విమానాల బొమ్మలే నైవేద్యాలూ, ప్రసాదాలూనూ
ఇక్కడ విమానాల బొమ్మలే నైవేద్యాలూ, ప్రసాదాలూనూ !
లక్ష్మీ రమణ
విదేశాల్లోని ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలని అందిపుచ్చుకోవాలని తహతహలాడే భారతీయులకి కొదవలేదు. అందుకోసం , మొక్కని కుటుంబం ఈ వేదభూమి మీద ఉండదు అంటేకూడా ఇప్పటిరోజుల్లో అతిశయోక్తి కాదేమో ! ఎందుకంటె, మనం గ్రీన్కార్డుకి అంతగా వశమై పోయాంకదా మరి . సరే, దేవుళ్ళల్లోనూ ఒక శాఖవారు ఈ వీసాలని ఇప్పించే పనినే గట్టిగా పెట్టుకున్నారు. ఈ ఆలయాల్లో వీసాకి సంబంధించిన మనవిని వినిపిస్తే, ఆ భగవంతుని అనుగ్రహం సిద్ధించి త్వరగా వీసా, పాసుపోర్టులు వచ్చేస్తాయట ! ఆ వివరాలు ఇక్కడ మీకోసం .
మన తెలుగు రాష్టాలలో వీసాల దేవునిగా ప్రసిద్ధిని పొందిన చిలుకూరు బాలాజీవారిని గురించి అందరికీ తెలిసిందే. అయితే, పంజాబులో కూడా మరో ఆలయం ఇదే అనుమతులు ఇప్పించేపనిలో ఉన్నదని తెలుస్తోంది . అదే పంజాబ్ లోని ‘జలంధర్ తల్ హాన్’ లో ‘హవాయూ జహాజ్ గురుద్వారా’ గా పిలిచే సిక్కుదేవాలయం. ఒకప్పుడు ఈ గురుద్వారాని షహీద్ బాబా నిహాల్ సింగ్ గురుద్వారాగా పిలిచేవారు.
ఈ గురుద్వారాను స్థానిక జాట్ కమ్యునిటీ, దళిత వర్గాల ప్రజలు వందేళ్ల క్రితం నిర్మించారు. ఈ గురుద్వారాలో నిర్వహించే ప్రార్ధనల ద్వారా , వీసా ఆమోదం పొందగలరు అనే విశ్వాసం ఉంది. ఇక్కడ భక్తులకి విమానం బొమ్మనే ప్రసాదం గా ఇస్తారు. ఇలా చేస్తే.. త్వరగా వీసా లభిస్తుందని నమ్మకం. విమాన ప్రయాణం సమయంలో ఎటువంటి ఆపదలు కలగ కుండా రక్షణ కలుగుతుందని నమ్మకం. విదేశీ ప్రయాణం చేసే వారు ఈ గుడిలో విమానం బొమ్మను సమర్పిస్తారు.
ఇక్కడ షాపుల్లో ఎయిర్ ఇండియా, బ్రిటిష్ ఎయిర్ వేస్, లుఫ్తాన్సా లాంటి విమాన బొమ్మ నమూనాలు తయారు చేసి అమ్ముతారు. ఒక్కొక్కటి రూ.50 నుంచి 500 వరకూ ఉంటాయి. రోజూ ఈ అంగళ్లలో కొన్ని వందల బొమ్మలు అమ్ముడవుతాయి. మనకి ఆ రేంజ్ లో ఉందన్నమాట విదేశీయానం పట్ల మోజు.
మీకుకూడా విదేశాలకి వెళ్లాలనే ఆశవుంటే, వెంటనే, ఒక చక్కని విమానం బొమ్మ కొనేసుకొని , ఎంచక్కా ఈ విమానాల ఆలయమైన గురుద్వారాని దర్శించండి మరి ! ఈ గురుద్వారాకు వెళ్లాలంటే, జలంధర్ నుంచి సుమారు.. 12 కి.మీ దూరంలో ఉన్న చిన్నన్ గ్రామం చేరుకోవాలి.