Online Puja Services

నాటి కల్పవృక్షమే నేటి కదంబ వృక్షం .

18.226.17.251

నాటి కల్పవృక్షమే నేటి కదంబ వృక్షం . 
సేకరణ 
 
క‌దంబవృక్షాన్ని రుద్రాక్షాంబ అని కూడా అంటారు. అమ్మవారికి కదంబవన వాసిని అనిపేరు . లలితా సహస్రంలో ఈ నామం ఉంటుంది. ‘ కదంబ కుసుమ ప్రియాయై నమః ‘ అని అమ్మవారిని అర్చిస్తుంటాం కూడా కదా !  కదంబవనాలు కల్పతరువులే ! ఆ కల్పవృక్ష సమానమైన అనుగ్రహాన్నిచ్చే ప్రత్యేకతని , ఆధ్యాత్మికంగా కలిగిఉన్న ఈ  కదంబ వృక్షాన్ని గురించి వివరంగా తెలుసుకుందాం . 
 
కదంబ వృక్షం శాస్త్రీయ నామం ఆంథోసెఫాలస్ చినెన్‌సిస్.ఇది ఆకురాల్చ‌దు. ఎప్ప‌టికీ ఆకుపచ్చగా ఉంటుంది. నీడను బాగా ఇస్తుంది. అడవులలో ఎక్కువ‌గా పెరుగుతుంది. దీని పూలు గుండ్రంగా ఉంటాయి. దీని పుష్పాల నుంచి అత్తర్లు కూడా తయారు చేస్తుంటారు. దీని క‌ల‌ప‌ను బొమ్మల తయారీకి ఉప‌యోగిస్తారు. ఈ మొక్క పెరిగేందుకు ఓ మోస్తరు నీరే సరిపోతుందంటున్నారు. ఉష్ణ మండల ప్రాంతంలో విరివిగా ల‌భిస్తుందంటున్నారు బయాల‌జిస్టులు.

కదంబ వృక్షం:
త్రిపురసుందరీ దేవి స్థావరం కదంబ వనం . శ్రీశైలానికి తూర్పు ద్వారంగా విలసిల్లుతున్న త్రిపురాంతకంలో బాలా త్రిపుర సుందరేశ్వరీ దేవి కొలువై ఉంది . ఆవిడ సన్నిధిలో ఇప్పటికీ ఈ వనాలు ఆలయం దగ్గర మనం గమనించవచ్చు . అతి సున్నితంగా రక్త వర్ణం తో ఉండే కదంబ పుష్పాలు అమ్మవారికి మహా ప్రీతి. అందుకే ఇవి అక్కడంతా వ్యాపించి ఉంటాయి . ఈ క్షేత్రంలో ఎన్నో విశిష్టతలు ఉన్నప్పటికీ, ఈ కందంబాలని కోసి, ఒక్క కదంబాన్ని ఆ అమ్మకి అర్పించేందుకైనా ఆ క్షేత్రానికి వెళ్ళితే, జన్మ ఇక చరితార్థమైపోయినట్టే !!

కదంబ వృక్షాలే కల్ప వృక్షాలని శ్రీ శంకర భగవద్పాదులు తెలియ జేశారు. ’’కదంబ కాననావాసా -కదంబ నామా కల్ప వృక్ష యుక్తం యత్కాననం వనం తత్ర గృహం యస్యాః సా తదా ‘అని భాష్యం చెప్పారు.

ఈ కదంబవృక్షానికి పురాణాల్లో రెండు రకాల పేర్లు ఉన్నాయి. ఉత్తరభారతంలో దీన్ని కృష్ణవృక్షమనీ, దక్షిణభారతంలో పార్వతీవృక్షమనీ అంటారు. ఈ వృక్షానికి, కృష్ణుడికీ చాలా సంబంధం ఉంది. రాధాకృష్ణుల ఊసులాటలు, రాసక్రీడలూ  ఈ వృక్షం నీడలోనే జరిగాయంటారు. అందుకే కృష్ణవృక్షము అంటారని పురాణాలు చెబుతున్నాయి. 

అలాగే దీనికి పార్వతీవృక్షమని కూడా పేరు. నేటి తమిళనాట, మధురలో మీనాక్షి అమ్మవారి ఆలయం ఉన్న ప్రాంతమే కదంబవనం అంటారు. ఏది ఏమైనా అన్నాచెల్లెళ్ళు ‘నారాయణా నారాయణి’ లకూ, ఈ వృక్షానికీ చాలా సంబంధం ఉందని చెబుతారు.

పురాణగాథ :
ఆ అనుబంధంతో పాటుగా, శివుడు హనుమంతుడై అవతరించేందుకూ ఈ వృక్షం కారణమట . పైగా ఇది సాక్షాత్తు పార్వతీ స్వరూపం అని చెబుతారు. ఇలా వ్యవహరించడానికి వెనుక ఒక పురాణ గాథని చెబుతారు . 

 గార్దబాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి భూమిమీద, మనుషులతో, జంతువులతో మరణంలేకుండా ఉండాలని వరం కోరతాడు. శివయ్య తథాస్సు అని అంతర్థానమవుతాడు. వరగర్వంతో దేవలోకం చేరి ఇంద్రున్ని తరిమికొడతాడు గార్దబుడు. దీంతో దేవేంద్రుడు విష్ణుమూర్తిని వెంటపెట్టుకుని పరమేశ్వరుని చేరతాడు. గార్దబాసురుని చంపమని కోరతాడు శ్రీమహావిష్ణువు. అయితే తాను వరమిచ్చిన విషయం చెబుతాడు శివయ్య. ఆ సమయంలో శ్రీమహావిష్ణువు ఓ సరదా మాట అంటాడు. నువ్వు గార్దబాసురుని చంపితే నేను నీకు దాసుడిగా ఉంటానంటాడు. దానికి శివయ్య నువ్వు గనుక గార్దబాసురుని చంపినట్టైతే నేనే దాసుడిగా మారతానని దానికి మరో మాట కలుపుతాడు. దాంతో మోహినీ రూపంలోకి మారతాడు విష్ణుమూర్తి. దక్షిణాన ఉన్న గార్దబాసురుని రాజ్యానికి సమీపంలోని వనానికి చేరతాడు. 

అదే సమయంలో విష్ణువుకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆ వనానికే అందమైన కన్యరూపంలో వస్తుంది పార్వతీదేవి. అమ్మవారి అందానికి ముగ్దులైన రాక్షసులు ఆమె దగ్గరకు చేరతారు. 

మరోవైపు మోహినీ అవతారంలో ఉన్న విష్ణుమూర్తికి ఆకర్షితుడై వెంటపడతాడు కదంబాసురుడు. దీంతో కదంబాసురున్ని ఆకాశంలోకి ఎగరేసి, తోడేలు రూపంలోకి మారి సంహరిస్తాడు. ముఖం తోడేలు, మొండెం మనిషి రూపంలో ఉండి, పరమేశ్వరుని వరానికి భంగం కలగకుండా చంపుతాడు. అలా సంహరిస్తున్న తరుణంలో రాక్షసులని అంతమొందించడానికి కదంబ వృక్షంగా మారి అగ్నిజ్వాలలతో రాక్షసులందరిని సంహరిస్తుంది అమ్మవారు. దీంతో గార్దబాసురుని సంహారం జరిగిపోయింది. దీంతో  రామావతారంలో హనుమంతుడిగా మారి శ్రీరామ బంటుగా సేవలు అందించాడు శివుడు.

జ్యోతిష్య శాస్త్ర విశేషం :
ఆ కదంబ వృక్షానికి పూజ చేసినట్లైతే రోగనివారణ జరుగుతుందని చెబుతారు పండితులు. గ్రహదోషాలు తొలగించుకోవడానికి అమ్మవారి స్వరూపమైన కదంబ వృక్షానికి పూజ చేయాలి అంటారు. పసుపు, కుంకమలు పూలతో అర్చన చేయాలని చెబుతారు. గ్రహదోషాలు ఉన్నవాళ్లు కదంబ వృక్షానికి పూజ చేసిన తర్వాత పెరుగన్నాన్ని పార్వతీదేవికి నివేదించాలి. ఓం శక్తిరూపణ్యై నమః మంత్రంతో పూజించాలి అంటారు.

శుభం . 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore