అది ముగ్గులేసే పడచుల ప్రభావం
అది ముగ్గులేసే పడచుల ప్రభావం అని తప్పుగా అనుకునేరు ! ముమ్మాటికీ కాదు!
-లక్ష్మీ రమణ
2021లో డిసెంబరు 16 నుండీ జనవరి 14 వరకూ ధనుర్మాసం. ధనుర్మాసం అంటేనే దివ్య ప్రార్థనకు అనువైన మాసమని అర్థం. అందుకే వైష్ణవాలయాలన్ని పండుగ ముస్తాబుతో కొత్తపెళ్లి కూతుళ్ళలా తయారవుతాయి . ఉదయాన్నే తిరుప్పావై గానాలు హరి భక్తిని బోధిస్తాయి . ముంగిళ్లన్నీ పెద్దపెద్ద రంగవల్లులతో , దానిమధ్యలో మురిపమైన గొబ్బిళ్ళతో చక్కగా నయనానందకరంగా ఉంటాయి . ఇలా ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం. ఆ వైభవాన్ని వివరంగా చెప్పుకుందాం రండి .
తెలుగు పల్లెల్లో ధనుర్మాస సంప్రదాయం అప్పుడే విరిసిన విరజాజిలాంటి పరిమళాన్ని నింపుకుని కనిపిస్తుంది . ముసురేసిన మంచు దుప్పటి నడుమ , నడుమువంచి చుక్కల ముగ్గులు తీర్చే పడతులు. ముద్దుగారే గొబ్బిళ్ళని ఆవుపేడతో చేసి , తీరైన పూలని అలంకరించి, ముగ్గుల్లో పెట్టి మురిసిపోయే బాపూబొమ్మలు . సూర్యుడా మంచుదుప్పటిని ముత్యాలుగా మార్చి . బట్టలారేసుకునే దండానికి గుచ్చి చిద్విలాసంగా నవ్వకముందే, హరినామ స్మరణతో హోరెత్తే ఆలయాలలో మైకులు . గబగబా స్నానాలాచరించి , గుడికి చేరుకుంటే, కన్నయ్యకి నివేదించిన వేడివేడి నైవేద్యాలు. ఆ చలి వాతావరణంలో, పచ్చకర్పూరం వేసిన వేడివేడి చెక్కరపొంగళి ఆరగించిన వారి అనుభవం , స్వర్గంకన్నా తక్కువకాదంటే నమ్మండి .
ప్రసాదం ముచ్చట వచ్చింది కాబట్టి చెప్పక తప్పదు . కన్నయ్య మీద భక్తి కన్నా , ఊర్లో పిల్లలకి ఆ ప్రసాదాల మీదే భక్తి ఒక్కరవ్వ ఎక్కువ. మామూలు రోజుల్లో మునగదీసుకొని తొమ్మిది గంటలదాకా పడుకునే చిన్నోళ్ళు , ధనుర్మాసంలో, గుడిలో గంట వినిపించగానే చెంగున గంతే స్తూ లేచి, చకచకా స్నానం చేసి , గుడికి పరిగెత్తడం ఎన్నిసార్లు చూడలేదు ! అది ముగ్గులేసే పడచుల ప్రభావం అని తప్పుగా అనుకునేరు ! ముమ్మాటికీ కాదు. అది కన్నయ్య రుచి చూసిన ప్రసాదం లోని రుచిమహిమ ! జిహ్వకి అంతకన్నా ఇంపయినదీ, రుచికరమైనదీ ఇక జన్మలో మరొకటి దొరకదంటే, అతిశయోక్తికాదు. నాడు రేపల్లెలో ఇంటింటా కుండలు పగులగొట్టి మరీ తిన్న వెన్న , యుగాలు మారినా , ఇంకా ఆ చిట్టి చేతులకి అంటుకొని ఉందేమో మరి ! లేక ఆ మ్రోవి తాకి, పునీతమైన మురళిలా , పదార్థానికి కూడా తెలియని మార్మికమైన మహత్తు అలవడుతుందో మరి ! ఆ ప్రసాదం రవ్వంత చిక్కినా అంతమైన తృప్తి అంతరంగాన్ని ఆవహిస్తుంది మరి .
ఆ పరమాత్మని పొందేందుకు, చేరుకునేందుకు మాత్రం ఈ మాసం రోజులు పరమ పుణ్య దినాలనే చెప్పాలి. కార్తీకమాసంలో నెలరోజులూ ఏవిధంగా అయితే, శివ, కేశవులని దీక్షగా అర్చిస్తారో, అలాగే విష్ణుమూర్తికి పరమ ప్రీతికరమైన ఈ ధనుర్మాసం నెలరోజులూ విష్ణుమూర్తిని అలా ఆరాధిస్తారు . గోదాదేవి ఈ నెలరోజులూ ఆ రంగనాథుణ్ణి ఆరాధించే కదా , ఆయన్ని భర్తగా పొందింది . కాబట్టి ఈ నెలరోజులూ కూడా సూర్యోదయానికి ముందుగానే లేచి , చక్కగా ఆ విష్ణుమూర్తిని ఆరాధించి , ఆధ్యాత్మిక ఫలాలని వరంగా పొందుదాం .