Online Puja Services

మీరు వీరిలో ఏ రకానికి చెందిన జంట ?

3.141.42.41

మీరు వీరిలో ఏ రకానికి చెందిన జంట ?
సేకరణ 

పుణ్యం కొద్దీ పురుషుడు అని స్త్రీలు అనుకుంటే, అదృష్టం కొద్దీ ఆలి అని పురుషులు అనుకుంటారట . ఈ లోకంలో, ఆమాట కొస్తే, ఈ బ్రహ్మాండంలో , ఈ సృష్టిలో భార్యతో తగువుపడని భర్త , భర్తతో పోట్లాడని భార్యా ఉంటారా ? ఇది ఇంటింటి రామాయణమే ! అయితే అసలు ఈ సృష్టిలో ఉండే భార్యాభర్తలు ఎన్ని రకాలుగా ఉంటారు అంటే, మన ధార్మిక గ్రంథాలని ప్రామాణికంగా తీసుకొని పండితులు ఇలా సమాధానం చెబుతున్నారు . 

 ఈ లోకంలో కోట్లాది కోట్ల దంపతులున్నా వాళ్ళంతా 5 విధాలు గానే ఉంటారు. అదెలాగంటే, 

లక్ష్మీనారాయణులు :

లక్ష్మీనారాయణుల్లో లక్ష్మీదేవి విష్ణుమూర్తి వక్షస్థలం మీద కొలువై ఉంటుంది.  వక్షస్థలం హృదయం ఆలోచనలకు నిలయం.  అంటే ఏభార్య భర్తల హృదయం ఒక్కటై, ఆలోచనకూడా ఆ ఇద్దరిదీ ఒకటై ఉంటుందో ఆ జంట లక్ష్మీనారాయణుల జంట. ఈ ఇద్దరిలో ఒకరిని విడిచి మరొకరు ఉండనే ఉండలేరు. లక్ష్మీ దేవి కూడా చూడండి ఆయన ఏ అవతారం ధరిస్తే, ఆయన వెంట తానూ సహధర్మచారిణై కష్టాలు, నష్టాలూ అనుభవిందేగానీ స్వామిని వీడి ఉండలేదు . అలాగే ఆయన కూడా , భృగుమహర్షి తన్నాడనే కోపంతో అలిగి వెళ్ళిపోతే , ఆమెవెంట పిచ్చివాడై వెళ్లిపోయాడే తప్ప , ఊరుకోలేదు. అది వారి అన్యోన్యత, అనురాగం ! 

గౌరీశంకరులు:

 అర్థనారీశ్వర తత్త్వం . తలనుంచి కాలిబొటనవ్రేలివరకు నిట్టనిలువునా చెరిసగంగా ఉంటారు, రెండు కలిసిన ఒకే రూపంతో ఉండటం వీరి ప్రత్యేకత,ఆలోచనలకు తల,కార్యనిర్వాహణానికి కాలూ సంకేతం. కాబట్టి భార్యను గొప్పగా చూసుకునే భర్త, సమాన స్థానమిచ్చి గౌరవించే భర్త , ఆపదలో ఉంటే రక్షించే భార్య –ఇలా ఉన్నవారు గౌరీశంకరులజంట.

బ్రహ్మ సరస్వతుల జంట:

బ్రహ్మ నాలుక మీద సరస్వతి ఉంటుందంటారు.  నాలుకనేది మాటలకు సంకేతం, దాని అర్థం ఇద్దరి మాట ఒకటే అవుతుందని. ఇక ఇలా ఏ మాట మాట్లాడినా, ఆ భార్య మాటే మాట్లాడే భర్త, ఆభర్త మాటే మాట్లాడే భార్య , ఏ జంట ఇలా ఉంటారో వారు బ్రహ్మసరస్వతుల జంట.

ఛాయా సూర్యులు:

 సూర్యుడు చండ ప్రచండంగా వెలుగు తుంటాడు. అతడి భార్య ఛాయాదేవి అతని తీక్షణతకు తట్టుకుంటూ సాగుతుంటుంది. తనభర్త లోకోపకారం కోసం పాటుపడేవాడు, విపరీతమైన తీక్షణత కలవాడు. అయినా తాను నీడలా పరిస్థితికి అనుగుణంగా సర్ధుకుపోతూఉంటుంది,ఛాయాదేవి.

ఏ ఇంట భర్త కఠినంగా, కోపంగా, పట్టుదలతో ఉంటాడో, ఏ ఇంట అతని భార్యమాత్రం నెమ్మదిగాను, శాంతంగాను, అణకువగాను ఉండి, సంసారాన్ని తీర్చిదిద్దుకొనే తత్వంతో ఉంటుందో అలాంటి జంట ఛాయా సూర్యుల జంట.

రోహిణీ చంద్రులు:

రోహిణీ కార్తెలో రోళ్ళు కూడా పగులుతాయనే సామెత ఉంది. చంద్రుడు పరమ ఆహ్లాదాన్ని,
ఆకర్షణను కలుగజేసేవాడు.  మెత్తనివాడు, చక్కనివాడు . ఇలా  ఏ జంటలో  భర్త మెతకగా ఉండి, లోకానికంతటికీ ఆకర్షణీయుడై ఉంటాడో, భార్య మాత్రం కఠినాతి కఠినంగాను కోపంతోను పట్టుదలతోను ఉంటుందో ఆ జంట రోహిణీ చంద్రులు.

ఇలా జంటలు ఐదు రకాలుగా ఉంటారట . ఏదేమైనా అద్భుతమైన వివరణ కదూ ! మరి మీరు వీరిలో ఏ తీరుకు చెందిన జంట?

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore