కూతురా? కోడలా? ఎవరు ప్రధానం ?
కూతురా? కోడలా? ఎవరు ప్రధానం ?
-లక్ష్మీ రమణ
పేగు తెంచుకొని పుట్టిన బిడ్డని మహాలక్ష్మి అని అల్లారు ముద్దుగా పెంచుకుంటారు తల్లిదండ్రులు . యుక్తవయసుకి వచ్చాక, ఆ బిడ్డని నారాయణ స్వరూపంగా భావించే ఒక అయ్యా చేతిలో పెడతారు . పెళ్లి చేసి మరో ఇంటికి కోడలుగా పంపిస్తారు. అటువంటి తల్లిదండ్రులకి ఒక కొడుకుంటే, వారింటికి కోడలయ్యి వచ్చే ఆడపిల్ల మరో కూతురు కాగలదు కదా ! అప్పుడు కూతురా / కోడలా అన్న ప్రశ్న ఉత్పన్నం కాదు . కానీ శాస్త్రం ఈ విషయంలో ఏం చెప్పిందో చూదామా ?
కూతురు ఎప్పటికీ మన బంగారమే. తానూ ఒకింటికి కోడలేకదా ! కానీ కోడలు , కన్నవారిని వదిలి కట్టుకున్నవారే తనవారిని భావిస్తుంది. కోడలు కన్నవారు ఎంతటి ఉన్నతులైనా తన అభ్యున్నతిని అత్తవారింట్లో వెతుక్కునే 'గుణశీలి'. తండ్రికి పంచభక్ష్యాలు పెట్టగలిగే స్తోమత ఉన్నా, భర్త పెట్టే పచ్చడిమెతుకుల్లోనే కమ్మటి రుచిని వెతుక్కోగల 'భాగ్యశీలి' కోడలు. కోడలే గృహలక్ష్మి !
అన్నింటికన్నా , కోడలు వంశాన్ని వృద్ధి చేస్తుంది. ఈ వంశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి వారసుణ్ణి ఇస్తుంది. వీటన్నింటినీ పక్కపెడితే, పితృదేవతలకు ముక్తిని ప్రసాదించేందుకు కారణమవుతుంది . కొడుకు పెట్టె పిండాలకన్నా,
కోడలు పెట్టే దీపానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అదీ కోడలి గొప్పతనం.
కొడుకు పెళ్ళికోసం వేసిన పందిరి ఆకులపై కూర్చున్న పితృదేవతల కోసం నాంది శ్రాద్ధం పెట్టి, మన వంశాన్ని ఉద్ధరించగలిగే సమర్థురాలైన గొప్పకోడలిని ఎంచుకున్నాను అని గర్వంతో చెపుతాడట ఆ పిల్లకి కాబోయే మామగారు.
ఇక, కోడలు ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత కూడా అమితంగా సంతోషపడేది మామగారేనట . మరో అమ్మ నా ఇంట కాలు పెట్టింది. నన్ను అమ్మలా చూసుకుంటుందని ఆమె పక్షమే వహిస్తారట మామగారు . ఏ ఇంట కొడలిని తక్కువ చేసి కూతురిని గొప్పగా కీర్తిస్తారో ఆ ఇంటి గృహలక్ష్మి చిన్న బుచ్చుకుని వెళ్ళి పోతుందని చెబుతుంది శాస్త్రం .
అత్తా ఒకకింటి కోడలేనని , కోడలు తానూ ఒకింటికి ఆడబిడ్డనేనని,గుర్తుంచుకుంటే, జగతిలో చాలా ప్రశాంతత నెలకొంటుందని పురుషుల మనోభావాలు . సరిసర్లే అనుకుంటున్నారేమో, ఇది మన తెగుజాతికో, భారత దేశానికో పరిమితం కాదు. ప్రపంచ పురుషుల మెజారిటీ అభిప్రాయం. వారి మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యతతో పాటు లక్ష్మీ దేవంటే , అపారమైన భక్తి ప్రపత్తులు కూడా ఉన్నాయి కదా ! మరిక మహిళలూ , మీరే ఆలోచించుకోండి !!