అన్నం వండేప్పుడు ఇలా చేస్తే యజ్ఞం చేసిన ఫలితం .
అన్నం వండేప్పుడు ఇలా చేస్తే యజ్ఞం చేసిన ఫలితం .
- లక్ష్మి రమణ
భారతదేశం అగ్ని ఆరాధనే ప్రధానమైన సంప్రదాయంగా కలిగిన దేశం . ఈ దేశంలో యజ్ఞాలూ , యాగాలూ నిత్యమూ జరిగేవి . ప్రస్తుతం కూడా అవి అవిచ్ఛిన్నంగా దేశసౌభాగ్యం కోసం , విశ్వశాంతి కోసం , సర్వ జీవుల సౌభాగ్యం కోసం జరుగుతూనే ఉన్నాయి . యజ్ఞం అంటే కేవలం యజ్ఞకుండంలో చేసేది మాత్రమే కాదు. మన శరీరమే సిద్ధంగా ఉన్న యజ్ఞ కుండం. అందులో వేల్చే హవిస్సులు ఆ శరీరానికిచ్చే ఆహారం. దానివల్ల కూడా ప్రజా శ్రేయస్సు జరుగుతుంది. అలా జరిగే యజ్ఞంలో అగ్ని ఎలా ఉంటుంది ? ఆ అగ్ని రూపం ఏమిటి ?
అహం వైశ్వానరో భూత్వా
ప్రాణినాం దేహమా శ్రితః
ప్రాణాపాన సమాయుక్తః
పచామ్యన్నం చతుర్విధం
అన్నం లేదా ఆహారము భక్ష,భోజ్య, లేహ్య, చోష్యాలని నాలుగు రకాలు. ఈ ఆహారము ప్రాణుల దేహాలలోకి వెళ్లి, అక్కడ జటరాగ్ని ద్వారా ప్రాణాపాన వాయువులతో కలిసి శరీరానికి శక్తినిస్తుంది. అటువంటి జటరాగ్నిని నేనేనని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతారు. ఆ విష్ణువే అగ్ని అయినప్పుడు, మన శరీర వ్యవస్థే, హోమగుండమై సిద్ధంగా ఉంటుంది . ఈ జఠరాగ్నిలో మనం అన్నాన్ని హుతం చేస్తున్నాం . యజ్ఞంలో ఆహుతులని వేసినట్టు .
అలా హుతమైన ఆహారాన్ని స్వీకరించి, విభజించి, సారంగా, శక్తిగా మార్చి సర్వ ఇంద్రియాలకు ఆ శక్తిని పంపుతున్నాడు జటరాగ్ని స్వరూపమైన వైశ్వానరుడు . ఇలాగే యజ్ఞం జరిగేటప్పుడు అగ్నిలో హుతమైన పదార్థాన్ని దేవతలకు అగ్ని అందజేస్తాడు. అదేవిధంగా, ఇంద్రియాలకు ఈ అన్నశక్తిని అందజేస్తోంది జటరాగ్ని. ఇంద్రియాలకు అధిష్టాన దేవతలు ఉన్నారని ఇక్కడ మరోసారి గుర్తు తెచ్చుకోవాలి. కనుక అన్నం తినడం అంటే యజ్ఞం చేయడమే!
యజ్ఞం చేసేప్పుడు అందులో వేసే ద్రవ్యాలని యెంత పవిత్రంగా ఉంచుతామో , అంటే పవిత్రంగా తినే అన్నాన్ని కూడా వండాలి. ముందుగా పొయ్యి వెలిగించేప్పుడు , అగ్ని దేవునికి నమస్కారం చేసుకొని, పైన ఉంచిన గిన్నెలో నుండీ కొన్ని గింజల్ని తీసుకొని గిన్నె చుట్టూ తిప్పి అగ్నికి ఆహుతిగా ఇవ్వాలి . ఆ తర్వాత వండే ఆహారాన్ని ఈశ్వరునికి (ఇష్ట దైవానికి) నైవేద్యంగా సమర్పించేందుకు వండుతున్నాను. ఈ ఆహారం ఆయనకీ ప్రీతిని కలిగించుగాక అని భావించి , అగ్నికి నమస్కారం చేసుకోవాలి . అలా వండిన ఆహారాన్ని దేవునికి నివేదనగా పెట్టి తినాలి . ఇటువంటి ఆహారం మన శరీరం అనే యజ్ఞకుండంలో వేయదగిన హుతం . అది దేవతలకి ప్రీతి కలిగిస్తుంది.
అందుకే స్నానం చేసి వంట చేయమని , ఇంటి ఆహారమే తినమని శాస్త్రం చెబుతుంది . ఈ విధంగా తీసుకునే ఆహారం శరీరానికి , సూక్ష్మ శరీరానికి కూడా తృప్తినిస్తుంది . ఆయుష్షుని వృద్ధి చేస్తుంది . శక్తిగా , రేతస్సుగా మారిన ఆహారం చక్కని సత్సంతానాన్ని అనుగ్రహిస్తుంది . దేవతల ఆశీస్సులని అందజేస్తుంది . దీని అర్థం అన్నం తింటే సరిపోతుంది , యజ్ఞయాగాదులు చేయనవసరం లేదు అనిమాత్రం కాదని గ్రహించాలి . అన్నం తినేప్పుడు తినేందుకు పుట్టమని తినకూడదు . ఈశ్వరునికి అర్పిస్తున్నాం అనే భావనతో స్వీకరించాలి అని చెప్పడం. అదికూడా యజ్ఞం వంటిదే !