Online Puja Services

జటాధరుడు పాండురంగడా ? శివుడా ?

18.119.106.66

జటాధరుడు పాండురంగడా ? శివుడా ?
- లక్ష్మి రమణ 

జటాధరం పాండురంగం అని దత్త ప్రార్థన . జటాధరుడు శివుడు కదా ! పాండురంగడు నయన మనోహరమైన సౌందర్య శోభన మూర్తి . ఆయనకీ జటలులేవుకదా ! అయినా ఈ దత్త ప్రార్థనలో జటలు ధరించిన పాండురంగనిగా ఎందుకు వర్ణించారు ? ఇక్కడ పాండురంగనిగా దత్తస్వామిని భావన చేసినప్పుడు ఆయన అదే సౌందర్యమూర్తిగా దర్శనమివ్వాలి కదా !!

రంగ అంటే నర్తనం, ఈ మాయా ప్రపంచమనే నాటకంలో కర్త తానై నర్తింపచేసేవాడు కాబట్టి, ఆయనకీ రంగడు అని పేరు.  లక్ష్మి దేవి సహితుడై  ఉండి సకల లక్ష్యాలనీ నడిపేవాడు కాబట్టి శ్రీ రంగడు. 

మరో అర్థంలో రంగ అంటే యుద్ధం. మనోనిశ్చయాన్ముఖుడైన జీవుడిని భవపాశాల నుంచి వేరు చేసి, అతన్ని నిశ్చయమైన మోక్షపథమున నిలుపుతాడు కాబట్టి ఆయన శ్రీ రంగడు.

శ్రీరంగడు పోషకుడైన విష్ణు స్వరూపం. సకల భోగలాంఛనాలతో, సకల అలంకారాలతో  అత్యంత శ్రీమంతంగా స్వామి ఉంటారు. తన భక్తుడైన పుండరీకుడికి మోక్ష సిద్ధిని ప్రసాదించడానికి స్వస్వరూపంతో పాండురంగడిగా వచ్చి నిలిచారు.  మాతాపితరుల సేవకు బద్ధుడైన తన భక్తుని మాట కోసం తాను శిలలాగా నిరీక్షించగలను అని చెప్పడానికే స్వామి అలా దయచేశారు . 

 దత్తస్వామి త్రిమూర్త్యాత్మకుడు. ఆయన అటు విష్ణువు, ఇటు శివుడూ , బ్రహ్మ కూడా ! అందుకే  కొలిచినవారికి కొలిచిన రూపంతో అనుగ్రహిస్తాడు.  దానిలో ఒక పార్శ్వంగానే పాండురంగని రూపంగా భక్తులు కొలుచుకుంటారు. అక్కడ శివుడూ , పాండురంగాడూ కలిసి ఉన్నట్టే కదా ! అప్పుడు త్రిమూర్త్యాత్మకమైన ఆ దత్తుడు జటని ధరించడంలో ఆశ్చర్యం లేదుకదా ! అదన్నమాట సంగతి !

శుభం !!

#panduranga #datta #shiva

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore