస్తాం . పురాణాలలో అగ్ని పురాణం కనిపిస్తుంది . వేదాలు అగ్నికి అత్యంత ఉన్నతమైన స్థానాన్నిచ్చి గౌరవించాయి . అగ్ని స్వరూపమైన సూర్యుణ్ణి ప్రత్యక్ష నారాయణుడిగా , సకల వేద స్వరూపంగా , దేవతా స్వరూపంగా ఆరాధించడం మన సనాతన ధర్మం . యజ్ఞాలూ , యాగాలూ, హోమాలూ చేయడం ద్వారా అగ్ని ముఖంగా దేవతలని ఆరాధిస్తాం .
అగ్ని ఐదు స్వరూపాలుగా ఉంటుందని, వాటినే పంచాగ్నులు అంటారని చాందోగ్యోపనిషత్ చెబుతుంది. అగ్నివిద్యలో భాగంగా గౌతమ మహర్షి అభ్యసించిన ఆ అగ్ని స్వరూపాన్ని తెలుసుకుంటే, అగ్ని ప్రధానమైన ఆరాధన మన ఋషులు ఎందుకు మనకి విధించారో అర్థం అవుతుంది .
చాందోగ్యోపనిషత్ లో ప్రవాహణుడు అనే రాజర్షి అగ్ని విద్యను అభ్యసించిన వారుగా కనిపిస్తారు . ఆయన గౌతమ మహర్షికి అగ్ని విద్యను ఉపదేశిస్తారు. సాధారణంగా మహర్షులు విద్యని ఉపదేశించే వారుగా ఉంటారు . కానీ ఇక్కడ ఒక రాజర్షి ఈ అగ్ని విద్యని ఒక మహర్షికి ఉపదేశించడం ఒక విశేషం . ఈ విద్యని ఉపదేశించడంలో భాగంగా ఆయన గౌతమునికి ఈ లోకమే ఒక అగ్ని స్వరూపం అని చెబుతూ ఐదు రకాలైన అగ్ని స్వరూపాలని వివరిస్తారు . ఇవి తెలుసుకున్నాక , ఇప్పుడు లోకంలో ‘విశ్వం ఎలా ఆవిర్భవించింది’ అని తలలు బద్దలు కొట్టుకుంటున్న శాస్త్ర వేత్తలకు సాధికారంగా సమాధానం చెప్పొచ్చని మీకనిపిస్తే ఆశ్చర్యం లేదు . అంతటి విజ్ఞానం మన సనాతన ఋషులు మనకి అందించారు .
రాజర్షి ప్రవాహణుడు, గౌతమ మహర్షి తో మొదటి అగ్ని గురించి వివరిస్తూ ఇలా అంటారు. “ అసౌ వా లోకో గౌతమాగ్ని :” అంటారు . ఈ లోకమే అగ్ని ఇది సోమకారకం అని అర్థం .
ఆతర్వాత పర్జన్యుడు లేదా ఇంద్రుడే అగ్ని స్వరూపము . ఇది వర్గ కారకం. అని చెబుతారు . ఇక్కడ లోకము, లోకములోని అనంతకోటి వర్గములూ అగ్ని నుండే ఉద్భవించాయని చెప్పారు కదా ! ఇంకా చూడండి .
లోకమూ వర్గమే కాదు , భూమి కూడా అగ్ని స్వరూపమే అని చెబుతూ “ పృధి వీ వా గౌతమాగ్ని:” అనిచెబుతారు . ఈ పృథ్వి అనే అగ్నిలో హవనమయ్యేది వర్షం. ఆ వర్షం భూమి అనే అగ్నిలో హుతం కావడం వలన, ఆహారం (అన్నం/ ధాన్యం ) పుడుతోంది .
ఆ అన్నాన్ని పురుషుడు స్వీకరిస్తున్నాడు. ఆ పురుషుడే ఒక అగ్ని స్వరూపం . పురుషుడనే అగ్నిలో హుతమైన ఆహారం అమృతమై ప్రజాకారకమైనటువంటి రేతస్సు పుడుతుంది.
యవ్వనం లేదా యువత అగ్ని స్వరూపం. ఈ అగ్నిలో ఇంద్రాది దేవతల చేత హోమం చేయబడ్డ రేతస్సు నుంచి గర్భం కలుగుతుంది. దీనివల్ల జీవం వర్ధిల్లుతుంది .
ఇవి పంచాగ్నులు . ఈ ఐదు రకాలుగా విశ్వమంతా వ్యాపించి ఉన్నది అగ్నిస్వరూపమే . లోకంలో అవిచిన్నంగా జరిగేది యజ్ఞమే! పురుషుడు ఏ ఏ అగ్ని నుంచి వచ్చి ఉన్నాడో, ఏ అగ్నుల చేత జన్మించి ఉన్నాడో అదే అగ్ని చివరికి అతన్ని తీసుకుపోతాయి. అంటే, జీవుడి జన్మకి , మృత్యువుకి, ఆతర్వాత ఊర్ధ్వలోక గతులకి కారణము అగ్ని అని తెలుస్తోంది కదా ! ఇంట గొప్పది కాబట్టే మన ఋషులు మనకి అగ్ని ఆరాధన నిత్యమూ జరగాలని విధించారు. దానిని పాటించి, మన ధర్మాన్ని నిలుపుకొని కృతార్థులం కావలసిన బాధ్యత ఇప్పుడు మనలో ప్రతి ఒక్కరికీ ఉంది .
ధర్మో రక్షతి రక్షితః అనే ఆర్ష వాక్యాన్ని స్మరించుకొని మన సనాతన ధర్మాన్ని రక్షించుకుందాం . శుభం .