Online Puja Services

మరో విద్యారణ్యుని అవసరం ఉందేమో !

18.188.113.189

ఇప్పటి కాలంలో మరో విద్యారణ్యుని అవసరం ఉందేమో ! 
సేకరణ   

అవి... మన పుణ్యభూమి భారత దేశంపై ముస్లింల దండయాత్రలు జరుగుతున్న రోజులు...! అప్పటికే అల్లా ఉద్దీన్ ఖిల్జీ సేనాధిపతి మాలిక్ గపూర్ ఉత్తర భారత దేశంలోని దేవాలయాలను ధ్వంసం చేశాడు. పెద్ద సైన్యంతో వచ్చి దక్షిణ భారత దేశంలో నరమేధం సృష్టించాడు. అన్ని ప్రముఖ దేవాయలను నాశనం చేశాడు. వేలాది మంది ప్రజలు బలవంతంగా ఇస్లామ్ మత మార్పిడిలుకు గురయ్యారు. స్వధర్మానికి, సంస్కృతికి ఆపద వాటిల్లిన సమయం అది .  ఈ విపత్కర పరిస్థితుల్లో ఓ వెలుగు రేఖ ఉదయించింది. భారతజాతిలో తిరిగి స్వధర్మ స్ఫూర్తిని నింపింది. ఆ వెలుగు రేఖయే శ్రీ విద్యారణ్య స్వామి.

ఇది 750 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. కాంచీపురం పట్టణంలోని కంచికామకోటి పీఠాధిపతి శ్రీవిద్యాతీర్థ స్వామి వారు తన శిష్యులతో కలిసి కూర్చుని ఉన్నారు. వాళ్ళతోపాటు ఆ ప్రాంతానికి చెందిన రాజు కూడా ఉన్నారు. స్వామిజీ తన శిష్యుల యోగ్యతలను పరీక్షించదలిచి మీ జీవిత లక్ష్యం ఏమిటీ అని శిష్యులందర్నీ అడగారు. ఒక శిష్యుడు నేను రాజు కొలువులో ఉద్యోగం చేయాలనుకుంటున్నానన్నాడు. వెంకటనాథుడనే శిష్యుడు, నేను రామానుజాచార్య బోధనలను ప్రచారం చేయాలనుకున్నానన్నాడు. సుదర్శన్ భట్ అనే శిష్యుడు ,నేను శ్రీరంగం వెళ్ళి రంగనాథుని సేవలో నా శేష జీవితం గడపాలనుకుంటున్నాను. అలాగే తాను ఉత్తమ పండితుడ్ని కావాలనుకుంటున్నానని భోగనాథుడనే శిష్యుడు అన్నాడు. మరొక శిష్యుడు సాయణుడు, తాను నాలుగు వేదాలకు భాష్యం వ్రాయాలని, వివిధ వేదాంత మార్గాల సారాన్ని క్రోడీకరించాలని అనుకుంటున్నాన్నాడు.

ఇక చివరకు మిగిలింది మాధవుడనే శిష్యుడు మాత్రమే..! గురు దేవులు విద్యా తీర్థ సరస్వతి స్వామి వారు...మాధవుడి వైపు చూశారు. అప్పుడు మాధవుడు గురుదేవా మీ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. మనష్యుడిలో అహంకారం ఉన్నంతవరకు అతడేమి సాధించలేడు. కాని భగవంతుడి దయ ఉంటే నేను... సనాతన హిందూ ధర్మ సేవకే నా జీవితం అంకితం చేయాలనుకుంటున్నాను. ప్రస్తుతం విధర్మీయులైన ముస్లింల దండయాత్రలతో సమస్త దేశం కాకవికలైంది. కనీసం దక్షిణ భారతాన్ని ఈ యవనుల నుంచి రక్షించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం స్వార్థమనే అజ్ఞానంతో...నిద్రావస్థలో ఉన్న భారతీయుల్లో జాతీయ చైతన్యాన్ని మేల్కొల్పటానికి నేను కృషి చేస్తాను. నేను భారత దేశ స్వాతంత్ర్య రక్షణకు నా జీవితాన్ని అంకితం చేస్తాను అన్నాడు. అలనాడు జగద్గురు శంకరాచార్యుల వారు ధర్మస్థాపన చేసిన విధంగానే హిందూ ధర్మ స్థాపన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన వారు విద్యారణ్యుల వారు.

మాధవుని సమాధానం విన్న శ్రీ విద్యాతీర్థ స్వామి ఆనందం వ్యక్తం చేశారు. ‘కుమారా!సమాజ సేవ కోసం , ధర్మరక్షణ కోసం, నువ్వు నీ జీవితాన్ని అంకితం చేయడం చాలా గొప్ప విషయం. నీ ధ్యేయ సాధనలో నీకు తప్పక విజయం లభిస్తుందని’ ఆయన ఆశీర్వదించారు. ఈ విధంగా గురువు ఆశీర్వాదం పొందిన మాధావాచార్యుడే అనంతర కాలంలో శ్రీ విద్యారణ్య స్వామి వారిగా ప్రసిద్ధి చెందారు. 

పూర్వాశ్రమంలో వారు వరంగల్ జిల్లాకు చెందిన వారు. స్వామి వారు అన్ని లౌకిక విద్యలలో పండితుడు. ఆయన సాక్షాత్తు దక్షిణామూర్తి అవతారమేనని ప్రజల విశ్వాసం. గురువు ఆశీస్సులు పొందిన ఆయన... దక్షిణ భారతంలో హిందుత్వానికి, హిందూ సంస్కృతికి వచ్చిన ఆపదను తొలగించాడానికి కృషి చేయాలని నిర్ణయించుకున్నారు. తాను నిత్యం ఆరాధించే భువనేశ్వరీమాత దయతో ఒక మంచి హిందూ రాజ్యాన్ని స్థాపించాలి. ఈ రాజ్యం ద్వారా విదేశీ దురాక్రమణదారులందరినీ తరిమికొట్టాలి. అందుకే భువనేశ్వరీమాత ఆశీస్సులు పొందాలి. ఈ విధమైన తీవ్ర ఆకాంక్ష మాధవుడి మనస్సులో నిరంతరం జ్వలిస్తుండేది.

అనేక ప్రాంతాలు తిరిగిన తర్వాత మాధవుడు...పంపా క్షేత్రానికి తిరిగి వచ్చాడు. అప్పటికి ఆయన తల్లిగారు మరణించారు. భార్య కూడా అకాల మృత్యువునుకు గురైంది. విధి ఆయన్ను కుటుంబ బాధ్యతల నుంచి పూర్తిగా విముక్తుడ్ని చేసింది. ఇక పూర్తిగా తన సమాయాన్ని దేశమాత సేవకే వినియోగించాడు. శృంగేరీ పీఠాధిపతి శ్రీ భారతీ కృష్ణ తీర్థ స్వామి వారి వద్ద మాధవుడు సన్యాసదీక్ష తీసుకున్నారు. కాషాయ వస్ర్తాలు ధరించిన ఆయనకు విద్యారణ్యగా నామకరణం చేశారు.

మరోవైపు కుమ్మట దుర్గానికి రాజైన కంపిలరాయుడి రాజ్యంపై తుగ్లక్ సైన్యాలు దాడి చేశారు. ఈ రాజ్యకోశాధికారి సంగమ దేవుడు. ఆయనకు ఇద్దరు కుమారులు వారు హరిహరి రాయలు, బుక్కరాయలు. వీరిని ప్రజలు హక్క,బుక్క అని పిలిచేవారు. దుర్గంపై దాడి జరిగిన సమయంలో సజీవులుగా మిగిలిన రాజబంధువుల్లో 11 మందిని ఢిల్లీకి తీసుకు వెళ్లారు. వారిని బలవంతంగా మతం స్వీకరించేటట్లు చేశారు. అయితే వారు పేరుకు ఇస్లామ్ లోకి మార్చబడినా కూడా, అవకాశం దొరికితే తిరిగి స్వధర్మం స్వీకరించేందుకు ఎదురు చూస్తున్నారు. దక్షిణ భారతంలో అలజడులు చెలరేగడంతో...వీరిని విడుదల చేసిన తుగ్లక్ కొంత సైన్యాన్ని ఇచ్చి దక్షిణాదికి పంపాడు. ఇదే అదనుగా తప్పించుకున్న ఈ ఇద్దరు అన్నదమ్ములు విద్యారణ్య స్వామిజీని కలిశారు. స్వామిజీకి శుద్ధి కార్యక్రమంతో హక్క,బుక్కలను తిరిగి హిందువులుగా మార్చారు.

విద్యారణ్యులు ఇచ్చిన ప్రేరణాదాయకమైన స్ఫూర్తితో హక్క-బుక్కలు హిందూ ధర్మ రక్షణ కోసం పోరాటానికి సిద్ధమయ్యారు. మొదట ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ తన ప్రతినిధినిగా నియమించిన మాలిక్ నాయబ్ నుంచి అనెగొంది ని విముక్తం చేశారు. ఈ విజయమే తర్వాత కాలంలో వియజనగర సామ్రాజ్య స్థాపనకు నాంది అయ్యింది.

మహమ్మద్ బిన్ తుగ్లక్ అనెగొంది రాజు జంబుకేశ్వర రాయలును ఓడించి, ఆయన్ను తన రాజభవంలో బందీచేశాడు. ఇక్కడ రాజ్యపాలన కోసం మాలిక్ నాయబ్ ను తన ప్రతినిధిగా నియమించాడు. విద్యారణ్య స్వామి సూచనతో చాకచక్యంగా ఆనెగొంది కోటలో ప్రవేశించి మద్యం మత్తులో ఉన్న మాలిక్ నాయబ్ ను బంధించారు. ఏ విధమైన రక్త పాతం లేకుండా ఆనెగొందిని శత్రువుల నుంచి విముక్తం చేశారు. పంపా క్షేత్రంలోని ఓ అటవీ ప్రాంతంలో కుందేళ్ళు వేట కుక్కలను తరిమివేసిన కథ కూడా ఒకటి ప్రచారంలో ఉంది. క్రీ.శ.1336లో ఈ ప్రాంతంలోనే విద్యారణ్యులు విజయనగరమనే ఒక కొత్త పట్టణ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సమయంలో స్వామివారికి కొంత గుప్త ధనం లభించింది. ఈ ధనం నూతన హిందూ రాజ్యానికి ఉపయోగపడింది. అలాగే స్వామి వారు భువనేశ్వరీదేవిని ప్రార్థించి ఆమె దయతో కొద్దిసేపు కనకవర్షం కురిసేట్టు చేశారని ప్రజల విశ్వాసం.

విద్యారణ్యుల ప్రేరణతో స్థాపించిన ఈ హిందూ రాజ్యమే తర్వాత కాలంలో విజయనగర సామాజ్ర్యంగా చరిత్రకెక్కింది. ఈ సామ్రాజ్యం దక్షిణ భారతంపై దండెత్తి వచ్చే ముస్లిం పాలకును 350 ఏళ్ళపాటు విజయవంతంగా ఎదుర్కొని తిప్పికొట్టింది. విద్యారణ్యులు నూతన హిందూ రాజ్యానికి కొంతకాలం మార్గదర్శకులుగా ఉన్నారు. అటు తర్వాత శృంగేరి శారదాపీఠాధిపతి భారతీకృష్ణతీర్థ స్వామి ఆదేశం మేరకు వారి నిర్యాణం తర్వాత విద్యారణ్యస్వామి 12వ శృంగేరి పీఠాధిపతి బాధ్యతలు చేపట్టారు. అనేక చోట్ల శంకర పీఠానికి అనుబంధంగా పలు ఉప పీఠాలును స్థాపించారు. విస్తృతంగా ధర్మప్రచారం చేశారు.

అవేకాకుండా అనేక రచనలు చేశారు. సర్వదర్శన సంగ్రహం అనే పేరుతో భారతదేశంలో ఉన్న సమస్త విజ్ఞానాల సారాలను అతి సులభంగా అర్థమయ్యేలా రచించారు. శృంగేరి పీఠాధిపతిగా 55 సంవత్సరాలపాటు ఉన్న విద్యారణ్యులు క్రీ.శ.1386లో మహానిర్వాణం పొందారు. అప్పటికీ ఆయన వయస్సు 120 సంవత్సరాలు.

శ్రీ విద్యారణ్యుల జీవితం, సాహత్యం రెండు హిందూ ధర్మ నిష్ఠకు, సత్యసాక్ష్యాత్కారానికీ స్ఫూర్తిదాయకాలు. వారు సన్యాసిగా మారింది వ్యక్తిగత మోక్షం పొందడానికి కాదు. స్వాభిమానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన హిందూ సమాజాన్ని జాగృతం చేయడానికే దీక్షను తీసుకున్నారు. శక్తివంతమైన హిందూ సామ్రాజ్య నిర్మాణం జరగగానే వారు శృంగేరి శారదాపీఠ బాధ్యతలు స్వీకరించారు. హంపిలోని విరూపాక్ష మందిరంలో విద్యారణ్యుల విగ్రహాన్ని ప్రతిష్టించి... హిందువులు స్వామివారిపై తమకున్న కృతజ్ఞతాభావాన్ని ప్రకటించుకున్నారు. ఈ రోజు కూడా హంపి విరూపాక్ష మందిరంలో విద్యారణ్యస్వామి విగ్రహాన్ని మనం చూడవచ్చు.

ఈప్రపంచ చరిత్రలో ఎన్నో మతాలు పుట్టాయి. మరికొన్ని నాశనమయ్యాయి, ఇప్పుడు కొత్తవి ఎన్నో పుడుతున్నాయి. ఎన్ని మతాలు వచ్చినా, కాలపరీక్షకు తట్టుకుని నిలబడ్డ పురాతనకాలం నుంచి జీవిస్తున్న ఏకైక ధర్మం మన హిందూధర్మం మాత్రమే. ఆధర్మాన్ని కబలించాలని అప్పుడు ఇప్పుడు ఎన్నో శక్తులు తయారవుతూనే ఉన్నాయి. వాటిని ఎదురొడ్డి పోరాడవలసిన బాధ్యత మనందరిపైనా ఉంది.

– లతాకమలం గారి రచన , ఫెస్బుక్ వారి సౌజన్యంతో 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore