Online Puja Services

ఆపరేషన్లు అప్పటి కాలంలో ఉండేవి కావా ?

18.222.92.56

ఆపరేషన్లు అప్పటి కాలంలో ఉండేవి కావా ? 
లక్ష్మీ రమణ 

ఈరోజుల్లో సర్జరీ అనేది చాలా సాధారణమైన ప్రక్రియ. ప్రతి ఒక్కరూఏదో ఒక భాగానికి సర్జరీ చేయించుకున్నవారే ! ఆంగ్లేయులు వారి వైద్య విధానాన్ని మనకి పరిచయం చేయక ముందు మన దేశంలో ఈ వైద్య విధానం ఉండేదా ? ఆపరేషన్లు అప్పటి కాలంలో ఉండేవి కావా ? ఒకవేళ , ఏ చెయ్యి ప్రమాద వశాత్తూ తెగిపోతే, ఏం చేసేవారు ? కళ్ళలో శుక్లాలు వస్తే ఎలాంటి వైద్యం చేయించుకునేవారు ? ఇవన్నీ తెలుసుకోవాల్సిన సమాధానాలు . 

భారతదేశంలో విజ్ఞానం చాలా అభివృద్ధి  చెందింది అనడానికి సాక్ష్యాలు మన ఆయుర్వేదంలో కనిపిస్తున్నాయి. దాదాపు 5000 ఏళ్ళ క్రితం నాటి కథ ఇది . లిఖితపూర్వకమైన సాక్ష్యాలతో నిండిన తిరుగులేని వాస్తవం ఇది . శస్త్రచికిత్స (ఆపరేషన్ టెక్నాలజీ) కి ఆద్యుడు సుశ్రుతుడు అనే భారతీయ మహర్షి . రాజర్షి , బ్రహ్మర్షి , మహర్షి విశ్వామిత్రుని కొడుకు ఈ  సుశ్రుతుడు. ఆయుర్వేద పితామహుడు అయిన ధన్వంతరి శిష్యుడు. క్రీస్తు పూర్వమే సర్జరీ ఎలా చేయాలో కనిపెట్టిన గొప్ప శాస్త్రవేత్త. 

అనస్తీషియా ( మత్తుమందు ఇచ్చి ఆపరేషన్ చేయడం ) అనే విధానాన్ని కనిపెట్టారు . విరిగిన ఎముకలు అతికించాడు.  తెగిన శరీరభాగాలని ఒక్కటిగా తిరిగి అంటించాడు . ప్లాస్టిక్ సర్జరీకి ప్రాణం పోశాడు . ప్రపంచం వైద్యశాస్త్రం గురించి కళ్లు తెరవకముందే, వైద్యశాస్త్రాన్ని సుసంపన్నం చేసి పూర్ణప్రకాశంతో ప్రపంచం ముందు నిలిపారు.  

శస్త్రచికిత్సా విధానాన్ని చెప్పినప్పుడు అందుకు ఏయే పరికరాలని వాడాలనే విధానాన్ని ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది కదా ! ఈ  రంగంలో ఉన్నత ప్రమాణాలతో కూడిన పరికరాలు స్వయంగా తయారు చేసి, ఆ విధానాలని గ్రంధస్తం చేసి మానవాళికి అందించిన మహనీయుడు సుశ్రుతుడు .  దాదాపు 101 రకాల శస్త్రచికిత్సా పరికరాలను సుశృతుడు వివిధ సందర్భాలలో ఉపయోగించేవారు  . తెగిపోయిన అవయవాలను తిరిగి వాటి స్థానంలో అతికించడంలో సుశ్రుతుడుని మించినవారు మరొకరు లేరు . దీనికి సంబంధించిన ఒక సందర్భాన్ని మన పెద్దలు చెబుతూ ఉంటారు .

ఒకనాడు జోరుగా వాన కురుస్తోంది.  సుశ్రుతుని ఆశ్రమం తలుపు తట్టిన శబ్దంకావడంతో ఆయన వెళ్లి చూశారు. ఎదురుగా తెగిపోయిన ముక్కుని చేతిలో పట్టుకొని ఒక వ్యక్తి ఏడుస్తూకనిపించారు. వెంటనే, ఆయనలోని వైద్యుడు స్పందించారు . ఆ వ్యక్తికీ మంచి ఘాటైన ద్రాక్ష సారాయిని తాగించారు (అనస్థీషియా) . గడ్డం నుండీ ఆ తెగిపోయిన ముక్కుకి సమానమైన ముక్కని కోసి , ముక్కుకి అతికించి కట్టుకట్టారు . గడ్డానికి కుట్లు వేశారు . ఈ విధానం ఎలా చేశారో కూడా ఆయన చేత రచింపబడిన ‘శల్యతంత్రం’ వివరిస్తుంది. 

ఇప్పటికాలంలో చేశాయా పంచనామా (శవపరీక్ష)మొట్టమొదట నిర్వహించింది  సుశృతుడు . శవాన్ని పరిశీలించడం ఆ మరణం ఏ విధముగా సంభవించిందో నిర్ధారించడంలో సుశృతుడు గొప్ప నిష్ణాతుడు . అదేవిధముగా, చెడు రక్తాన్ని శరీరం నుండి తొలగించడంలోనూ , ఆరోగ్యవంతమైన రక్తాన్ని శరీరానికి అందించడంలోనూ , మూత్రనాళాల్లో , మూత్రపిండాలలో ఏర్పడిన రాళ్లను తొలగించడంలోనూ మరియు అనేక నిగూడ మరియు భయంకర రోగాలను అనతికాలంలో అతి సునాయాసముగా నయంచేయడంలో సుశ్రుతుడుది అందవేసిన చేయి .

ఇక ఆయన రాసిన సుశ్రుత సంహిత  ,  శల్యతంత్రం ( శస్త్రచికిత్స , సర్జరి లని వివరించే గ్రంధం  ) , అష్టాంగ వైద్యవిధానం (అష్టాంగ హృదయం వివరణ  ) ఈ రోజుకీ  ప్రామాణిక గ్రంథాలుగా  పరిగణింపబడుతున్నాయి . సుప్రసిద్ధ రససిద్ధుడు ఆచార్య నాగార్జునుడు ఈ గ్రంథాలని  ప్రశస్తమైనవని, ప్రామాణికమైనవని  ప్రస్తుతించాడు . ఈ గ్రంథాన్ని క్రీ . పూ 800 వ సంవత్సరంలో అరబ్ భాషలోకి అనువదించుకొని వెళ్లి వారివారి ప్రాంతాలలో వైద్యశాస్త్ర అభివృద్ది చేసుకున్నారు . రోమన్లు కూడా భారతీయ మౌళిక ఔషధవిధానాన్ని అనుసరించారు.

ఈ “సుశృత సంహిత” లలో 184 అధ్యాయాలు ఉన్నాయి. దీనిలో మనిషి సాధారణంగా గురికాబడే వ్యాధులు 1120 గా నిరూపింపబడింది. అలాగే మానవ శరీరం నిర్మాణం తీరుతెన్నుల గురించి, ప్రతి అవయవ నిర్మాణం గురించి విపులంగా చెప్పబడింది. 700 పై బడిన ఔషధీ మొక్కల లక్షణ విశేషాలు – ఏ వ్యాధికి ఏ మొక్క ఎలా ఔషధంగా ఉపయోగపడి రోగాన్ని ఎలా తగ్గిస్తుందో ఉదాహరణ పూర్వకంగా నిరూపించబడింది. 64 రకాల ఖనిజాల నుండి మందులను ఎలా తయారుచేసుకోవాలో యివ్వబడినాయి. అంతేకాక జంతు సంబంధమైన అవయవాల నుండి 57 ఔషదాలను తయారుచేసే వైద్య విన్ఞానం ఉంది.

ఈ గ్రంథంలో 101 శస్త్ర పరికరాల గురించి వివరించాడు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందేందుకు అందరికీ ప్రయోజనకరమైన అనువైన విధానాలతో, తేలికగా అర్థం చేసుకునే విధంగా ఈ గ్రంథ రచన చేశరు. ఈ రోజున కూడా వైద్య విధానాలకు ఈ రచన  ఒక బంగారు నిధిలాంటిది . ఏ చిన్న సర్జరీ లేకుండా అనేకానేక వ్యాథులను నియంత్రించడానికి, తగ్గించడానికి ఎన్నో సూచనలు ఈ గ్రంథంలో వివరించి ఉన్నాయి.

ఈ గ్రంథంలో విరిగిన ఎముకలు పనిచేసేందుకు కట్టే కర్ర బద్దీల గురించి, శస్త్ర చికిత్సలలో వాడే వివిధ పరికరాల గురించి, ప్రస్తావన ఉంది. శస్త్ర చికిత్సల గురించి విస్తృతంగా చర్చించడమే కాకుండా శస్త్ర చికిత్సలలో వాడే వివిధ శకలాల గురించి ఏకంగా ఒక తంత్రాన్నే రచించారు. దీనినే “శల్యతంత్ర” అంటారు. ఇతర వైద్య విభాగాలలో కూడా ఎంతో సాధికారత సాధించిన ఈయన గాయాలకు, పుండ్లకు చీము చేరకుండా నయం చేయడమే చికిత్స అని, వేగవంతమైన చికిత్స ఇతర వ్యాథులను దరిచేరనివ్వకూడదని పేర్కొన్నాడు. మత్తుమందు ఇవ్వకుండా శస్త్రచికిత్స చేయటం అమానుషమని భావించి మూలికారసము, సోమరసము (మధ్యం) ద్వారా మత్తు కలిగించి, “అనస్తీషియా” ప్రక్రియకు నంది పలికారు .
 
భారతీయులమైన మనలో చాలామందికి ఈయన పేరు కూడా సరిగ్గా పరిచయం లేకపోవడం మన దౌర్భాగ్యం. కానీ , ఈయన విగ్రహాన్ని మెల్ బోర్న్ లోని తమ “రాయల్ ఆస్ట్రేలియన్ కాలేజ్ ఆఫ్ సర్జిరి ” లో ఎంతో గౌరవంగా ప్రతిష్ఠించుకున్నారు ఆదేశం వారు. ఈ రోజుల్లో ఉన్న  టెక్నాలజీపై అప్పట్లో లేదు . అయినా ఎన్నో  అద్భుతాలను కనుగొని జాతికి అందించిన మహానుభావుడు సుశ్రుతుడు. ప్రపంచానికి వైద్య శాస్త్ర పరిచయం చేసిన గొప్ప వైద్య వేత్త. ఇటువంటి మహానుభావుల గురించి మనం తెలుసుకొని , మన ముందు తరాలవారికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది . 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore