ఆ రోజు ఉపవాసం చేశారంటే ఆ ఊర్లో, అరిష్టం ఖాయం

ఆ రోజు ఉపవాసం చేశారంటే ఆ ఊర్లో, అరిష్టం ఖాయం .
-సేకరణ: లక్ష్మి రమణ
దీపావళి పండగకు ముందు వచ్చే చవితి రోజున నార్త్‌కి చెందిన మహిళలు కర్వా చౌత్ పండుగని ఎన్నో ఏళ్ల నుంచి ఘనంగా జరుపుకుంటున్నారు.
తెలుగు రాష్టాల్లో మహిళలు కంటే నార్త్ మహిళలే ఎక్కువగా ఈ వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. కర్వా చౌత్ రోజున మహిళలు తమ భర్త కోసం సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు ఉపవాసం ఉంటారు. సాయంత్రం సమయంలో ఉమాదేవికి పూజలు చేస్తారు.
అనంతరం జల్లెడలో చంద్రుడుని చూసి, అదే జల్లెడలో భర్త ముఖాన్ని చూసి ఉపవాసం విడుస్తారు. అలా చేస్తే తాము కోరిన కోరికలు నెరవేరుతాయని, తమ మాంగల్యం పదికాలాలపాటు చల్లగా ఉంటుందని అక్కడి మహిళలు విశ్వసిస్తారు. కానీ, ఉత్తరప్రదేశ్ లోని ఓ గ్రామంలో మాత్రం కర్వా చౌత్ రోజున మహిళలు తమ భర్తల కోసం ఉపవాసం ఉండరు. ఎవరైనా మహిళ అలా ఉపవాసం ఉంటే.. వారి భర్త వెంటనే చనిపోతాడని నమ్ముతారు.
యూపీలోని మాథురాలో విజాయి గ్రామంలోని మహిళలు 200 ఏళ్ల నుంచి కర్వా చౌత్ పండగను జరుపుకోవడం లేదని అక్కడి స్థానికులు చెబుతున్నారు . ఎందుకంటే.. ఆ గ్రామానికి శాపం ఉందట. అందుకే మహిళలు ఉపవాసం చేయడం గానీ, పూజలు నిర్వహించరు. భర్త ఆయురోగ్యాలతో నిండు నూరేళ్లు బతకాలని కోరుకునే పండగ కావడంతో కార్వా చౌత్ నోమును ఏ మహిళ కూడా చేసుకోరట.
అసలు ఈ గ్రామానికి ఆ శాపం ఎలా వచ్చిందంటే.. పూర్వ కాలంలో ఇదే గ్రామానికి చెందిన ఓ బ్రాహ్మణ స్త్రీ , ఈ గ్రామ మహిళలకు శాపం పెట్టిందట. కార్వా చౌత్ రోజున కొత్తగా పెళ్లైన బ్రాహ్మణ మహిళ తన భర్తతో కలిసి విజాయి గ్రామం మీదుగా వెళ్తోంది. ఆ సమయంలో గ్రామస్థలు భార్యభర్తలపై దాడి చేశారు. ఈ దాడిలో ఆమె భర్త మరణించారు . తమ ఊళ్లోని పశువులను ఎత్తుకెళ్తేందుకు వచ్చారనే అనుమానంతో గ్రామస్థులు ఆ బ్రాహ్మణ మహిళ భర్తను తీవ్రంగా కొట్టి చంపేశారు. తన కళ్ల ముందే భర్తను చంపడంతో ఆగ్రహించిన ఆమె ఆ ఊరి మహిళలకు శాపం పెట్టింది. అనంతరం తన భర్త చితిలోనే తాను దూకి సహగమనం చేసింది .
అప్పటి నుంచి, తమ భర్తలు చనిపోతారని ఆ గ్రామంలో కార్వా చౌత్ పండగను జరుపుకోవడం లేదు. అంతేకాదు.. ఆ రోజున ఇక్కడి మహిళలు కనీసం సింధూరం కూడా కొనరు. పుట్టింటి నుంచి తెచ్చిన సింధూరం మాత్రమే వాడుతారు.