Online Puja Services

జ్ఞానదాయని మాఘమాసం!

3.16.47.89

జ్ఞానదాయని మాఘమాసం!
లక్ష్మీ రమణ 

భా అంటే సూర్యుని ప్రకాశం - జ్ఞానం అని అర్థం . రతి అంటే ఆ వెలుగనే జ్ఞానంలోనే రమించేది అని అర్థం . భారతీయులు ఆమె బిడ్డలు. కనుక వారందరూ జ్ఞానాన్ని పొందేందుకు శ్రమించేవారు. మాఘమాసంలోనే ఆ భారతీ దేవి ఉద్భవించింది . ఆ సూర్యుడు కూడా ఈ మాఘమాసంలోనే జన్మించారు . కాబట్టి ఈ మాఘమాసం అమితమైన ఫలితాలని, అనంతమైన పుణ్యాన్ని ప్రసాదించేది నిస్సందేహంగా చెప్పొచ్చు . 

బ్రహ్మ దేవులవారు సృష్టి చేశారు . కానీ అదంతా నిశ్శబ్దంగా, నిస్సత్తువగా అనిపించింది . విసిగిపోయారు బ్రహ్మగారు. ఇంతనిస్సారమైన సృష్టిని ఎందుకయ్యానేను చేస్తున్నాను . కూసంత కళాపోషణ కూడా లేదే ఏమి చేసేది అనుకున్నారు . అలా అనుకుంటూ తన కమండలంలోని జలాన్ని అక్కడి చెట్లమీద ప్రోక్షించారు . వెంటనే శ్వేతాంబర ధారిణి, వీణా పాణి అయిన దేవతామాత భారతి , వాగ్దేవిగా ఉద్భవించింది . సుస్వర సంగీత ఝరిని వినిపించి జగత్తులో వసంతాన్ని నింపింది . 

జ్ఞానస్వరూపిణిగా ఉద్భవించిన ఆ దేవి ఈ మార్గశీర్షం లోనే ఉదయించడం వలన ఈ మాసానికి మరింత ప్రాముఖ్యత ఏర్పడింది . అప్పటి నుండి మాఘమాసంలో వచ్చే శ్రీ పంచమి రోజును సరస్వతిని పూజించడం జరుగుతుంది.

అమ్మవారి జ్ఞాన దీప్తి లాగ, నిత్యం ఉదయించే సూర్య దేవుడు మాఘశుద్ద సప్తమి నాడు జన్మించారు .  దీనినే ‘సూర్య సప్తమి’ అని కూడా పిలుస్తారు. ఇదే రథసప్తమి కూడా ! ఈ రోజున అరుణోదయకాలంలో ఏడు జిల్లేడు ఆకులను అందులో రేగికాయలను ఉంచుకొని తలాపై పెట్టుకొని స్నానం చేస్తే, ఏడు విధాలైన శాపాలు నశిస్తాయట. స్నానికి ముందు చెరకుగడతో నీటిని కలియబెడతారు. ‘నమస్కార ప్రియ:సూర్య:’ అన్న ఆర్య వాక్య ప్రకారం కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతృపి చెందుతాడని తెలుస్తుంది. ఈ రోజున చిక్కుడుకాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు అకులలో పెట్టి సూర్యునికి నివేదన చేయడం ఆచారం.

సూర్యుడు తనను పూజించిన సత్రాజిత్తుకి ఈ రోజునే ‘శమంతకమణి’ని ప్రసాదించారు. హనుమంతునికి వ్యాకరణ శాస్త్రాన్ని, యజ్ఞవల్క్యునికి యజుర్వేదాన్ని బోధించాడు. ‘ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్’ అన్న వాక్యం ప్రకారం ఆరోగ్యం కోసం ఆదిత్య హృదయం నిత్యం పారాయణ చెయ్యడం మంచిది . అలా చేయలేనివారు , మాఘమాసంలోని ఆదివారాలు ఖచ్చితంగా పారాయణ చేయడం వలన అభీష్టం సిద్ధిస్తుంది . రథసప్తమి నాటి స్నానం ‘సప్త సప్త మహాసప్త ద్వీపా వసుంధరా ! కోటి జన్మార్జితంపాపిం వినశ్యతితత్‌క్షణాత్’ అన్నట్లుగా పాప విముక్తి కలిగిస్తుందట.

కాబట్టి మాఘమాసాది పర్యంతం చక్కగా సూర్యారాధనం, భారతీ దేవి అర్చనలు చేయడం సర్వశ్రేయస్కరం . జ్ఞానదాయని మాఘమాసం . 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore