వెంకటనాథుడు గురురాఘవేంద్రులు ఎలా అయ్యారు ?
వెంకటనాథుడు గురురాఘవేంద్రులు ఎలా అయ్యారు ?
-సేకరణ: లక్ష్మి రమణ
గురు శబ్దమే అంధకారాన్ని నిరోధించేది. చీకట్లని చీల్చి విచ్చుకున్న వెలుగురేఖ కి ప్రతీక . అఖండమైన జ్ఞానదీపమై ప్రకాశించే అగ్నిశిఖ . అటువంటి సద్గురువులు శ్రీ గురురాఘవేంద్రులవారు . మూలరాముని కృపని పొంది, నేటికీ తన బృందావనం నుండీ భక్తులను అనుగ్రహిస్తున్న పరమపావన మూర్తి . ఆయన సాక్షాత్తు శ్రీమహావిష్ణువుకు ప్రియభక్తుడైన ప్రహ్లాదుని అపరావతారమే అని చెబుతారు పెద్దలు . ఆ మహనీయుని గురించిన కొన్ని విషయాలు మీ ముందుంచే ప్రయత్నమే ఇది .
1571లో కాంచీపురం సమీపంలోని భువనగిరిలో నిరుపేద కుటుంబంలో తిమ్మన్నభట్టు, గోపికాంబ దంపతులకు జన్మించారు రాఘవేంద్రులవారు. రాఘవేంద్రుల వారి అసలు పేరు వెంకటనాధుడు. వీరి తాతగారు శ్రీకృష్ణ్ణదేవరాయల ఆస్థాన వైణికుడిగా వుండేవారు. పసివయసులోనే తల్లిదండ్రులని కోల్పోయిన వెంకటనాథుడు బావగారైన లక్ష్మీనారాయణగారి దగ్గర పెరిగారు. బావగారి సారధ్యంలోనే వెంకటనాథుడు సర్వశాస్త్ర పారంగతుడయ్యారు.
యుక్తవయసు రాగానే సరస్వతి అనే కన్యతో వివాహమైంది. ఒక బిడ్డకు తండ్రయారు. ఈ పరిస్థితులలో వెంకటనాధునికి దారిద్ర్యం పట్టి పీడించసాగింది. జీవనాధారం కరువయ్యింది. నిస్సహాయ స్థితిలో వెంకటనాధుడు భార్యాబిడ్డలతో కలిసి కుంభకోణం చేరుకున్నారు. ఈ పరిస్థితుల్లోనే వేంకటనాథుడు సుధీంద్ర యతీంద్రుల వద్ద శిష్యునిగా చేరారు. అనతి కాలంలోనే సుధీంద్రుల వారికి ప్రియశిష్యుడుగా మారిపోయారు.
ఈతని అసామాన్య ప్రజ్ఞాపాటవాలకు, అతని మేథాశక్తి, శాస్త్ర జ్ఞాన ప్రావీణ్యాన్ని, వినయ విధేయతలు, చిత్తశుద్ధీ గమనించిన సుధీంద్ర యతీంద్రులు తన తరువాత మఠ బాధ్యతలను స్వీకరించే బాధ్యతను అతనికే అప్పగించాలని నిర్ణయించుకున్నారు. ఒక రోజు సుధీంద్రులు శిష్యుడైన వెంకటనాధుని పిలిచి, తన మనసులోని ఆలోచనను బయటపెట్టారు. “వెంకటనాథా! నేను వృద్ధాప్యంలో ఉన్నాను. నా తదనంతరం రామచంద్రమూర్తి ఆరాధన నిరంతరాయంగా కొనసాగించేందుకు నా తర్వాత ఈ పీఠాధిపత్యం నీవు వహించాలి” అని తన మనసులోని కోరికను బయటపెట్టారు.గురువాజ్ఞ మీరలేనిది . కానీ తన భార్యాబిడ్డల బాధ్యత మాటేమిటి ? మీమాంసలో పడ్డాడా శిష్యుడు .
ఓవైపు బాధ్యత, మరోవైపు గురువుగారి కోరిక, అన్నిటికి మించి ముక్తిని ప్రసాదించే మఠంలోని మూలరాముల ఆరాధన! మనసు మథనం ఎరిగిన శారదాంబ స్వయంగా వచ్చి , కలతపడుతున్న వేంకటనాథునికి మార్గనిర్దేశం చేసింది. వేంకటనాథుని స్వప్నంలో సరస్వతీమాత సాక్షాత్కరించి “నాయనా వెంకటనాథా! నీవు కారణ జన్ముడవు. నీ అద్భుత మేధా సంపత్తితో సద్గురువువై, దారి తప్పిన జనాలకు వెనుదివిటీవై దారి చూపు! మధ్వ సిద్ధాంతాన్ని మధ్వ సాంప్రదాయాన్ని రక్షించగల సమర్ధుడవు నీవే. ఇక ఆలోచించకు, సందిగ్ధాన్ని తొలగించుకొని నీ గురువు చెప్పినట్టు చెయ్యి” అని చెప్పింది. దాంతో వెంకటనాథుడు తన సంశయాన్ని వదిలిపెట్టి గురువు దగ్గరకు చేరుకున్నాడు. బంధాలనుండీ బయటపడితేనేకదా , ముక్తి కాంత దర్శనం దొరికేది !
సుధీంద్ర యతీంద్రులు వెంకటనాథుని తంజావూరులోని తన ఆశ్రమానికి తీసుకునిపోయి శాస్త్రోక్తంగా సన్యాస దీక్షనిచ్చి పీఠాధిపత్యం అప్పగించాడు. ఆనాటికి వేంకటనాథుడి వయసు 23 సంవత్సరాలు. ఆనాటి సన్యాసదీక్షానంతరం వెంకటనాధునికి వచ్చిన పేరే రాఘవేంద్రస్వామి. అప్పటినుంచి వేంకటనాథుడు రాఘవేంద్ర గురుదేవుడిగా ఎంతోమందికి దిక్సూచిగా మారారు.
రాఘవేంద్రునిగా 40 సంవత్సరాలు అతి పవిత్ర జీవనం గడిపి నియమ నిష్టలతో నిత్య నైమిత్తికాలతో మూలరాముని ఆరాధించారు. ఆనాటి నవాబు ఒకరు రాఘవేంద్రులను పరీక్షింపదలచి రెండు బుట్టలతో మాంసం,మద్యం ఒక పళ్ళెంలో పెట్టి దానిపై బట్ట కప్పి తీసుకువచ్చి రాఘవేంద్రునికి సమర్పించాడు. అయితే రాఘవేంద్రులవారు ఆ పళ్ళెంపైని తన కమండలంలోని నీటిని చిలకరించి, ఆ తరువాత బట్టను తొలగించారట. ఆశ్చర్యంగా అందులో పువ్వులు, పళ్ళు కనబడ్డాయట. దాంతో ఆ నవాబు కూడా రాఘవేంద్రుల వారికి శిష్యుడుగా మారిపోయాడట. స్వామివారి ఇలాంటి మహిమలు లెక్కకు మిక్కిలి.
రాఘవేంద్రులవారు పీఠాధిపత్యం వహించి నలభై ఏళ్లు పూర్తి కావస్తుండగా తుంగభద్ర నదీతీరాన మంత్రాలయంలో జీవసమాధి అయ్యారు. స్వామి సూచన ప్రకారం శిష్యులు చక్కటి బృందావనం ఏర్పాటు చేసారు. 1671 విరోది నామ సంవత్సరం శ్రావణ బహుళ విదియ, గురువారం, సూర్యోదయానికి ముందే మూల రాముణ్ణి అద్భుత గానంతో పూజించి, తన వీణతో సహా సజీవంగా బృందావనంలో ప్రవేశించి జీవసమాధి చెందారు శ్రీ రాఘవేందస్వ్రామి. ‘నేను నా సమాధి నుంచే భక్తులను అనుగ్రహిస్తానని’ ఆయన మాట . ఆ మాట ప్రకారమే , ఈనాటికి కూడా బృందావనం నుండే ఎంతోమంది ఆర్తులను అనుగ్రహిస్తున్నారు శ్రీ రాఘవేంద్ర సద్గురువులు .
శ్రీ గురుభ్యోనమః