Online Puja Services

ఈ గడ్డిని ఒక గుప్పెడయినా ఇంట్లో పెంచుకోవడం ఉత్తమం

3.145.47.193

ఈ గడ్డిని ఒక గుప్పెడయినా ఇంట్లో పెంచుకోవడం ఉత్తమం . 
-సేకరణ: లక్ష్మి రమణ  

ఈ  గడ్డిని హిందువులు చాలా పవిత్రముగా భావిస్తారు. అందువలన హిందూ సంప్రదాయంలో దీనికి విశిష్ఠ స్థానం ఉంది. ఇది ఒక క్రిమి నాశనిగా అంతర్జాతీయ శాస్త్రజ్ఞులు గుర్తించారు. పురాణ ప్రాసస్త్యం , చక్కని ఆయుర్వేద ఔచిత్యం , ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్న ఈ గడ్డిని గురించిన అద్భుతమైన విశేషాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం . 

శుద్ధి కి పనికి వచ్చే ఎన్నో పదార్ధాలలో దర్భ గడ్డి ఒక్కటి . వేద విహిత ,ఆగమ కర్మలలో దర్భ లేకుండా పని జరగదు . సూక్ష్మ క్రిములను అదుపులో ఉంచే వాతావరణం లో సహజం గా ఉండే అల్ట్రా వయొలెట్ రేడియేషన్ , గ్రహణ సమయాలలో తగ్గిపోతుంది . ముఖ్యం గా ఇలాంటి సమయాలలో సూక్ష్మ క్రిములను అదుపులో ఉంచే వాటిలో తేలికగా అందరికీ అందుబాటులో ఉండేది దర్భగడ్డి .అందుకే మహర్షులు అన్ని పదార్ధాల పైన దర్భలను వేయమని చెప్పే వారు . సూర్య, చంద్ర గ్రహణ సమయాలలో కొన్ని హానికరమయిన విష కిరణాలు భూమి మీదకు ప్రసారమవుతాయని ఈనాటి విజ్ఞానశాస్త్రం నిరూపిస్తోంది. ఇలాంటి వ్యతిరేక కిరణాలు దర్భల కట్టల మధ్యలోంచి దూరి వెళ్ళలేకపోతున్నాయని ఇటీవల కొన్ని పరిశోధనలలో కూడా తేలింది.

మనకున్న పవిత్రమయిన వృక్ష సంపదలలో గడ్డి జాతికి చెందిన “దర్భ” (Desmostachya bipinnata) ముఖ్యమయినది. దీనిని ఆంగ్లములో Halfa grass, Big cord grass, Salt reed-grass అనీ ప్రాంతానికి తగ్గట్టు పిలుచుకుంటారు. ఈ దర్భలో చాలా జాతులున్నాయి. వీటిలో దర్భ జాతి దర్భను అపరకర్మలకు, కుశ జాతి దర్భను శుకర్మలకు, బర్హిస్సు జాతి దర్భను యజ్ఞయాగాది శ్రౌత క్రతువులకు, శరము (రెల్లు, ఈ పేరు వినగానే నాకు రెల్లుపూల పానుపు గుర్తుకొస్తుంది) జాతి దర్భను గృహ నిర్మాణాలకు వినియోగించాలని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి.

దీని ఆవిర్భావం వెనుక అనేక కథలున్నాయి. కొంతమంది దీనిని విశ్వామిత్రుని సృష్టిగా పరిగణిస్తారు. కూర్మ పురాణం ప్రకారం, విష్ణుమూర్తి కూర్మావతారంలో మందర పర్వతాన్ని (క్షీరసాగర మధనం సందర్భములో) మోస్తున్నప్పుడు, ఆ పర్వత రాపిడికి కూర్మము వంటిమీద ఉండే కేశములు సముద్రములో కలిసి అవి మెల్లిగా ఒడ్డుకు కొట్టుకొనిపోయి కుశముగా మారాయనీ, అమృతం వచ్చినప్పుడు కొన్ని చుక్కలు ఈ కుశ అనే గడ్డి మీద పడటం వలన వాటికి అంత పవిత్రత సంతరించుకుంది అనీ చెప్పబడింది. వరాహ పురాణం ప్రకారం, ఈ దర్భలు వరాహావతారములో ఉన్న శ్రీమహావిష్ణువు శరీర కేశములని చెప్పబడింది. అందువలననే దర్భ గడ్డిని శ్రీ మహావిష్ణువు రూపములని జనులు భావించి భాద్రపద మాసంలో దర్భాష్టమి నాడు వీటికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

సదాశివరావు అనే ఒక వైద్యులు ఈ దర్భ గురించిన ఎన్నో విషయాలను తెలుసుకుని, నమ్మకం కుదరక, కొన్ని దర్భలను తీసుకుని అరచేతిలో ఉంచుకుని మరీ X-Ray తీయించుకోగా, ఆయన నమ్మలేని విధంగా అరవై శాతం రేడియేషన్ ఈ దర్భ గడ్డి చేత శోషించబడిందిట. దీనికి కారణం దర్భల కొనలు తేజమును కలిగి ఉండుట. ఇటువంటి దర్భ గురించి మరెన్నో ఆసక్తికరమయిన విషయాలున్నాయి. వీటికి దేన్నయినా శుద్ధి చేసే శక్తి ఉందని నమ్మిక. ఈ నమ్మకాన్ని నిజం చేస్తూ శాస్త్రవేత్తలు వీటిని విరేచనాలు, రక్తస్రావం, మూత్రపిండాలలో రాళ్ళు, మూత్రవిసర్జనలో లోపాలు మొదలయిన వానికి మందుగా వాడుతున్నారు. అలానే ముంజ పర్వతం మీద ఉండే దర్భ అతిసారాది రోగాలకు ఔషధమని అథర్వణ వేదంలో చెప్పబడింది.

వేద పాఠం మననం చేసుకునేటప్పుడూ, నేర్చుకునేటప్పుడూ, పఠించేటప్పుడూ దర్భ ఉంగరం కుడి చేతి ఉంగరం వేలికి ధరించాలి అని మన శాస్త్రాల్లో చెప్పబడింది. చావు సంబంధిత కర్మలకి ఏక ఆకు దర్భని, శుభప్రదమయిన వాటికి రెండు ఆకుల దర్భని, అశుభకార్యాలకి (పితృ పూజ, తర్పణాలు, మొ) మూడు ఆకుల దర్భని, పూజా తదితర కార్యక్రమాలకు నాలుగు ఆకుల దర్భని ఉంగరముగా వాడవలెననీ ఉంది. అలానే శ్రాద్ధ కర్మలకు బ్రాహ్మణులు దొరకని పక్షంలో దర్భ ఉంగరాన్ని ఆ స్థానంలో ఉంచి కర్మ చేయవలెనని శ్రీ పద్మ పురాణములో చెప్పబడింది.

‘శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసనమాత్మనః
నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాజినకుశోత్తరం’

అని భగవద్గీతలో చెప్పబడింది. అంటే ఒక మంచి, స్థిరమయిన ప్రదేశంలో, మనసుని లగ్నం చేసేందుకు సరయిన ఆసనం ఎత్తుగా కాకుండా, మరీ క్రిందకి కాకుండా, చక్కని కుశ గడ్డిని పరచి, దాని మీద జింక చర్మం వేసి ఆ పైన ఒక చక్కని వస్త్రము ఉండేటటువంటి దర్భాసనమే ధ్యానానికి ఉత్తమం అని శ్రీకృష్ణుడు చెప్తారు.

దర్భల కొనలు విడుదల చేసే తేజము – దేవతలనూ, పితృ దేవతలను సైతం ఆకర్షించి మనం ఏ పనయితే చేస్తున్నామో ఆ పనికి తగ్గట్టు వారిని ఆహ్వానించి మన ముందు ఉంచుతుంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. సమూలస్తు భవేత్ దర్భః పితృణాం శ్రాద్ధ కర్మణిం అన్నట్టుగా దర్భను వేరుతో (మూలము నుండి) సహా భూమి నుండి పెకిలించి దానిని వాడాలి. ఎందుకంటే ఈ వేరులు మాత్రమే పితృ లోకంలోని పితృ దేవతలకు విజయాన్ని చేకూరుస్తాయని అంటారు. అందుకే యజ్ఞ యాగాదులలో అగ్ని గుండానికి నలువైపులా దర్భలను పరుస్తారు.

వీటికి ఉండే సహజసిద్ధమయిన గుణములను ఆరు నెలల తరువాత కోల్పోతాయిట. ఇవి స్వ, పర జనాల కోపాలను పోగొట్టి, సముద్రాన్ని సైతం అణచిపెడుతుంది అని అథర్వణ వేదంలో చెప్పబడింది. దర్భలను ఎక్కువగా వాడుట వలన మనలో సత్వ గుణం పెరుగుతుంది. ఒకవేళ మనం వాటిని నేలకేసి కొట్టినా, గోటితో చీలినా, వాటికి ఎటువంటి హాని కలుగ చేసినా మనలో రజ-తమో గుణాల తీవ్రత పెరిగి మనలో ఉండే సత్వ గుణాన్ని కూడా నాశనం చేస్తుందిట. వీటిని పౌర్ణమి తరువాత వచ్చే పాడ్యమి నాడు మాత్రమే ఈ క్రింది శ్లోకం చదువుతూ కొయ్యాలి:

విరించినా సహోత్పన్న పరమేష్ఠి నిసర్గజ
నుద సర్వాణి పాపాని దర్భ స్వస్తికరో భవ

ఈ విధముగా దర్భలు ఎన్నో కార్యక్రమాలలో, ఎన్నో విషయాలలో మనకు చేరువయ్యాయి. దర్భల కొన కోసుగా ఉండుట వలననే అమృతం నాకడానికి వచ్చిన పాముల నాలుకలు రెండు క్రింద చీలాయి . వీటి విలువ తెలిసింది కనుక ఎప్పుడూ ఒక గుప్పెడన్నా ఇంట్లో ఉండేలా చూసుకోవడం మరువకండి

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore