ఎవరీ తథాస్తు దేవతలు?
ఎవరీ తథాస్తు దేవతలు?
లక్ష్మీ రమణ
‘పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి, పైన తథాస్తు దేవతలుంటారు’ అని ఇంట్లో పెద్దవాళ్ళు హెచ్చరిస్తూ ఉంటారు . అసలు ఎవరీ తథాస్తు దేవతలు? ఎందుకీ దేవతలెప్పుడూ మనం ఏం మాట్లాడుకుంటామా అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు? తథాస్తు అంటే, అలాగే జరుగుగాక అని దీవిచడమేగా ! వాళ్ళ మాటకి ఎదురులేదనే గర్వమా ఏమిటి ? అని అనుకోగలరు . అలాటి విశేషం ఏమీ లేదని వేదంలోని యజ్ఞప్రకరణం దీనికి సమాధానం చెబుతుంది అని పెద్దలంటున్నారు. ఆవిశేషాలేంటో తెలుసుకుందామా !
వేదాలలో ‘అనుమతి’ అనే దేవతలు ఉంటారు . యజ్ఞయాగాది సత్కర్మలు ఆచరించేటప్పుడు, ఈ దేవతలను స్మరిస్తే వారికి కార్యసిద్ధి లభించేలాగ వీరు సహకరిస్తారని యజ్ఞ ప్రకరణంలో పేర్కొన్నారు. ఆ అనుమతి దేవతలనే సామాన్య భాషలో "తథాస్తు దేవతలు" అంటున్నారు.
సత్కర్మలు జరిగే పవిత్ర ప్రదేశాలే వారి నివాస స్థానం. మరో విధంగా చెప్పుకుంటే, అశ్వినీ దేవతలే తథాస్తు దేవతలు. వీరు సూర్యుని కుమారులు. అశ్వ రూపంలో ఉన్న సూర్యుడునికి, సంధ్యాదేవికీ జన్మించారు. మహాభారతంలో పాండురాజు భార్య మాద్రికి మంత్ర ప్రభావంతో నకుల, సహదేవులని ప్రసాదించిన దేవతలు ఈ అశ్వనీ దేవతలు . దక్ష ప్రజాపతి నుంచి ఆయుర్వేదాన్ని నేర్చుకొని, దానిని ఇంద్రునికి నేర్పించారు. వీరి సోదరి ఉష. ఆమె ప్రతిరోజూ వీరిని బ్రహ్మ ముహూర్తంలో మేల్కొల్పుతుంది. ఆ తర్వాత వారు తమ సోదరి ఉషను ముందు కూర్చోబెట్టుకుని రథాన్ని అధిరోహించి తూర్పు నుంచి పడమటకు ప్రయాణిస్తారని పురాణ వర్ణన. వీరు దైవ వైద్యులు కూడా !
ఏం మాట్లాడినా తథాస్తు దేవతలుంటారు జాగ్రత్త అని మనల్ని పెద్దలు హెచ్చరిస్తుంటారుకదా ! ప్రత్యేకించి వారు సంధ్యా సమయంలో సంచరిస్తారని అంటారు. పదే పదే చెడు మాటలు అంటూ ఉంటె, పొరపాటున అదే సమయంలో వారు తథాస్తూ అంటే, జరిగిపోతుందట. అందుకే, ధర్మానికి విరుద్ధంగా ఉచ్చరించ కూడని మాటలను పదేపదే అనకూడదని చెబుతారు .
అలాగే , ‘లేదు’ అనే పదం అసలు మాట్లాడనే కూడని మాట. అందుకే మనవాళ్ళు బియ్యమో, ఉప్పో డబ్బాలో అడుగుపడితే, ‘నిండుకుంది’ అని అంటారు . కానీ ‘లేదు’ అని అనరు . అదేవిధంగా , డబ్బు ఎంత ఉన్నా, లేదు లేదు అని పలుమార్లు అంటే నిజంగా లేకుండానే పోతుంది. ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నామని తరచూ అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి, స్థితిగతుల గురించి అసత్యాలు, అవాస్తవాలు పలకడం మంచిది కాదు అని చెబుతారు పెద్దలు .