యోగ్యతలేకపోయినా , తండ్రే గురువు
యోగ్యతలేకపోయినా , తండ్రే గురువు .
-సేకరణ : లక్ష్మి రమణ
మనది సనాతన ధర్మం . ఈ ధర్మం అనుసరణలో సంప్రదాయ రూపేణా నిక్షేపించిన రహస్యాలు అద్భుతమైనవి . అవి పరమాత్మ నిజతత్వాన్ని చాలా సాధారణమైన విధానంలో చెప్పేస్తాయి . ఉదాహరణకి మాతృదేవోభవ , పితృదేవోభవ , ఆచార్యదేవోభవ అని నేర్పిస్తుంది ధర్మం. బిడ్డని ప్రసవించిన (మళ్ళి మాట్లాడితే, గర్భం ధరించిన నాటి నుండీ) నాటి నుండీ ఆ పసిపాపకి గురువు తల్లేకదా ! మాట నుండీ , నడతవరకూ ఆ అమ్మ నేర్పినవే. ఆ తర్వాత బాధ్యత తీసుకునేది నాన్న . యెంత వయసొచ్చినా నాన్న పక్కనుంటే ఉండే ధైర్యమే వేరు . మన ధర్మం తండ్రే గురువని చెబుతుంది .
ఉపదేశమూలకంగా గురు శిష్య సంబంధం ఏర్పడుతుంది . శాస్త్రపరిభాషలో దీనినే 'దీక్ష' అని అంటారు. ఉపదేశమూలకంగా గురువునుంచి ఒక చైతన్యం శిష్యునిలో ప్రవేశించి, తీవ్రసంవేగాన్ని కల్పించి, ఆధ్యాత్మమార్గంలో ఒక అన్వేషణకు పురిగొల్పుతుంది . అదే దీక్ష. ఈ చైతన్యం దీక్ష అయిపోయినంతనే అంతరించిపోదు. ఈ చైతన్యం శిష్యునిలో నిలిచిఉండి అతనిని ఆధ్యాత్మ్యంలో ఉన్నత లక్ష్యాలకు తీసుకువెళ్ళి మంత్రసిద్ధి కలుగజేస్తుందని పెద్దల మాట .
గురువు ఒక్క మారైనాసరే, మంత్రోపదేశం చేసియో, కటాక్షమూలకంగానో, హస్తమస్తక స్పర్శ చేతనో అనుకంపనచేతనో గురుశిష్య సంబంధమైన దీక్ష నిచ్చినట్లైతే, ఆ అనుగ్రహం శిష్యుని మీద ఎల్లకాలమూవుంటుంది. స్విచ్చిని నొక్కి ఉంచినంతసేపూ బల్బు వెలిగేట్లు ఈ అనుగ్రహం పనిచేస్తుంది. ఆచార్యులైతే శిష్యుని సమక్షంలో వుంచుకొని, దీర్ఘకాలం అతనికి విద్యను, అనుష్ఠాన విధానాలను బోధించవలసి వుంటుంది. కానీ గురుని విషయం అట్లకాదు. అతనికి శిష్యునితో స్థూలసంబంధం అక్కరలేదు. అతనికి ఒక్కక్షణంవుంటే చాలు. కొన్ని సమయాలలో అదికూడ అక్కరలేదు. అతని అనుగ్రహం దీక్షామూలకంగా ప్రసరించి శిష్యుని సంసారాన్ని క్షణంలో భస్మంచేస్తుంది. శిష్యునికి సిద్ధిప్రాప్తించేవఱకు గుర్వనుగ్రహం అన్ని కాలాలోనూ అతనితో వుంటుంది.
దీక్షఇచ్చినవాడు గురువు. భారత, రామాయణాది పురాణాల్లో, తండ్రే గురువని చెప్పబడింది. తండ్రి ఘనుడైనాసరే, కాకపోయినాసరే, మహాత్ముడైనాసరే, కాకపోయినా సరే, తనయునికి అతడు దైవసమానుడే. వేదాలు 'పితృదేవోభవ' అని కూడా చెప్పిన విషయాన్ని ఇంతకుముందరే ప్రస్తావించుకున్నాం కదా ! తండ్రిని గురువుగా భావించడానికి మరో కారణం కూడా వున్నది. పుత్రునికి బ్రహ్మోపదేశ సమయంలో (ఒడుగు చేసేప్పుడు) గాయత్రీమంత్ర దీక్ష ఇస్తున్నది తండ్రే కదా ! తండ్రిని గురువుగా భావించటానికి ఈ ఆచారము కూడా కారణం.
అంతేకాదు , అక్షరాభ్యాసకాలంతో తండ్రి కుమారునికి 'ఓం నమోనారాయణాయ' అని అష్టాక్షరినో , 'ఓం నమః శివాయ' అని పంచాక్షరినో ఉపదేశంచేసే ఆచారం మనలో వున్నది. ఇది విద్యా దీక్షగా పరిణమించడం లేదా ? ఈ కారణంగా కూడా తండ్రి కుమారునికి గురువవుతున్నాడు . గురువు వద్ద శరణుజొచ్చిన శిష్యుడు శరణాగతి కారణంగా జ్ఞాన లాభాన్ని పొందుతాడు . ఈ జ్ఞానోపలబ్ధికి, గురువుగారి లాఘవం గానీ, అనుభూతి రాహిత్యం గానీ అడ్డురాదు. శరణాగతి యొక్క మహాత్మ్యము అలాంటిది.
గురువు యోగ్యత ఎలాంటిదైనాసరే, శిష్యునికి గురువుపైన అఖండమైన అనన్య భక్తి వుంటే, అతనిని ఈశ్వరానుగ్రహం వెన్నంటే ఉంటుంది. మనం ఏ విషయాన్నైనా స్వయంగా నేర్చుకొంటే అది అహంకారానికి దారి తీస్తుంది. ఏ విద్యకైనా ఒక గురువు అవసరం. మంత్రములు కూడా స్వయంగా గ్రహించినవి కాక, గురూపదేశములై ఉండాలి . గురువులేకుండా తీసుకొన్నమంత్రమో, చదివిన విద్యో , భార్యకు ఆమె ప్రియుడి చేత కల్గిన సంతానము వంటిది! అతనిని ఆమె కుమారుడని పిలుచుకోవచ్చును. కాని వైదిక కర్మలు చేయడానికి అతనికి అర్హత ఉండదు.
అందుచేత దీక్షకు గురువు అనివార్యము. వాగ్రూపకదీక్ష మంత్రోపదేశము కటాక్షంతో అనుగ్రహించే దీక్ష నయనదీక్ష. శిష్యుని స్పర్శతో అనుగ్రహించేది స్పర్శదీక్ష. ‘భగవత్పాదులు’ అంటే భగవంతుని పాదములను శిరసాగ్రహించి, ఆ పాదములే తాను అయినవాడని అర్ధం. అనగా మనం శంకర భగవత్పాదులవారిని శిరస్సున ధరించాలి. గురువు ప్రత్యక్షోపదేశం ఇవ్వవలసిన అవసరంలేదు. ఎక్కడో దూరాన గురువు కూర్చుని శిష్యుని స్మరించినంత మాత్రాన శిష్యునికి స్మరణ దీక్ష లభ్యమౌతుంది.
కాబట్టి తండ్రిని అగౌరవ పరచడం, పరుషంగా మాట్లాడడం స్వయంగా ఆ గురువుని అవమానించినట్లేనని తెలుసుకోవం అవసరం . మన సంస్కృతిలో , పాస్చాత్యం కలిసి సంకరమయ్యాక , తండ్రిని, గురువుని లెక్కచేయని విధానం మన దౌర్భాగ్యం కొద్దీ మన సమాజానికి అలవడుతోంది . ఇది తప్పు. కాబట్టి మార్పు మననుండీ మొదలవ్వాలి. మన ముందుతరాలకు ఆ గౌరవపూర్వకమైన సంస్కృతిని వారసత్వంగా అందించాలి . శుభం .