కాంతివేగాన్ని లెక్కించి చెప్పిన ఋగ్వేదం !
కాంతివేగాన్ని లెక్కించి చెప్పిన ఋగ్వేదం !
లక్ష్మీ రమణ
గురువుగారడిగితే, తనకి వేదాలకి భాష్యం రాయాలని ఉందని చెప్పాడా విద్యార్థి. యవ్వన ప్రాయం నుండీ తానూ నేర్చుకున్న విజ్ఞానాన్ని , అందుబాటులో ఉండేలా, అందరికీ అర్థమయ్యేలా మలిచి అందించాలన్న ఆ కుమారవ్యాసుడు సాయణుడు . కాంతివేగాన్ని ఋగ్వేదం చెప్పిందన్న విషయం ఈయన రచించిన భాష్యం ద్వారా మనకి తెలుస్తోంది . ఆ వివరాలు లెక్కలతో సహా మీకోసం .
ఏకశిలానగరం (నేటి వరంగల్) లో ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ముగ్గురు మగ పిల్లలలో పెద్దవాడు మాధవుడు (విద్యారణ్యులు). వారి తల్లిదండ్రులు మాయణాచార్యుడు, శ్రీమతిదేవి. వారిది పేద,పండిత కుటుంబం. మాధవుని తమ్ముళ్ళు సాయణుడు, భోగనాధుడు. భోగనాధుడు మంచి కవిగా పేరు తెచ్చుకున్నాడు. చిన్నతనంలోనే మరణించాడు. మాధవ, సాయణులు శృంగేరీపీఠంలో ఆశ్రయంపొందారు. శృంగేరి పీఠాధిపతి వీరికి సన్యాసదీక్ష ఇచ్చారు. మాధవులకు విద్యారణ్యులని ఆశ్రమనామం ఇచ్చారు. భారతి కృష్ణ తీర్థ, శంకరానందుల దగ్గర మాధవులు శాస్త్రాభ్యాసం చేశారు. ఆ విధంగా అన్నాతమ్ముళ్ళిద్దరు సన్యాసం స్వీకరించారు (క్రీ.శ.1331).
ఆ మాధవుడే అనంతర కాలంలో హరిహరరాయలు , బుక్కరాయలకు విజయనగర సామ్రాజ్య స్థాపనకు ప్రేరణనిచ్చి విద్యారణ్య స్వామిగా ప్రసిద్ధి కెక్కారు . ఆయన తమ్ముడు సాయణుడు లేదా సాయణాచార్యులు . ఈయన విజయనగర సామ్రాజ్యంలో హరిహర రాయలు , బుక్కరాయలు కాలంలో వారి ఆస్థానంలో ఉండేవారు . వేదాలకి భాష్యాలు రాశారు . ఎన్నో ప్రాచీన గ్రంథాల మీద వ్యాఖ్యానాలు వ్రాశారు . ఋగ్వేదంలో సూర్యుణ్ణి స్తుతిస్తూ ఇలా అంటారు .
తథా చ స్మర్యతే యోజనానాం సహస్రే ద్వే ద్వే శతే ద్వే చ యోజనే
ఏకేన నిమిషార్ధేన క్రమమాణ నమో 2స్తు త ఇతి||
-ఋగ్వేద భాష్యం 1.50 సూక్తము,4 వ శ్లోకం
తాత్పర్యం: అరనిముషానికి 2202 యోజనాలు ప్రయాణించగల నీకు నమస్కారము – అని . ఇది సూర్య స్తుతి కనుక ఆ గమనం సూర్యుడిది అని అనుకోవాల్సి వుంటుంది.
కాని పద్మాకర్ విష్ణు వర్తక్ అనే రచయిత ఆ గమనం సూర్యుడుది కాదని, కాంతిదని సూచించాడు. ఎందుకంటే,
1 యోజనం = 9 మైళ్ల 110 గజాలు = 9.065 మైళ్లు.
అలాగే మహాభారతంలో శాంతి పర్వం ప్రకారం:
1 నిమేషం = 8/75 సెకన్లు.
ఈ అంచనా బట్టి పైన శ్లోకంలో ఇవ్వబడ్డ వేగాన్ని లెక్కిస్తే దాని విలువ 187,084.1 మైళ్లు/సెకను అని వస్తుంది.
మేటి సంస్కృత పండితుడైన సర్ మోనియర్ విలియమ్స్ ప్రకారం:
1 యోజనం = 9 మైళ్ళు. ఈ అంచనా బట్టి పైన శ్లోకంలో ఇవ్వబడ్డ వేగాన్ని లెక్కిస్తే దాని విలువ 186,413.22 మైళ్లు/సెకను అని వస్తుంది. ఇది విఖ్యాత శాస్త్రవేత్త రోమర్ చెప్పిన లక్కలకి ఇంచుమించుగా ఉండడాన్ని గమనించవచ్చు . ఇక , ఇప్పటి లెక్కప్రకారం కూడా ఈ వేగం 186300 మైళ్ళు/సెకన్.
ఇది అత్యంత ఆశ్చర్యజనకమైన ఫలితం. ఆరోజుల్లోనే మనవళ్ల దగ్గర ఇంటి ఖచ్చితమైన లెక్కలుండడం గొప్పవిషయం కదా ! పైగా ఇది వేదాలకి రాసిన భాష్యలో ఉంది. అంటే, వేదాలలో ఉంది . మన శాస్త్రాలు, మన విజ్ఞాన్, మన సంస్కృతి యెంత గొప్పవనే విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది .