భోగభాగ్యాలనిచ్చే భోగి !

భోగభాగ్యాలనిచ్చే భోగి !
- లక్ష్మీరమణ
ధనుర్మాసం భోగి పండుగతో ముగుస్తుంది . అప్పటికి పంటలు (పౌష్యములు) అన్ని చక్కగా ఇంటికి చేరుకుంటాయి . రైతులందరూ సంతోషంగా ఉంటారు . వారికి పంటలు పండించడంలో సహకరించిన పశువులని కూడా ఈ కాలంలో పూజించి కృతఙ్ఞతలు తెలియజేస్తారు . ఈ ధనుర్మాస పర్యంతమూ భూదేవి ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. విశేషించి ఇది ప్రక్రుతి ఆరాధనకు సంబంధించిన పండుగ సమయం . సంక్రాంతి పండుగ భోగి పండుగతోనే మొదలవుతుంది . ఆ విశేషాలని ఇక్కడ తెలుసుకుందాం.
ఈ మాసంలో భూదేవిని రంగవల్లికలతో అలంకరిస్తాం . ముగ్గులలో పసుపు కుంకుమలు, పూలు, రేగిపండులు పెట్టి ఆ దేవతని ఆరాధిస్తాం. ఇందులో ముగ్గులపై ఉపయోగించే బియ్యపు పిండిని సూక్ష్మ జీవులకి ఆహారంగా అందించడం అనే గొప్ప కారుణ్యం కూడా దాగుంది . ధనుర్మాసంలోనే పంటలన్నీ మనకి చేతికొస్తాయి. మనకి పౌష్యములు అనుగ్రహించినందుకు అమ్మని పౌష్య లక్ష్మీగా కొలుచుకుంటాం . భూమి పంచభూతాలలో ఒకటి. పంచభూతాలలో ఏ ఒక్కటి లేకపోయినా పౌష్యములు ఉండవు. అవి లేనినాడీ పోషణ జరుగదు కాబట్టి భూమి మీద మనుగడే ఉండదు. మనం పూజించే పోష్య లక్ష్మే గోదామాత .
ఆ భూమాతే గోదామాతగా ప్రభవించింది. ప్రకృతి స్వరూపంగా విరిసి పరమాత్మని చేరుకుంది. ఆవిడ శ్రీ రంగనాథునికి తాను ధరించిన తర్వాత, అవే పూలమాలలు సమర్పించేవారు . భూదేవిగా ఆమె పరమాత్మ కోసం పుష్పించి, ఆ విధంగా పరమ సౌందర్యం భక్తితో తదాత్మాతని పొంది, ఆ విధంగా భక్తిలో రమించడం ద్వారా తనని తాను అలంకరించుకొని, ఆ సౌందర్యప్రభలతో పరమాత్మను పొందారని కదా అర్థం. గోదామాతగా అమ్మ ఆచరించి మరీ, ఆ పరమ పురుషున్ని పొందడానికి కావలసింది భక్తి మాత్రమే అని మరో సారి చాటి చెప్పారు .
మరో విధంగా చూసినా పోషించేవాడు విష్ణువు . ఆ పోషణకి అవసరమైన సరుకు సమకూర్చేది పౌష్యలక్ష్మి. అందువల్ల వారిద్దరికీ ఉన్నది ప్రకృతీ పరమాత్మల సంబంధం .
ఇక్కడ అమ్మవారు తాను రచించిన పాశురాల్లోనూ అదే సందేశాన్నిస్తారు . చలి కాలం బాధిస్తోందని, బద్ధకించ వద్దు . ఇది పరమాత్మని చేరుకొనే సమయం . రండి మనందరమూ ఆ పరమాత్మ సన్నిధికి పోదామంటుంది . ఇక్కడ వణికించే చలికాలం , మనకున్న మోహబంధాలే తప్ప మరొకటి కాదు . పరమ ప్రకాశం ప్రభవించే చోట చీకటి, జ్ఞానజ్యోతి వెలిగేచోట అజ్ఞాన తిమిరాలు ఎలా ఉంటాయి ? అదే విధంగా ధనుర్మాసములో మనస్సనే ధనుస్సుకి భక్తి అనే బాణాన్ని సంధించి , భగవంతుని పొందడమే లక్ష్యంగా సాధన చేస్తే, తప్పకుండా దుర్లభమయిన ఆ పరమాత్మ సాన్నిధ్యాన్ని పొందగల్గుతాము .
అమ్మ గోదాదేవిగా మార్గాళీ వ్రతాన్ని ఆచరించి, రోజుకొక పాశురంతో పరమాత్మని అర్చించారు . ఆ వ్రత సమాప్తి జరిగి ఆమె స్వామిని చేపట్టి భోగములందిన రోజు భోగి . గోదాపాశురాలతో నిత్యమూ ఈ ధనుర్మాసంలో పూజించినవారికి, కాత్యాయనీ వ్రతాన్ని ఆచరించినవారికీ చక్కని, సద్గుణ సంపన్నుడైన వరుడు భర్తగా లభిస్తాడు .
భోగి రోజున తలంటి స్నానం చేసి భగవదార్చనలు చేయడం శ్రేయప్రదం. చలిమంటలు వేయడం ఈరోజున పాటించవలసిన ఆచారం.
పాఠకులకి భోగి పండుగ శుభాకాంక్షలతో , శుభం
#bhogi #sankranthi #kanuma
Tags: bhogi, sankranthi, kanuma, festivals