ఒకే వ్యక్తికీ రెండు శరీరాలుండడం సాధ్యమేనా ?
ఒకే వ్యక్తికీ రెండు శరీరాలుండడం సాధ్యమేనా ?
-లక్ష్మీ రమణ
భారత దేశంలో ఎందరో యోగి మహాశయులు జన్మించారు. వారు ఆ తర్వాత కాలంలో ప్రపంచానికి ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించిన మార్గదర్శకులయ్యారు . ఆదికాలము నాటి ఋషులని మనం చూడలేదు . కానీ ఆధునికులైన యోగులని గురించిన పూర్తి సమాచారం లిఖితపూర్వకంగా మనకి అందుబాటులో ఉంది . అటువంటి వారిలో తన ఆత్మ కథని ఆధ్యాత్మిక అనుభవాలనీ ‘ ఒక యోగి ఆత్మకథ’ అనే పేరిట ప్రచురించిన శ్రీ పరమహంస యోగానంద ఒకరు .
మన ధర్మం ఒక మాట చెబుతుంది . అదేంటంటే, సత్యాన్వేషకుని తపన యెంత ఎక్కువగా ఉంటె, అతని గురువు అతన్ని వెతుక్కుంటూ అంట త్వరగా దర్శనం ఇస్తారని , వస్తారని ! అలా ముకుంద లాల్ ఘోష్ గా జన్మించిన పరమహంస యోగానంద పిలుపు ఆయన గురువైన యోగావతార్ ‘ యుక్తేశ్వర్’ గారిని చేరేలోపల ఆయన దర్శించిన మహనీయులు చాలామందే ఉన్నారు . వారితో ఆయన ఆధ్యాత్మిక అనుభవాలూ అద్భుతమైన మాయా ప్రపంచంలో మనల్ని తిప్పుతున్నట్టు అనిపిస్తాయి. అదే సమయంలో , యోగ సమున్నతిని, ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తి ప్రయాణాన్ని మొదలు పెట్టినప్పుడు అతని మజిలీలని సవివరంగా వివరిస్తాయి.
ఆయన తన గురువుగారిని కలుసుకోకముందరినాటి ఒక సంఘటన ఇక్కడ మనం చెప్పుకోవాలి. యోగానందగారి నాన్నగారు కాశీ వెళ్ళడానికి టిక్కెట్టు కొనిచ్చి, అక్కడ తన స్నేహితుడైన కేదార్నాథ్ గారికి ఒక ఉత్తరాన్ని వ్రాసి ఇచ్చి చేరవేయమని, తాన్ దగ్గర వారి అడ్రస్సు లేనందున, తామిద్దరికీ తెలిసిన స్వామీ ప్రాణవానందని కలవమని ఆయన చిరునామాతో ఒక లేఖని రాసి పంపిస్తారు.
కాశీ క్షేత్రానికి వెళ్లి అక్కడ స్వామి ప్రాణవానందని కలుసుకున్న యోగానందులకి చాలా విచిత్రమైన అనుభవం ఎదురవుతుంది. ఆయనున్న గదిలోకి వెళ్ళగానే, యోగానందకి పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేకుండానే, యోగానంద ఎవరు, ఆయన దగరికి ఎందుకొచ్చారు అనే విషయాలన్నీ చెప్పేసి, నీకోసం నేను కేదార్నాథ్ ని వెతికి పట్టుకుంటాను లే అంటారు . అలా అన్న ఆ స్వామీ ఎక్కడికీ వెళ్లరు. మరేమీ యోగానందతో మాట్లాడ కుండానే 30 నిమిషాలు గడిపేస్తారు.
30 నిమిషాలు గడిచాక, మెట్లమీదా ఎవరో వస్తున్న చప్పుడు యోగానందకి వినిపిస్తుంది. ఆ వచ్చిన వారు కేదార్నాథ్ . ఆయన్ని చూసి ఆశ్చర్యపోయిన యోగానందులవారికి, కేదార్నాథ్ మరింత ఆశ్చర్యకరమైన విషయాన్ని చెబుతారు. ఆ ప్రాణవానంద స్వామీ స్వయంగా వచ్చి , నదిలో స్నానం చేస్తున్న తనకి యోగానంద తనకోసం అక్కడ వేచిఉన్నారని వెంట బెట్టుకొని వచ్చిన విషయమని వివరిస్తారు .
రెండు చోట్ల ఒకే శరీరంతో ఆయన ఎలా ఉండగలిగారని యోగానంద విస్తుపోతారు. ఇలాంటి ఎన్నో అద్భుతాలు యోగమును ఆచరించడం ద్వారా సాధ్యమేనని, స్వామి ప్రాణవానంద వివరిస్తారు . ఇటువంటి అద్భుతాలెన్నో ఒకయోగి ఆత్మ కథలో ఉంటాయి.
ఈ పుస్తకం 'క్రియాయోగ’ ప్రవక్తల సమాహారం. ఇందులోని దృశ్యమాలికలు తనలోకి మనల్ని ఆకర్షిస్థాయి. తనలో లీనం చేసుకుంటాయి. మనల్ని ఆత్మికంగా, ఆధ్యాత్మికంగా మహోన్నత శిఖరారోహణ చేయిస్తుంది. వీలయితే తప్పకుండా ఒకసారి చదవండి .