సంక్రాంతి పండుగంటే, ప్రకృతి పండుగ!
సంక్రాంతి పండుగంటే, ప్రకృతి పండుగ!
లక్ష్మీ రమణ
సంక్రాంతి పండుగంటే, ప్రకృతి పండుగ . సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలం . రైతులకి గాదెల నిండా ధాన్యం నిండి ఆనందం మిన్నంటే సమయం. ఆహారాన్ని అనుగ్రహించిన ప్రకృతీ మాతకి బోలెడన్ని ధన్యవాదాలు తెలిపే పండుగ సంక్రాంతి. ఈ పండుగ కాంతి సిటీలోని కాంక్రీటు అరణ్యాలకన్నా , ప్రకృతి పచ్చని పట్టు చీర కట్టుకొని , గొబ్బిపూల ముడుల్లో , బంతిపూలు తురుముకొని , అందాల ముగ్గులతో వయ్యారాలు పోయే పల్లె సీమల్లో అడుగడుగునా పురివిప్పిన మయూరమై నాట్యమాడుతూ కనిపిస్తుంది. అందుకే ఈ సంబరాలకు సరైన చిరునామాలు పల్లెలే ! పల్లెలు చల్లగా ఉంటె, దేశమే సుభిక్షంగా ఉంటుంది. ఈ సంబరాల సందడిని సహజంగా ఆస్వాదించాలంటే, పల్లెకి పోవాల్సిందే ! మరింకెందుకాలస్యం … పదండి పోదాం పల్లెకు !
“మేషాదిషు క్రమేణ సంచరత సూర్యస్య పూర్వస్మాదుత్తరరాశౌ సంక్రమణప్రవేశ సంక్రాంతి” అని కదా ఆర్యోక్తి !
సూర్య భగవానుడు ప్రాణికోటి మూలాధారమైన ప్రత్యక్ష దైవం . సూర్యభగవానుడు నెలకొక రాశిలో ప్రవేశిస్తూ ఉంటాడు . ఇదే సంక్రమణం . దీనినే సంక్రాంతి అంటారు . అలాటప్పుడు సంక్రాంతులు నెలకొకసారి వస్తాయి కదా ! సంవత్సరానికి ఒకసారి జరుపుకోవడం లోని విశేషత ఏమిటి ? మనం పండుగగా జరుపుకొనే సంక్రాంతి సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు జరుపుకునేది . ఈ మకర సంక్రాంతి మిగిలిన సంక్రాంతులన్నింటిలోకీ ప్రత్యేకతని కలిగి ఉంది . మార్గశిర మాసం వరకూ సూర్యుడు దక్షిణాభిముఖంగా ఉంటాడు. కాబట్టి అది దక్షిణాయనం . ఆ తర్వాత ఆరునెలలూ ఉత్తరానికి అభిముఖుడై ఉంటాడు . కాబట్టి ఆ కాలం ఉత్తరాయణం.
ఉత్తరాయణ కాలం :
ఉత్తరాయణ కాలం పవిత్రమైనది . ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించినవారికి ఉత్తమ గతులు కలుగుతాయని విశ్వాసం . ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం లోనే ఈ సంక్రాంతి పండుగ వస్తుంది . సంక్రాంతి పండుగ ఏవారం నాడు వస్తుందో దాన్ని అనుసరించి కూడా ఈ పండుగని వేరు వేరు పేర్లతో పిలుస్తూ ఉంటారు . మకర సంక్రాంతి సంబరాలు పండుగకి నెలరోజులు ముందు నుండే అంటే, ధనుర్మాసారంభం నుండే ప్రారంభం అవుతాయి .
సంక్రాంతి సందడి :
సంక్రాంతి పండుగకి నెలనాళ్ళ ముందునుండే ఈ సంబరాలు మొదలవుతాయి. సూర్యమానానుసారం ధనుర్మాసం మొదలు తోటే ఈ పండుగ సంబరం మొదలవుతుంది . ధనుర్మాసమంతా నెలపట్టుగా సాగిన హరిహరుల ఆరాధనలు, విశేషించి కృష్ణ ఆరాధన సంక్రాంతితో ముగుస్తుంది . ఆ సందడి గొప్పగా ఉంటుంది . పల్లెల్లో సంక్రాంతిని మించిన పండుగ మరొకటి ఉండదంటే అతిశయోక్తి కాదు .
“ అంబపలుకు జగదాంబ పలుకు కంచిలోని కామాక్షి పలుకు” అంటూ ఇంటి ముందర సందడి చేసే బుడబుక్కలవాళ్ళ సవ్వడితో ఈ సంక్రాంతి మొదలవుతుంది .
ఆ వెంటనే , మూపురాన్ని రంగురంగుల బట్టలతో అలంకరించుకొని, కొమ్ములకు రంగు దారాలు , పూసలు, గవ్వలూ చుట్టుకొని , నడుముల నుండీ వేళ్ళాడే మువ్వల పట్టీలు, కాళ్ళకి గజ్జెలు కట్టుకొని వాయిద్యాలకి అనుగుణంగా నాట్యం చేస్తూ, అపర నందీశ్వరుని లాగా వచ్చేస్తాయి గంగిరెద్దులు. ‘ అయ్యగారికి దండంపెట్టు , అమ్మవారికి కాళ్ళకి మొక్కు ‘ అని గంగిరెద్దుల దొర చెబుతుంటే, అలాగే చేసే గంగిరెద్దులు నాయన మనోహరంగా ఉంటాయి . ఈ ఆట చూస్తుంటే, మనం వినాయక చవితికి చదువుకునే గజాసురుడి వృత్తాంతం కళ్ళకి కట్టక మానదు .
ఇక తలమీద అక్షయపాత్ర పెట్టుకొని, నుదుటన తిరుచూర్ణం ధరించి , తంబూరా మీటుకుంటే వచ్చే హరిదాసు ‘ హరిలోరంగ హరి అంటూ వచ్చి, కృష్ణార్పణం అనగానే , ఆ దేవర్షి నారదుడే కిందికి దిగివచ్చాడేమో అని బ్రమించడంలో తప్పులేదనిపిస్తుంది. హరి భక్తులకి మేమైనా తక్కువా అంటూ పోటీ పడతారు అపరశివుల్లా జంగమదేవరలు. ఒక్క శంఖానాదంతో పరిశరప్రాంతాలలోని దుష్టశక్తులన్నింటినీ తరిమికొడతారు.
ఇక పగటి వేషగాళ్ళు , పులి వేషగాళ్ళు , కాశికావిళ్ళు , దొమ్మరిఆటగాళ్ళు , కోయలు, చెంచుల వేషాలు , కోతులనాడించేవారితో పల్లెలన్నీ సందడిగా మారిపోతాయి . కోళ్ల పందాలు, ఎడ్ల పందాలు వంటివి నిషేదాజ్ఞల మధ్యలోనూ, సంప్రదాయమైన సరదాకోసం అక్కడక్కడా జరుగుతూనే ఉంటాయి .
సంతోషముగా కేరింతలు కొడుతూ పిల్లలు రివ్వురివ్వున ఎగరేసే గాలిపటాలు ఆ గగనతలంలోకి దూసుకెళ్లి, సూర్యుణ్ణి ఆహ్వానిస్తున్నట్టుగా ఉంటాయి . ఈ సందడికి, సంబరానికి, సంతోషానికి స్వాగతం పలుకుతూ పల్లెలన్నీ కొత్త పెళ్లి కూతుళ్ళలాగా సింగారం చేసుకుంటాయి.
పల్లెల్లో సంప్రదాయం:
గ్రామీణ ఆడపడుచులంతా ఇంకా సూర్యుడు పలుకరించక ఉండే, చలి పులిని ఆవలికి నెట్టి చక్కని చుక్కలుగా తామే ప్రతి ముంగిలిలోనూ వెలుగులు నింపుతారు. ఆవుపేడని తీసుకొచ్చి, ముంగిట్లో ఆ పేడ కలిపిన నీళ్లు జల్లి, రంగురంగుల రంగవల్లులు తీరుస్తారు. చుక్కలు , గీతలు, బొమ్మలు , పూలు , లతలు ఆ ముగ్గుల్లో ముగ్ధంగా ఒదిగిపోతాయి. వాటిపైన పసుపుకుంకుమలు పెట్టుకొని, కొప్పున బంతులు , చేమంతులు , గుమ్మడిపూలు తురుముకొని గొబ్బెమ్మలు ఈముగ్గుల్లో పెద్దముత్తయిదువుల్లా కూచుంటాయి . గౌరమ్మ ప్రతిరూపాలయిన గొబ్బిళ్ళకన్నా పెద్ద ముత్తయిదువ ఏవరంటా ! ఈ గొబ్బిళ్ళ చుట్టూ ఆడపిల్లలు చప్పట్టు కొడుతూ వలయాకారంలో తిరుగుతూ ‘ గొబ్బియల్లో గొబ్బియల్లో… చందమామకు గొబ్బియల్లో ‘, ‘ చందమామకు పిల్లలెందరు .. నీలగిరి కన్యాలందరు ‘ అని చక్కని జానపదాలు పాడుతూ ఆడుతుంటారు.
ఇలా నెలనాళ్ళ పండుగ రోజుల క్రాంతి ఒకఎత్తయితే, ఇక సంక్రాంతి పండుగ కాంతి మరో ఎత్తు. సంక్రాంతి ముందు రోజుని భోగి అంటారు . భూదేవి అంశతో జన్మించిన గోదాదేవి ధనుర్మాస వ్రతాన్ని చేసి, రంగనాథుణ్ణి నాధునిగా పొందింది ఈరోజునేననేది విశ్వాసం . ఆ విధంగా సకల భోగాలనూ ప్రసాదించేది కాబట్టి అది భోగి అయ్యింది .
భోగి :
భోగి తెల్లవారు ఝామున భోగిమంటలు వెయ్యడం ఆచారం . ఆనాటి పిల్లలకి దృష్టిదోషాలు తొలగిపోవడానికి రేగిపళ్ళు తలపైన పోస్తారు . వీటినే భోగిపళ్ళు పోయడమని వ్యవహరిస్తుంటారు . ఇక ఆమరుసటి రోజు సంక్రాంతి .
సంక్రాంతి :
సంక్రాంతి రోజున ప్రత్యేకంగా నువ్వుల నూనెతోటి దీపారాధన చేస్తారు . ఉత్తరాయణ పుణ్యకాలంలో పితృదేవతలకు ఉత్తమగతులు ప్రాప్తించాలని తర్పణాలు విడుస్తారు . సంక్రాంతి రోజునే బొమ్మల కొలువును ఏర్పాటు చేయడం ఒక సంప్రదాయం . ముత్తయిదువులందరినీ పేరంటానికి పిలిచి , తాంబూలం మివ్వడం చాలా అద్భుతమైన వేడుకగా ఉంటుంది .
కనుమ , ముక్కనుమ :
ఇక, ఆ తరువాతి రోజు కనుమ పండుగ . ఈ పండుగ ప్రత్యేకత వృత్తిలవారీగా వారి పనిముట్లని , అలాగే,రైతులు పశువులనీ పూజించుకుంటారు . మరుసటి రోజు ముక్కనుమ మూడురోజుల బొమ్మలకొలువు ఈ రోజుతో ముగుస్తుందన్నమాట .
ఇలా ,కోలాహలంగా సందడిగా,చక్కని సంప్రదాయాలతో విలసిల్లే సంక్రాంతి కాంతి కాంక్రీటు అరణ్యాలలో (సిటీలలో ) కన్నా గ్రామీణ ప్రాంతాలలోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఏ గుమ్మం చూసినా, పసుపు కుంకుమతో , మామిడి తోరణాలతో శోభిల్లుతూ పండు ముత్తయిదువలాగా, దైవకాలతో ఉట్టిపడుతూ ఊరు ఊరంతా సంబరంగా , కళాత్మకంగా ఉండడమే సంక్రాంతి ప్రత్యేకత. అందుకే కదా ! సిటీలన్నీ కూడా సంక్రాంతి పండుగ వచ్చిందంటే, దాదాపుగా ఖాళీ అయిపోతాయి . పల్లెలన్నీ , తిరిగి తమ గూటికి చేరిన చిలుకలతో నిండుగాకళకళలాడతాయి . మనసుంటే, మార్గముండకపోతుందా? అందుకే , సిటీల్లోనే కాదు విదేశాల్లోనూ మనవాళ్ళు మూలాలు మరువకుండా , ఈ దివ్య కాంతుల సంక్రాంతిని జరుపుకుంటున్నారు . ఇది ఇలాగా మరింత సంప్రదాయబద్ధంగా మన ముందరి తరాలవారూ జరుపుకోవాలనీ ఆశిస్తూ , సంక్రాంతి శుభాకాంక్షలతో శలవు !
#sankranti #pongal
Tags: Sankranti, Pongal, bhogi, kanuma, haridasu,