ఆ జ్ఞాపక శక్తికే దక్కిందేమో జ్ఞానపీఠం.
ఆ జ్ఞాపక శక్తికే దక్కిందేమో జ్ఞానపీఠం.
లక్ష్మీ రమణ
కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అయినా నిన్నటి తరం వారికి బాగా పరిచయం కూడా ! “రామాయణ కల్పవృక్షం”, “వేయిపడగలు” ఆయన రాసిన కావ్యాలలో బాగా ప్రసిద్ధిని పొందినవి . ఆయన పేరు తెలియక పోయినా జ్ఞానపీఠ్ అవార్డును పొందిన ‘ రామాయణ కల్పవృక్షం’ పేరు చాలా మందికి తెలిసినదే ! పాషాణపాక ప్రభువని ఆయనకీ మరో ముద్దు పేరు . అది ఆయన శైలికి సంబంధించినది . ఆయన అసాధారమైన జ్ఞాపక శక్తిని గురించి ఇక్కడ ఒక విశేషం తెలుసుకోవాలి .
భావకవిత్వం జగన్నాధ రధచక్రాలై ఉదృతంగా ప్రవహిస్తున్న రోజులవి . అయినా సరే, చక్కని ఛందోబద్ధమైన సంప్రదాయ పద్య కవిత్వాన్ని విడనాడని పండితులు విశ్వనాధ సత్యనారాయణ . భావాన్ని , సొంపుగా ఇంపుగా వ్యక్తీకరించడమే సృజనాత్మకమైన ప్రక్రియ అనుకుంటే, దాన్ని ఛందోబద్దంగా వ్యక్తీకరించడం మరింత సంక్లిష్టమైన సృజన . ఈ విధంగా ఆయన రాసిన రామాయణ కల్పవృక్షం అర్థమవ్వాలంటే చందస్సు, వ్యాకర్ణము, నిఘంటువు వంటివి ఉంటే సరిపోదు, తెలుగు తెలియాలి. తెలుగుదనం తెలియాలి. తెలుగు సంస్కృతి తెలియాలి. ఆ తీయని మకరందాన్ని ఆస్వాదించే విధానం కూడా తెలియాలి. అప్పుడే దాని హృదయం ఆవిష్కృతమౌతుంది. అదీ రామాయణ కల్పవృక్షంలోని గొప్పదనం .
అటువంటి సృజన చేసిన శ్రీ విశ్వనాధ సత్యనారాయణ వారి అత్యద్భుత అసాధారణ జ్ఞాపకశక్తి ని తెల్పే క్రింది సంఘటన చూస్తే ఆశ్చర్యం కలుగక మానదు.
అవి వారు రామాయణ కల్పవృక్షం రచిస్తున్న రోజులు. విశ్వనాథ గారు చెప్తుంటే వారి కొడుకులు వ్రాసేవారు. ఒక రోజు చూసుకొంటే, 32 వ కాగితం నుండి 72 వ కాగితం వరకు కనిపించలేదు. ఇల్లంతా వెదికారు. కానీ కనబడలేదు. వారికి తమ తండ్రి గారైన విశ్వనాథ గారంటే చాలా భయభక్తులు ఉండేవి. అందువలన ఈ విషయం చెప్పడానికి సాహసించలేదు. గ్రంథం వ్రాయడం పూర్తయింది. ఇక ముద్రణకు వెళ్ళాలి. ఇక తప్పదనుకొని విశ్వనాథ గారికి చెప్పారు.
అందుకు విశ్వనాథ గారు ” అందులో బాధపడాల్సింది ఏం లేదు” అంటూ మళ్ళీ పూర్తిగా కనబడకుండా పోయిన 40 కాగితాలలో ఉన్నదంతా చెప్పేసారు. ఆ తర్వాత ఇంట్లో ఇంతకుముందు కనబడకపోయిన 32 నుండి 72 వరకు 40 కాగితాలు దొరికాయి.
అత్యంత ఆశ్చర్యకరం గా ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా కనబడకుండా పోయిన కాగితాలలోని విషయం క్రొత్తగా మళ్ళీ చెప్పబడిన కాగితాలలో ఉంది. ఒక్కటంటే ఒక్క అక్షరం కూడా పొల్లుపోలేదు,తప్పు లేదు. అంతటి అసాధారణ జ్ఞాపకశక్తి కలిగి ఉండడం మనకు ఆశ్చర్యం కల్గించకమానదు.
దీనినే కాబోలు పెద్దలు ధారణా శక్తని పిలిచేవారు ! అద్భుతం కదా !