భగవంతుని అనుగ్రహం ఇలాగే ఉంటుంది!
భగవంతుని అనుగ్రహం ఇలాగే ఉంటుంది!
-సేకరణ
గురువు యొక్క అనుగ్రహాన్ని అర్థం చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఎండి బీళ్ళు వారిపోయిననేలమీద చల్లని చిరుజల్లులు కురిసి నట్టు ఆయన అనుగ్రహం వర్షిస్తుంది. దానిని అర్థం చేసుకోవడం, నమ్మడం అనేది శిష్యుని విజ్ఞత. నడిచే దేవుడని పేరొందిన పరమాచార్యవారి లీలా విశేషాలు కూడా ఇలాగే ఉంటాయి. ఆ గురువుని ఆశ్రయించినవారికి ఆయన ఎల్లప్పుడూ వెంటుండి , ఒక ఋజుమార్గంలో నడిపారు . అటువంటిదే ఒక కథావిశేషం .
లీలామానుష రూపమైన పరమాత్ముని లీలాలని అర్థం చేసుకోవడం చాలా కష్టం . దైవం అంటే స్వయంగా సద్గురువే ! అందుకేకదా మన పెద్దలు గురువుని మించిన దైవం లేదని చెబుతుంటారు . ఈ కథకూడా అలా గురువుని ఆశ్రయించిన ఒక శిష్యుడిది. శ్రీకృష్ణుని ప్రభువుగా అంగీకరించి ఆశ్రయించిన స్నేహితుడు కుచేలుడిది .
అది తంజావూరు దగ్గరలోని నల్లిచెర్రి గ్రామం. వేదాలను పూర్ణ అధ్యయనం చేసిన సాంబశివ శ్రౌతి గారు ఆ గ్రామంలో ఉండేవారు. అంతిమకాలంలో సన్యాశాశ్రమం తీసుకున్నారు. వారికి పూర్ణ అధ్యయనం చేసిన ఒకే ఒక్క కుమారుడు ఉన్నాడు. అతనిది బలహీనమైన గుండె. ఆపకుండా అయిదు నిముషాలకంటే ఎక్కువ వేద పారాయణ చెయ్యడానికి కుదిరేది కాదు. అతని స్థితిని చూసినవారికి భయం కలిగేది. దీనివల్ల, వైదిక కార్యక్రమాలకు అతడిని ఎవరూ పిలిచేవారు కాదు. ఆ తల్లీకొడుకులు చాలా దుర్భరమైన జీవితాన్ని గడిపేవారు.
కానీ , అతను స్వరంతో స్పష్టమైన ఉచ్చారణతో వేదం పఠిస్తుంటే వినడానికి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. కానీ మధ్యలో అతని ఊపిరి ఆగిపోతే ? అందుకనే అతని గురువులు మొదటి అసౌకర్యానికే వేదపఠనం ఆపమని చెబుతుండేవారు. అతను ఆ పౌరోహిత్యాన్నే నమ్ముకున్న కుటుంబానికి చెందినవాడు, దైవాన్నే నమ్ముకున్నవాడు. అందుకే కాంచీపురం పరమాచార్యవారినే శరణు కోరాలని నిర్ణయించుకున్నాడు.
పరమాచార్య స్వామివారిని దర్శించి, అక్కడ స్వామివారితో, ‘నేను పూర్ణ అధ్యయనం చేసిన ఒక సన్యాసి కుమారుడిని. వేదంలో ఏమైనా అడగండి నేను చెబుతాను. నా కష్టాన్ని తీర్చడానికి మీరు నాకు సహాయం చెయ్యాలి’ అని అడిగాడు . అందుకు స్వామివారు, ‘నీ తల్లితో కలిసి ఇక్కడ ఉండు, ఏమి చెయ్యాలో చెబుతాను’ అన్నారు. అప్పటినుండి ప్రతీరోజూ ఉదయం, సాయంత్రం దర్శనం చేసుకుని తన బాధను చెప్పుకునేవాడు . హఠాత్తుగా ఒకనాటి సాయంత్రం, ‘మీ ఊరికి నువ్వు వెళ్ళు’ అని చెప్పారు. ఇక ఏమీ లేదన్నట్టు చేతులు చాచి, ఒక యువకునితో అతనికి బస్సు టికెట్లు తెప్పించి తల్లితో సహా ఊరికి వెళ్ళమని చెప్పారు.
దారి చూపిస్తాడనుకుని ఆశ్రయించిన దేవుడు, లేదు పొమ్మన్నాడని భావించాడా యువకుడు . కళ్ళు ఎర్రటి నిప్పులయ్యాయి. మారు మాట్లాడకుండా బస్సెక్కి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు .
ఊరికి చేరగానే, ఇంకా తమ వీధి మలుపు తిరగకుండానే , అక్కడివారు అతన్ని పలుకరించారు. “మీ ఇంటి అరుగుపై ఎవరో ఒక బండెడు వరిధాన్యం దించి వెళ్ళిపోయారు. మీరు వచ్చేదాకా దాన్ని కాస్త చూసుకొమ్మని మాకు చెప్పారు. నీ అదృష్టం బావుంది!” అన్నారు .
అంటే, అప్పటివరకూ అతన్ని వెన్నటిన ఆక్రోశం , ఆ పరమ పావన హృదయుణ్ణి అనవసరంగా ద్వేషించిన హృదయం కరిగిపోయింది. కళ్ళవెంట ధారలై వర్షించింది. హృదయం ఆ గురువు పట్ల ప్రేమతో నిండిపోయి బరువెక్కింది. ఎంతై కరునొచూడండి ఆ పరమాచార్యవారికి!
ఆ భక్తుడికి తన దగ్గర ఆశ్రయమిచ్చిన రోజే అతణ్ణి కటాక్షించాలని స్వామివారు నిర్ణయించారు. వారికి ధాన్యం పంపే రచనని అంతకు రెండురోజుల ముందరే చేశారు పరమాచార్యవారు ! కుంభకోణానికి చెందిన ప్రముఖ భూస్వామి స్వామీ దర్శనానికి వచ్చారు . స్వామివారు ఎప్పటిలాగే ఆయన క్షేమసమాచారాలను, ఆ సంవత్సరం వ్యవసాయ లాభ నష్టాలను అడిగి తెలుసుకున్నారు. తరువాత “ఒక బండెడు ధాన్యం నాకివ్వగలవా?” అని అతణ్ణి అడిగారు.
దేవుడే దిగివచ్చి వరాన్ని అడిగితె, కాదనే భక్తుడు ఉంటాడా ! సరే నన్నాడు ఆయన . “నువ్వు ఇప్పుడు వెళ్ళి, కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకుని ఇక్కడకు తిరిగిరా” అని ఆ భూస్వామిని ఆదేశించారు. అతను వెళ్ళిన తరువాత, మన కథానాయకుడి ఇంటి చిరునామా, ఇంటికి అరుగు ఉందా అన్న విషయాలను సేకరించారు.
భూస్వామి తిరిగొచ్చిన తరువాత, ఆ చిరునామా ఇచ్చి, “ఒక బండెడు ధాన్యాన్ని ఆ ఇంటి అరుగుపై దింపు. నువ్వు ఈరోజే కుంభకోణం వెళ్ళు. రేపటి సాయంత్రానికి ధాన్యం ఆ ఇల్లు చేరుతుందా?” అని అడిగారు. ఆరోజే ఆ భూస్వామి కుంభకోణం చేరుకుని, మరుసటిరోజు ఉదయమే బండెడు ధాన్యాన్ని పంపి, ఇంటి ముందు దింపి, ఆ వీధిలో ఉన్నవాళ్లని కాస్త చూస్తూండమని చెప్పాడు.
కుచేలుని అనుగ్రహించదలచిన కృష్ణుడు ఆడిన నాటకం ఇదే కదా? కారుణ్యం అంటే పరమాచార్య స్వామివారిదే కావొచ్చు.
అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।
ఇది తంజావూరు సంతానరామన్ రచన మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1కి స్వేచ్చానువాదం .