పితృదేవతల అనుగ్రహాన్నిచ్చే మకర సంక్రాంతి .

పితృదేవతల అనుగ్రహాన్నిచ్చే మకర సంక్రాంతి .
- లక్ష్మి రమణ
పితృశాపాల కారణంగా వివాహాదులు కాకపోవడం, వివాహాలు నిలువకపోవడం, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, పిల్లలు పుట్టకపోవడం, పుట్టిన పిల్లలు రోగిష్టి వారు కావడం, ఇంటిలోని వారికి రోగాలు సోకి వైద్యులు ఇల్లు దోచుకుపోవడం, వ్యాపారాలు కలసిరాకపోవడం, ధనం రాకపోవడం, అప్పులపాలైపోవడం, వచ్చిన ధనం నిలువకపోవడం, బ్రతికిన పిల్లలు తల్లితండ్రుల మాటలు వినకపోవడం, వారికి చదువు సంధ్యలు రాకపోవడం, వర్ణసాంకర్యాలకు పాల్పడడం వంటి వ్యవహారాలతో వారి సాంసారిక జీవితాలు నరకం అవుతాయి. వీటి నుంచీ తప్పించుకోవడానికి ఒకే మార్గం ఉంది.
దైవగణాలకి సంబంధించి దక్షిణాయనం రాత్రి కాలం . ఉత్తరాయణం ఉదయపు కాలం . అందులోనూ మార్గశిరం బ్రహ్మ ముహూర్త కాలం అని చెప్తారు . ఆ తర్వాత పుష్య మాసం. ఉదయకాలం. ఈ మాసంలోనే మనకి సంక్రాతి పండుగ వస్తోంది . మకర సంక్రాంతి సూర్య భగవానుడు మకర రాశిలో ప్రవేశించే పుణ్యమైన ఘడియ. ఇక్కడ నుండీ ఉత్తరాయిణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. దేవతలు మేల్కొని వుంటారన్నమాట. ఈ కాలంలో చేసే పూజ, జపము, దానము, వ్రతాదులు విశేషమైన ఫలితాలనిస్తాయి. ఈ సంక్రాతి రోజున చేయాల్సిన మరో గొప్ప విధి కూడా ఉంది .
దేవ మార్గం ప్రారంభమయ్యే రోజు ఈ సంక్రాంతి. స్నానము దానము జపము వ్రతాదులు శేష ఫలితాన్ని ఇస్తాయి. ఈ కాలంలో గుమ్మడి పువ్వు, గుమ్మడి పండ్లు, వస్త్రాలు దానం చేయటం ఆచారం. పంట చేతి కంది వచ్చిన నాడు ఈ పర్వం తో ఇంటింటా శోభ వెల్లి విరుస్తుంది. విష్ణు సహస్రనామ పఠనం ఈ రోజు శుభ ఫలితాలను ఇస్తుంది.
ఇంకా ఈ కాలం దేవా పితృ పూజలకు దివ్యమైన కాలం పితృదేవతలను ఉద్దేశించి చేసే తర్పణాదులు, దానాలు పుణ్యప్రదమైనవి. పితృ దేవతలకు ప్రీతికరమైనవి సంవత్సరంలో మొత్తం 96 రోజులు. 14మన్వాదులు, 16మహాలయాలు, 4యుగాదులు, 12సంక్రాంతులు, 12అమావాస్యలు, 13వ్యతీపాతములు, 13వైధృతులు, 12అన్వష్టకలు కలిపి 96 దినాలు. వీటినే షణ్ణవతులు అంటారు.
వీటిల్లో ఒకటైన సంక్రమణాలు ఒక ఏడాదిలో పన్నెండు ఏర్పడతాయి. ఆ సంక్రమణాలలో ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే మకర సంక్రాంతి పితృ దేవతలకి మరింత ఉత్తమ గతులనిచ్చేది. భౌతిక శరీరం మొదటిది. కనిపించేది. రెండవది ప్రేత శరీరం. మూడవది ఆత్మ, సూక్ష్మ శరీరం. ఈ మూడింటి ప్రతీకలు మహాలయ సంకల్పంలో చెప్పుకునే వసు, రుద్ర, ఆదిత్య రూపాలు. ఈ మూడు రూపాలలో పితరులకు, అగ్నిముఖం, బ్రాహ్మణ భోజనం, ఉపవాసం నాలుగు పద్ధతులలో శ్రాద్దం ఆచరణీయం.
కాబట్టి, మకర సంక్రమణం నాడు పితృ దేవతలకు నువ్వులు, నీళ్లు ఖచ్చితంగా వదలాలి. వారి పేరిట ఆవుకి మేత పెట్టాలి. సర్వ దేవతా స్వరూపమైన ఆవుకి ఆహారం ఇవ్వడం వలన పితృదేవతలు తృప్తిని పొందుతారు . వారి పేరిట బ్రాహ్మణునికి స్వయం పాకం ఇవ్వడమో , పదిమందికి అన్నదానం చేయడమో చేయాలి .
పితృదేవతల శాపాల నుండీ తప్పించుకోవడానికి ఒకే మార్గం ఉంది. గోసేవను సర్వభవసాగర ముక్తి మంత్రంగా చెప్పారు. ఆవులోనే సకల దేవీదేవతలతోపాటు పితృదేవతలు కూడా ఉంటారు కనుక విష్ణుపురాణాది మహాపురాణాలలోని పితృగీతల్లో చెప్పిన ప్రకారం గోసేవ చేయమని సూచించడం జరిగింది . కనుక ఆ ప్రకారం చేసి , దేవతలకి కూడా పూజ్యులైన ఆ పితృదేవతల అనుగ్రహాన్ని పొందుదాం . ఈ సంక్రాంతికి వారి పేరిట దానాలు, గోసేవలు చేసి తరిద్దాం .
శుభం !!
#sankranthi #pongal