తంత్రం అంటే ఏమిటి ?
తంత్రం అంటే ఏమిటి ? దానివల్ల మన సమస్యలు తీరతాయా ? పెరుగుతాయా ?
-సేకరణ
ప్రస్తుత కాలంలో తంత్రం అంటే అదేదో చెడు చేయడం అని , రహస్యంగా కుట్రలను పన్నటం అని అందరూ అనుకుంటున్నారు . దాన్ని తంత్ర అనరు . కుతంత్రాలు అంటారు . ఒక కార్యాన్ని విజయవంతం చేయడానికి ఇష్ట కార్య సిద్ధి జరగడానికి కొన్ని మంత్రాలు , వస్తువులను , ఉపయోగించి చేసే కార్యక్రమాన్ని తంత్రం అని పిలుస్తారు . తంత్ర అనేది ఒక శక్తి గల మంత్రంతో గూడిన సాధనం లాంటిది . ఆ సాధనమును శత్రు సంహారానికి ఉపయోగించవచ్చు .
కత్తితో ఫలములను , దర్భలను కోయవచ్చు , జీవహింస చేయవచ్చు . అది చేసే వారి ఆలోచనా సంకల్పమును బట్టి ఉంటుంది . మంచికి చేస్తే మంచి ఫలితంను , చెడుకు చేస్తే చెడు ఫలితాలను పొందటం జరుగుతుంది . భారతంలో శకుని , తన ఇష్ట కార్యసిద్ధి పొందడానికి తంత్ర విద్య ద్వారా మాయా జూదమును జరిపించాడు . అది చెడు కారణం, అధర్మసిద్ధి కోసం అవడం వలన అప్పటికి మాత్రం వారి కార్యం విజయవంతం అయినప్పటికీ, పాచికల రూపంలో ప్రేతాత్మలను ఉపయోగించి చెడుబుద్దితో చేసిన పాప తాంత్రిక కర్మ వలన చివరకు పూర్తిగా సర్వనాశనం అయిపోయారు . చేసే సంకల్పంను బట్టి ఈ తాంత్రిక విద్యల ద్వారా ఫలితాలు పొందడం జరుగుతుంది .
శ్రీకృష్ణుడు తాను సృష్టించిన మంచికి , ధర్మానికి చేటు ఎదురవుతున్న సందర్భం తెలియనివాడు కాదు . ఆ చెడును నిర్మూలించగల శక్తి లేనివాడూ కాదు. అయినప్పటికీ తంత్ర విద్యల ద్వారా మానవ రూపంలో ఉన్న పాండవుల ద్వారా ప్రయోగింపజేసి నిర్మూలించాడు . ఇందులో సూక్ష్మం ఏమిటంటే కర్మఫలం వలన మానవుడు ఎదుర్కొనే చెడు కర్మలకు నిర్మూలణా మార్గాలను తంత్ర విద్యల రూపంలో ఆ శ్రీ మహావిష్ణువే వరంగా ప్రసాదించారు . మనం ఎదుర్కొంటున్న శత్రు సమస్యలను , వారు చేసే లేదా చేయించే అభిచార కర్మలను , మనమే తొలగించుకునేలా తంత్ర విద్యలను ప్రసాదించారు . ఎంతో శక్తివంతులు మరియు శూరులూ , ధీరులు , ధర్మ పరాయుణులైన పాండవులు శత్రు సంహారానికి తంత్రాలను ఉపయోగించడం జరిగింది అని చెబుతారు తాంత్రికులు .
మనకి దశమహా విద్యలూ తాంత్రిక రూపాలలో అనుగ్రహించే దేవతలేకదా ! అదే విధంగా బౌద్ధంలోనూ కొందరు తాంత్రిక దేవతలు ఉన్నారు . ఈ విధంగా సాధారణ రూపాలలోనే కాకుండా అసాధారణ పద్ధతుల్లో పూజలందుకొని, అనుగ్రహాన్ని వర్షించే దేవతలు, వారి సాధనాలు ఎన్నో మన పురాతన గ్రంధాలలో వివరించబడి ఉన్నాయి. ఇవి మంచి చేసేవే గానీ చెడుకి తెగబడేవికావు. అధర్మ వర్తనతో వీటి ప్రయోగం చేయడం వలన ఖచ్చితంగా వారి వినాశనం అవే శక్తుల చేతుల్లో భయంకరమైన రీతిలో ఉంటుందనేది సత్యం అంటారు ఉపాసకులు.
చరిత్రలోకి వెళితే, అణు ఆయుధాలు తంత్ర విద్యలే కదా? మహాభారతంలో ఉపయోగించబడిన అత్యంత శక్తివంతమైన ఆచరణకి కష్ట సాధ్యమైన నాగాస్ర్తం , దీనినే వశీకరణ అస్త్రం అని కూడా అంటారు. ఆగ్నేయాస్త్రం , కుజాస్త్రం ఇది కుజుడికి సంబంధించినది , పాశుపతాస్త్రం ఇది మహాదేవుడికి సంబంధించినది . వాయువ్యాస్త్రం ఇది కేతువు , వాయు దేవుడికి సంబంధించినది . వారుణాస్త్రం ఇది వరణుడికి సంబంధించినది . ఇలా ఎన్నో శస్త్ర అస్త్రాలు అధర్వణ వేదంలో భాగాలే! అంటే ఇక్కడ మనం తెలుసుకోవల్సినది ఏమిటంటే ఈ శస్త్ర అస్త్రాలు అన్నీ కూడా తాంత్రిక విద్యలు .
రాక్షస పీడను , శత్రు పీడను , నిర్మూలించడం కోసం రూపొందించిన విద్యలు ..
ద్వాపరయుగంలో , త్రేతాయుగంలో కూడా రాక్షస ఫీడను నిర్మూలించి, లోక కళ్యాణం సాధించడం కోసం ఈ శస్త్ర అస్త్రాలను ఉపయోగించక తప్పలేదు . ఇందులో మర్మం ఏమిటి అంటే పైశాచిక తనాన్ని నిర్మూలించడమే !! కొంత శ్రద్ధగా గమనిస్తే ఇందులో మర్మం అర్థం అవుతుంది.
బ్రహ్మరాతని మార్చలేము. మనిషి ఎదుర్కొనే భాధను తన బాధగా స్వీకరించే ఆ పరమాత్మ ఆ బాధని తొలగించడం కోసం ఈ తంత్ర మార్గాలను అధర్వణ వేదం ద్వారా మనకు ప్రసాదించారు . ఇందులో అంతర్యం ఏమిటి అంటే , వర్షం వచ్చినప్పుడు గొడుగును ఉపయోగించడం వలన ఆ వర్షం నుంచి తడవకుండా ఉండగలుగుతాం. వర్షం పడటం బ్రహ్మ మనపై చూపించే నుదిటి వ్రాత. దాని నుండేకాపాడుకోవడానికి వాడే గొడుగే తంత్రం .
విధిని తప్పించుకోవడం కష్టం కానీ , తామస , రజో , లక్షణాలు కలిగిన శత్రు ఫీడ నివారణా , అభిచార కర్మలను తంత్ర విద్యల ద్వారా నిర్మూలించవచ్చు ..!! ఈ తంత్ర విద్యలను అభ్యసించిన వారు వీలైనంత వరకు లోక కళ్యాణం కోసమే ఉపయోగించాలి .. శక్తివంతమైన ఈ తాంత్రిక విద్యలను అభ్యసించడం వల్ల మనుషులు తాము ఎదుర్కొంటున్న శత్రువులు చేసిన అభిచార కర్మలను నిర్మూలించుకోగలరు .నష్ట ద్రవ్య ప్రాప్తి , కార్యసిద్ధి , వ్యాపార అభివృద్ధి , కోర్టు వ్యవహారాలు , మొదలైన వాటిలో విజయాన్ని పొందుతారు.
సాధనమున పనులు సమకూరు ధరలోన అని ఈ సాధన తీవ్రతని, ఉద్దేశ్యము యొక్క ధర్మనిరతి బట్టి ఫలితాలు శ్రీఘ్రంగా సమకూరుతాయి . అనుకూలిస్తాయి. తాంత్రికం కాస్త కష్టమైన విధానమే. అయినప్పటికీ కూడా త్వరితంగా మన ఈతిబాధలని నిర్మూలించగలిగిన శక్తిని ప్రసాదిస్తుంది. కాబట్టి ఆసక్తి ఉన్నవారు అనుసరించదగిన విధానమే గానీ అందరూ అపోహ పడుతున్నట్టు ఇది చెడు చేసేందుకు వాడే విద్య కాదు .