బంగారుబల్లి శేషాచలం అడవుల్లో కనిపించిందట !
బంగారుబల్లి శేషాచలం అడవుల్లో కనిపించిందట !
సేకరణ
కంచి కామాక్షి అమ్మవారి ఆలయంలో వున్న బంగారు బల్లిని ముట్టుకున్న వారికి బల్లి వారి దేహంపై ఎక్కడ పడినా దుష్పలితం వుండదని ఒక నమ్మకం. అదే విదంగా బల్లి శరీరం మీద పడిన వారు, కంచిలోని బంగారు బల్లిని ముట్టుకొని వచ్చిన వారి పాదాలకు నమస్కారము చేస్తే బల్లి పడిన దుష్పలితం వుండదని కూడ ప్రజల్లో మరో నమ్మకం కూడా ఉన్నది. మనమేదన్నా తలుచు కుంటున్నప్పుడు బల్లి పలికితే అది నిజమవుతుందని కూడ నమ్ముతారు. అది పలికి నపుడు “క్రిష్ణ… క్రిష్ణ ” అని అంటారు. చాలా గుడుల గోడల మీద బల్లుల చిత్రాలున్నాయి.
బంగారు బల్లి వెండి బల్లి
బంగారు బల్లి అంటేనే తమిళనాడులోని కాంచీపురం కామాక్షి ఆలయం గుర్తుకొస్తుంది. అక్కడి ఆలయంలో బంగారు తొడుగులతో ఏర్పాటుచేసిన బల్లిని తాకితే సకల దోషాలు తొలగి పుణ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. కంచి బంగారు, వెండి బల్లి గురించి పురాణగాధ ఏం చెబుతున్నది, బంగారు వెండి బల్లుల యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం.
బంగారు వెండి బల్లికి సంబంధించిన పురాణగాధ ప్రకారం గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు వుండేవారు. నదీ తీరానికి వెళ్లి నీటిని తీసుకువచ్చే సమయంలో కుండలో బల్లి పడిన విషయాన్ని గుర్తించలేదు. అనంతరం దీన్ని చూసిన గౌతమమహర్షి వారిని బల్లులుగా మారిపొమ్మని శపించాడు. శాపవిముక్తి కోసం వారు ప్రార్థించగా కాంచీపురంలోని వరదరాజపెరుమాళ్ ఆలయంలో లభిస్తుందని ఉపశమనం చెప్పాడు. దీంతో వారు పెరుమాళ్ ఆలయంలోనే బల్లులు రూపంలో వుండి స్వామివారిని ప్రార్థించారు.
కొన్నాళ్లకు వారికి విముక్తి కలిగి మోక్షం లభించింది. ఈ సమయంలో సూర్య,చంద్రులు సాక్ష్యంగా వుండటంతో బంగారు, వెండి రూపంలో శిష్యుల శరీరాలు బొమ్మలుగా వుండి భక్తులకు దోషనివారణ చేయమని ఆదేశిస్తాడు. బంగారు అంటే సూర్యుడు, వెండి అంటే చంద్రుడు అని కూడా అర్థం. సరస్వతీ దేవీ నుంచి శాపవిముక్తి పొందిన ఇంద్రుడు పెరుమాళ్ ఆలయంలో దీనికి గుర్తుగా ఈ బల్లి బొమ్మలను ప్రతిష్టించినట్టు మరో కథనం కూడా ఉంది.
బల్లి ఇంట తిరగాడుతున్నప్పటీకీ, అది మీదపడితే దోషమనే విశ్వాసం ఎప్పటి నుండో మన ఆచారంలో ఉంది. అలా బల్లి పడినప్పుడు భయపడకుండా, కంచి కామాక్షి ఆలయంలోని బల్లిని తలచుకుని స్నానం చేసి, ఇష్టదేవతారాధన చేయడం వల్ల ఆ దోషం పోతుందని చెప్పబడుతోంది.
ఇది కథ . అయితే, ఇటువంటి సూర్యని తేజస్సుతో ఉండే బంగారు బల్లులు ఒకప్పుడు నిజంగానే ఉండేవి. ఈమధ్య ఇవి అంతరించిపోయాయని , ఎక్కడా కనిపించడంలేదని ఆవేదన చెందుతున్న శాస్త్రవేత్తలకు శేషాచలం కొండల్లో ఇవి చమక్కున మెరిసి కొత్త ఆశలు రేకెత్తించాయి. శేషాచలం ఏడుకొండల్లో ఇవి కనిపించాయి. రాతి గుహలే వీటి ఆవాసం. బంగారు బల్లి శాస్త్రీయ నామం కాలొడాక్టిలోడ్స్ అరీస్. ఇది రాత్రుల్లో సంచరించే నిశాచర జీవి. బంగారు వర్ణం పోలిన ముదురు పసుపు, లేత పసుపు రంగులో మెరిసినట్టు ఉంటుంది.
ఇవి 150 నుంచి 180 మిల్లీ మీటర్ల వరకు పొడవు పెరుగుతాయి. రాతి గుహలు వాటి నివాసానికి అనుకూలం. సూర్యరశ్మి పడని, వేడి తగలని ప్రదేశాల్లో కనిపిస్తాయి. సాధారణంగా చీకటి పడ్డాక గుహల సందుల నుంచి వెలికి వస్తాయి. అనుకూల వాతావరణంలో జనం చడీచప్పుడు లేనప్పుడు ఒక్కోసారి పగటి పూట బయటకు వస్తాయి. ఇవి 40 నుంచి 50 గుడ్లు పెడతాయి. సాధారణ బల్లుల కంటే గట్టిగా, వింతగా అరుస్తాయి.
శేషాచల అడవిలో శ్రీవారి ఆలయానికి వెనుక మూడు కిలోమీటర్ల దూరంలోని చక్రతీర్థం, 25 కిలోమీటర్ల దూరంలోని రుద్రగళ (యుద్ధగళ) తీర్థం తదితర చల్లటి ప్రదేశాల్లో మాత్రమే బంగారు బల్లి తరచూ కనిపించేది. అదన్నమాట సంగతి .