Online Puja Services

మృత్యుభయాన్ని నాశనం చేసే యముని సరస్సు !

18.227.52.248

మృత్యుభయాన్ని నాశనం చేసే యముని సరస్సు !
-సేకరణ: లక్ష్మి రమణ  
 
ఆయన రూపమే విలక్షణం. నల్లని దున్నపోతుని అధిరోహించి, కమ్ముతున్న కారుమేఘంలా, చేతిలో యమపాశమనే మెరుపుతీగలాంటి ధర్మదండాన్ని పట్టుక్క యమధర్మరాజుని చూడగానే భయపడని ప్రాణి సృష్టిలో ఉండదు . కానీ ఆయన హృదయం నవనీతం. భక్తులకీ , ధర్మానువర్తులకీ ఆయన సులభసాధ్యుడు . అపమృత్యుభయాన్ని తొలగించే దయామయుడు . ఆయనకి సంబంధించిన ఒక దివ్యమైన క్షేత్ర విశేషాలే ఇవి. 

ధర్మం నాలుగుపాయాలతో నడిచేలా , పాపపుణ్యాలని లెక్కలుకట్టి శిక్షలు వేసే స్వామి యముడు . ఆయనంటే అందుకే అందరికీ భయం. కానీ ఆయన శివాజ్ఞ పరిపాలనా దక్షుడు . లయకారుడైన శివుని ఆజ్ఞానుసారంగా ఆయన జీవుల లయాన్ని నిర్వర్తిస్తుంటాడు .  ఎవరి పట్ల పక్షపాతం చూపకుండా అందరికీ సమాన శిక్షలను అమలు చేస్తుంటారు. 

కానీ యముడికి మాత్రం ఆలయాలు చాలా అరుదు. ఉన్నా కూడా శివాలయంలో అంతర్భాగంగా ఉంటాయి. కానీ ఒకే ఒక చోట మాత్రం యముడు స్వయంగా నిర్మించిన సరస్సును యమునితో సమానంగా భావించి పూజిస్తారు. భక్తితో స్నానం ఆచరిస్తారు. అందులో స్నానం చేస్తే మృత్యుభయం పోతుందని నమ్మకం. 

ఇది తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరువైకావూర్ అనే చిన్న గ్రామంలో ఈ దేవాలయం ఉంది. తమిళనాడులోని ప్రముఖ పర్యాటక కేంద్రం కుంభకోణం నుంచి కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఈ మహిమాన్వితమైన దేవాలయం ఉంది. ఇక్కడ ప్రధాన దైవం పరమశివుడు. ఈ దేవాలయానికి నాలుగు దిక్కులా నాలుగు ద్వారాలు ఉంటాయి. అద్భుతమైన శిల్పకళ తో అలరారుతుంటుంది. 

ఇక్కడ శివుడు, ఆయన కార్యసాధకుడు అయిన యముడు ఇక్కడ వెలసి ఉండడానికి ఒక స్థానిక గాథ ఉంది .  పూర్వం ఇక్కడ ఓ సాధువు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఒకానొక రోజున ఓ వేటగాడు జింకను తరుముతూ ఈ ప్రాంతానికి వస్తాడు. దీంతో ఆ జింక ప్రాణ భయంతో ముని వద్దకు వచ్చి రక్షణ కోరుతుంది. ఆ సాధుజంతువు దీన స్థితికి చలించిపోయిన ముని ఓ పులిలా మారిపోతాడు.

ఆ వేటగాడిని అక్కడి నుంచి దూరంగా తరమడానికి , గట్టిగా గాండ్రిస్తాడు. వెంటనే వేటగాడు దగ్గర్లో ఉన్న బిల్వ చెట్టు పైభాగంలోకి చేరుకొంటాడు. ఎంత సేపైనా పులి ఆ చెట్టు నుంచి దూరంగా వెళ్లదు. దీంతో ఆ వేటగాడు ఈ చెట్టు చిటారు కొమ్మకు చేరుకొంటాడు. సూర్యోదయం అయినా కూడా ఆ పులి అక్కడి నుంచి కదలదు. ఇక వేటగాడు రాత్రికి ఆ చెట్టు పైనే ఉండిపోవాలని నిర్ణయించుకొంటాడు. అయితే నిద్రపోయి ఆ మత్తులో కిందికి పడిపోతే పులి తనను తినేస్తుందని భయపడుతాడు. నిద్ర రాకుండా ఉండటం కోసం ఒక్కొక్క బిల్వ పత్రాన్ని తుంచి కిందికి వేస్తాడు. ఆ పత్రాలు ఆ చెట్టు కింద ఉన్న శివలింగాన్ని తాకుతాయి. అదే రోజు శివరాత్రి. దీంతో రాత్రి మొత్తం ఆ వేటగాడు ఆ చెట్టు పైనే జాగారణ చేస్తూ శివలింగం పై ఆ పత్రాలను వేస్తూనే ఉంటాడు. దీంతో శివుడు అతని పూజకు మెచ్చుకొని అక్కడ ప్రత్యక్షమవుతాడు. శివుడిని చూసి పులి రూపంలో ఉన్న సాధువు, ఆ బోయవాడు స్తుతిస్తారు.

దీంతో మరింత ఆనందబరితుడైన పరమేశ్వరుడు వారికి మోక్షం అనుగ్రహిస్తాడు. శివుడి కృపకు పాత్రులైన ఆ ఇద్దరి ప్రాణాలను తీసుకెళ్లడానికి యముడు స్వయంగా ఇక్కడికి వస్తాడు. అంతేకాకుండా పరమేశ్వరుడి ఆజ్ఞ మేరకు వారి ఇద్దరి పేరుపై ఇక్కడ ఓ పెద్ద సరస్సును యముడు స్వయంగా నిర్మిస్తాడు.

యముడు నిర్మించిన ఈ సరస్సులో స్నానం చేస్తే మృత్యుభయం దూరమవుతుందని శివుడు అనుగ్రహమిస్తాడు. దీంతో అప్పటి నుంచి భక్తులు ఇక్కడ పవిత్ర స్నానాలు చేస్తుంటారు. కాగా విష్ణువు కూడా తనకు అంటిన ఓ శాప నివృత్తి కోసం ఈ సరస్సులో స్నానం చేశాడని పురాణ కథనం. కాబట్టి వీలయితే ఒకసారి దర్శనం చేసుకొని రండి. 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore