భర్తని కొంగున ముడేసుకోవాలంటే , ఏ మంత్రం వేయాలి ?
భర్తని కొంగున ముడేసుకోవాలంటే , ఏ మంత్రం వేయాలి ?
-లక్ష్మీరమణ
ఇది దేశ విదేశాలతో సంబంధం లేకుండా , ఆడవాళ్ళందరి ఆశ ఇది . అసలు భర్తని కొంగున ముడేసుకోవం అంటే ఏమిటి ? తాము చెప్పినట్టు విని, అదేవిధంగా నడుచుకోవడమేనా ? ఒకవేళ నిజంగా గీసినగీటుదాటని భర్తలతో భార్యలు సంతోషంగా ఉంటారా? కానీ అలా ఉండాలి అనుకుంటే మాత్రం , అటువంటి ఆశలు తీరే మార్గం మంత్రం అంటున్నారు ద్రష్టలు . ఆ విశేషాలు మీకోసం !
శాస్త్రం అంటేనే , నిరూపితమైనది అని కదా అర్థం . మంత్రశాస్త్రం కూడా అలాంటిదే . శబ్దంలో నిగూఢమైయున్న శక్తిని ఆవాహనచేసి, ఆ శక్తి ద్వారా సిద్ధిని పొందడం భారతీయులకి కొత్తదైన విషయం కాదు. అనాదిగా మనం యుద్ధాలలో కూడా మంత్రయుక్తంగా శక్తిని ఆవాహన చేసి , ఆ శక్తి స్వరూపమైన ఆయుధ ప్రయోగం చేయడమనే ప్రక్రియని కూడా చేసిన చరిత్ర మనది . ఇప్పుడు అలాంటి సాంకేతికత కనుమరుగైపోయింది. కానీ ఒక మంత్రాన్ని గురువు నుండీ ఉపదేశం పొంది దాన్ని అనుష్ఠానం చేయడం , పద్ధతితో, నిష్ఠతో, ధ్యానంతో , ధ్యాసతో సాధన చేయడం వలన ఖచ్చితంగా అది సిద్దించి , కామ్యములు తీరతాయనడంలో సందేహం లేదు .
భార్యాభర్తల అనుకూలతలు సిద్ధించేందుకు కూడా అటువంటిదే ఒక మంత్రమును మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. అయితే, భార్యాభర్తలిద్దరూ, ఒకరికి ఒకరే కానీ, ఒకరిని మించి ఒకరు కాదు. అందుకే వివాహసమహంలో ధర్మేచా, అర్థేచా , కామేచా నాతి చరామి . అని చెప్పిస్తారు . ధర్మములో , సంపాదనాది పోషణకి సంబంధించిన విషయములో , కోరికలలో ఆమె చేయిని విడువను అని ఈ ప్రమాణం . ఇద్దరూ ఒకరికి ఒకరై తోడూ నీడగా ఉంటేనే భార్యకి గౌరవం, భర్తకి సంతోషం . కానీ, కాలం ప్రభావమో, లేకపోతె, చుట్టూ ఉన్న సమాజం ప్రభావమోగానీ ఇటీవలి కాలంలో వివాహేతర సంబంధాలు, భార్యాభర్తల మధ్య అకారణంగా గొడవలు , మూడవ వ్యక్తి ప్రమేయంతో తెగతెంపులవుతున్న బంధాలు విపరీతంగా పెరిగిపోయాయి.
. భర్తని కొంగున కట్టేసుకోవడం అంటే, అతని మనసుని గెలుచుకోవడమే కదా ! మనసెరిగి ప్రవర్తించగలిగిన సహనాన్ని ప్రసా దించి, అన్యోన్యతని ఆ జంటకి ప్రసాదించామనే కదా మహిళలందరూ నోములూ వ్రతాలూ చేసేది. పాపం ఆ సత్యభామకూడా, భర్త ప్రేమకోసమే, ఆయన్ని గెలుచుకోవాలనుకునే (దాసుడుగా కాదు , కేవలం తానొక దాసిగా ), భర్తని వేలంవేసే దాకా వెళ్ళింది . ఇటువంటి పరిస్థితుల్లో భర్తని తనవైపుకు తిప్పుకోగలిగిన మంత్రం ఇది . అటువంటి ప్రేమని,అన్యోన్యతని కోరుకొనే స్త్రీలకి కావాల్సిన ఆకర్షణ శక్తిని , సహనాన్ని, శాంతిని ప్రసాదించే మంత్రం ఇది అని పండిత వచనం .
వ్యసనాలకు బానిసై , ఇంటి ఇల్లాలిని సరిగా పట్టించుకోలేని భర్తలు, అప్పుల పాలై భార్యా పిల్లల కనీస అవసరాలను కూడా తీర్చలేనివారు, పరస్త్రీ వ్యామోహం లో పడి భార్యను నిరాదరణ చేసేవారు- ఈ విధంగా అనేక రకాల సమస్యలు ఉన్న స్త్రీలు నేటి సమాజంలో ఉన్నారు. ధర్మబద్ధంగా పొందిన భర్తను, తనవద్దకు చేర్చమని ప్రార్థించడానికే తప్ప ఇది ఇతరేతర కోరికల కోసం కాదు. లలితా అమ్మవారు కూడా భర్తైన పరమశివుని గెలుచుకుని , సత్కార్యాలకు తన వల్లభుని పై ఆధిపత్యాన్ని వినియోగించింది తప్ప ఇతరేతర అధర్మకార్యాలకు కాదు.
మంత్రం :
|| ఓం ఐం హ్రీం శ్రీం స్వాధీన వల్లభాయైనమః ||
17 వేల సార్లు ఈ మంత్రం జపం చేయాలి. భక్తి శ్రద్ధలతో నిరంతరం జపం చేయాలి. మంత్రం అనేది గురువు ద్వారా , ఉపదేశంగా స్వీకరించాలని గుర్తుంచుకోండి . శుభం !