సంక్రాంతి పండుగ కూడా ముందుకు జరిగిపోయిందా ?
సంక్రాంతి పండుగ కూడా కలికాలం ప్రభావంతో ముందుకు జరిగిపోయిందా ?
సేకరణ
తెలుగునాట ప్రతిముంగిలికీ కాంతిని పంచె పండుగ సంక్రాంతి. ఈ పండుగ సాధారణంగా జనవరి 14న వస్తుంది . కానీ ఈ మధ్య కాలంలో ఒకటీ రెండు రోజులు ముందుకు జరిగిపోయినట్టుగా ఉంది . ఈ ఏడాది సంక్రాంతి 15న జరుపుకున్నాం కదా ! ఎందుకిలా జరుగుతోందా అని ఎప్పుడైనా ఆలోచించారా ?
సాధారణంగా, సూర్యుడు ధనూరాశి నుండి మకరరాశిలోకి ప్రవేశించిననాడే మకర సంక్రాంతి జరుపుకోవడం ఆనవాయితీ. ఇక ఈ రోజు నుండి మిధునరాశి లోకి ప్రవేశించేదాకా ‘ఉత్తరాయణ పుణ్యకాలం’గా వ్యవహరిస్తారు. ఇలా సూర్యుడు మకరరాశిలోకి వచ్చినప్పుడు దాదాపు 20 నిమిషాలు ఆలశ్యం జరుగుతూ ఉంటుంది . అలా ఆలశ్యం జరిగినప్పుడు ప్రతి మూడు సంవత్సరాలకూ ఒక గంట , ప్రతి 72 ఏళ్లకీ 24గంటలుగా అంటే, ఒక రోజుగా మారుతోంది . ఆ విధంగా ఆలోచించి 2008 నుండీ సంక్రాంతి ఆగమనాన్ని లెక్కించి చూడండి !
2008వ సంవత్సరం నుండి సంక్రాంతి పండుగ జనవరి 15న రావడం ప్రారంభమయింది. అంతకుముందు 1935 నుండి 2007 వరకు జనవరి 14ననే సంక్రాంతి పండుగ. అంటే ఈ కాలం 72 సంవత్సరాలు . ఇలా ప్రతీ 72 సంవత్సరాలకు ఒకసారి పండుగ ఒకరోజు తర్వాతకు వెనుకకి మారుతుంది. అంటే ,
1935 నుండి 2007 వరకు జనవరి 14న,
2008 నుండి 2080 వరకు జనవరి 15న,
2081 నుండి 2153 వరకు జనవరి 16న సంక్రాంతి పండుగ వస్తుందన్నమాట
ఈ లెక్కన, ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం, 72 ఏళ్లకొకసారి సంక్రాంతి తర్వాతి రోజుకు మారుతుంది. అంటే, వచ్చే ఏడాది కూడా సంక్రాంతి జనవరి 15ననే వస్తుందన్నమాట !!