Online Puja Services

అంతటి అద్భుతమైన టెక్నాలజీ అంతరించడానికి కారణం ఏంటి?

3.135.200.121

అంతటి అద్భుతమైన టెక్నాలజీ అంతరించడానికి కారణం ఏంటి?
లక్ష్మీరమణ 

శిలలపై శిల్పాలు చెక్కినారూ , మనవాళ్లు జగతికే అందాలు దిద్దినారూ అని వెనకటికి ఒక సినీ కవి అద్భుతమైన పాటకి రూపుకట్టారు. నిజంగానే నాటి ఆలయాలమీద ఉన్న శిల్పాలు సామాన్యమైనవి కావు . ఆ శిల్పకళానైపుణ్యం ఒక శాస్త్రంగా పరిఢవిల్లడానికి కారణమైనవారు కశ్యప మహర్షి . విదేశీయులు ఈ దేశ సంస్కృతిపై,  దేవాలయాలపై చేసిన  దండయాత్రలు, మన ఆధునిక విజ్ఞానానికి భూమికలు వేసిన అనేక ప్రాచీన గ్రంధాలని సైతం తుడిచిపెట్టేయడం విచారకరం . అటువంటివాటిల్లో ఈ శిల్పశాస్త్రం కూడా ఉందా ?

  ఒకచోట ఒకే కొండని తొలిచి, ఒక గొప్ప ఆలయంగా మలిచిన ప్రతిభ. మరోచోట రాళ్ళని కరిగించి సాలభంజికలుగా నిలిపారేమో నని బ్రహ్మకి గురిచేసే శిల్పసౌందర్యం. మరోచోట చేయితో తడితే, సప్త స్వరాలనీ ఆలపించే సుస్వరమూర్తులు . ఇంకొక ఆలయంలో అది నడిచే రథమా , లేక చెక్కిన శిల్పమా తెలియని అయోమయం. ఇటువంటి అద్భుతమైన శిల్పశాస్త్ర మెళకువలు ఇప్పుడు ఎక్కడికి వెళ్లిపోయాయి. ఒకప్పుడు భారతీయుల కళా తృష్ణకి , నైపుణ్యానికి తార్కాణంగా నాటి ఆలయాలు మన కళ్ళముందే కనిపిస్తున్నాయి . మరో వైపు, అసలు వాటిని ఏ పద్ధతిలో నిర్మించారా అనే ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి . విమానం ప్రపంచానికి కొత్తకావచ్చు. కానీ భారతీయులు వారి గర్భాలయ గోపురాన్ని వేళా ఏళ్ళకి పూర్వమే విమానగోపురం అని పిలిచారు . అప్పటి ఈ గోపురాలు ఎగిరే టెక్నాలజీని కలిగి ఉన్నాయా ? రావణాసురుడి విమానం పుష్పకం . ఇప్పటికీ లంకేయులు ఈ విమానం పైన, ఆయన వాడిన ఏర్పోర్ట్ పైనా పరిశోధనలు జరుపుతున్నారు . 

ఆ రామాయణ కాలంనాటి  ఆలయాలు ఇంకా ఈ భూమిమీద నిలిచి ఉన్నాయి . వాటిపై అద్భుత శిల్పకళ ఇంకా చెదిరిపోలేదు .చెదరగొట్టాలన్న ప్రయత్నాలకు  మూగ సాక్ష్యంగా కాళ్ళూ , చేతులూ , మూతులూ తెగిపోయినా , ఆ వైకల్యంతోటే తమ సౌందర్యాన్ని , ఆ నాటి పరిస్థితుల్నీ , సాంకేతిక ప్రగతిని వివరిస్తున్నాయి .  ఇటువంటి ఒక శాస్త్రం మనకి అందించిన వారు కశ్యప మహర్షి. ఇప్పటికీ ఈ శాస్త్రం ఉందా అంటే, దానికి రకరకాల సమాధానాలు వినిపిస్తున్నాయి . వాటిని తెలుసుకునే ముందు కశ్యప మహర్షిని గురించి కొంత తెలుసుకోవడం అవసరం . 

పురాణాల ప్రకారం ,  బ్రహ్మ మనసు నుండీ  జన్మించిన మరీచుని పుత్రుడు కశ్యపుడు . దక్ష ప్రజాపతి తన 13 మంది కుమార్తెలను కశ్యపునికిచ్చి వివాహం చేశాడు. వారే దితి, అదితి, వినత, కద్రువ, దాను, అరిష్ట, సురస, సురభి, తామ్ర, క్రోధవన, ఇడ, ఖస, ముని. 

గరుడ (గురుత్మంతుడు), అరుణ(అనూరుడు)- వినత కుమారులు.  నాగజాతి కద్రువ కుమారులు. ఇలాగే దేవతలు, దానవులు దితి, అదితి వల్ల కశ్యపునికి కలిగిన సంతానం. భాగవతం ప్రకారం స్వర్గంలోకంలో నివశించే అప్సరసలు కశ్యపుని కుమార్తెలు.

స్వారోచిష మన్వంతర కాలంలోనే కశ్యప మహముని జీవించి ఉన్నట్టు. పురాణాలు చెబుతాయి.

ఇక పరశురాముడు భూమండలంలోని క్షత్రియులందరినీ జయించిన తర్వాత తను పొందిన భూమినంతా కశ్యపునికి దానమిచ్చాడు. పాండవుల మనుమడైన పరీక్షిత్తు పాముకాటుకు గురై, మరణిస్తాడని శాపం పొందిన సందర్భంలో ఆయనను రక్షించడానికి కశ్యపుడు ప్రయత్నించారు.

అయితే చివరకు నాగరాజైన తక్షకుడి విజ్ఞప్తి ప్రకారం వెనుదిరిగి వెళ్ళిపోయాడు.
ఇలా అనేక సందర్భాల్లో మనకు కశ్యపుని ప్రస్తావన కనిపిస్తుంది.

దేవతలకీ , దానవులకీ తండ్రి అయిన మహనీయుడు, నాగులకూ, పక్షులకూ జన్మనిచ్చిన సృష్టి కారకుడు మంచీ, చెడులకి పితరుడైన మహర్షి చేత ప్రసాదించబడిన శాస్త్రం ఈ శిల్పశాస్త్రం. అందువలనే, అద్భుతమైన ఎన్నో రహస్యాలు వేలకొద్దీ సంవత్సరాల పురాతనమైన హిందూ దేవాలయాలలో ఉన్న శిల్పాలు మనకి వివరిస్తాయి . చూసే కళ్ళకి మనసుంటే, సృష్టి క్రమాన్ని ,వర్ణాశ్రమ ధర్మాలనీ,  విధాత గొప్పదనాన్ని, భగవంతుని చేరుకొనే మార్గాన్నీ ఈ శిల్పాలు ప్రబోధిస్తాయి. ఈ శిల్పశాస్త్రం ఇప్పుడు కనుమరుగవ్వడానికి , అంతటి అద్భుతమైన టెక్నాలజీ అంతరించడానికి కారణం ఏంటి ?
 
క్రీ.శ. 1193 సం.లో నలందా విశ్వవిద్యాలయ సముదాయాన్ని, భక్తియార్ ఖిల్జీ నాయకత్వములో తురుష్క సేనలు దండెత్తి కొల్లగొట్టాయి. ఈ సంఘటన భారతదేశములో బౌద్ధం యొక్క క్షీణతకు మైలురాయిగా భావిస్తారు. నలందను కొల్లగొట్టే ముందు ఖిల్జీ అక్కడ ఖురాన్ యొక్క ప్రతి ఉందా అని వాకబు చేశాడని చెబుతారు.  1235లో టిబెట్ అనువాదకుడు ఛాగ్ లోట్స్‌వా నలందను సందర్శించినపుడు కొల్లగొట్టబడి, జీర్ణవస్థలో ఉన్నప్పటికీ కొద్దిమంది బౌద్ధ భిక్షువులతో పనిచేస్తూ ఉంది. గణితము, ఖగోళశాస్త్రము, రసాయన శాస్త్రం స్వరూపశాస్త్రం మొదలగు శాస్త్రాలలో ప్రాచీన భారతీయ విజ్ఞానము అకస్మాత్తుగా అంతరించిపోవడానికి నలంద విశ్వవిద్యాలయ నాశనము, ఉత్తర భారతదేశమంతటా ఇతర దేవాలయాలు, ఆశ్రమాల నాశనమే కారణమని అనేకమంది చరిత్రకారులు భావిస్తారు.

దాదాపు వెయ్యేళ్ళ కాలం నాటి దేవాలయాల శిల్పాలు , ఆ తర్వాత నిర్మితమైన దేవాలయాల నిర్మాణాన్ని పోల్చి చూసినప్పుడు , చరిత్రకారుల ఈ భావానికి ఊతమిచ్చేలా మనకి ఫలితాలు స్పష్టంగా కళ్ళకి కనిపిస్తాయి . ఇదంతా ఒకెత్తయితే, ఇంతటి విజ్ఞానాన్ని కేవలం స్వలాభాలకోసం, మతమూఢత్వం తో నాశనం చేసిన వాడిని ఏం చెయ్యాలో మనం ఆలోచించాలి . మతమనే మూఢత్వాన్ని, ప్రబోధకుడు అనేవాడెవరూ లేని ,  భగవంతుణ్ణి మాత్రమే స్వచ్ఛంగా మనసుకు నచ్చిన రూపంలో ఆరాధించే స్వేచ్ఛనిచ్చిన ఒక గొప్ప సంస్కృతిని ఇలా నాశనంచేయడం వలన మనం కోల్పోయింది కేవలం ఒక్క శిల్ప శాస్త్రాన్ని మాత్రమే కాదు. అంతకు మించిన అమూల్యమైన ఎన్నో రత్నాల వంటి జ్ఞాన , విజ్ఞాన గ్రంధాలని . దీని గురించి ప్రతి ఒక్కరం భారతీయులుగా  ఆలోచించాల్సిన సరైన తరుణం ఇది . 

శుభం . 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore