Online Puja Services

అభినవ భరతుడు-నటరాజ రామకృష్ణ

18.118.149.55

అభినవ భరతుడు-నటరాజ రామకృష్ణ
   - కంచర్ల లక్ష్మి రమణ

అభినయ వేదం నాట్యం. నటరాజు అందెలలో .. అభినయం అడుగులేస్తుంది. కనుపాపల్లో కథ కదలాడుతుంది. భంగిమల్లో భావాలు పలుకుతాయి . అంతరంగం లోని అనుభూతి ... అభినయం తో వ్యక్తమవుతుంది. నాట్యకళలో ఎన్నో రీతులుగా  సంప్రదాయాలు ఉన్నాయి. మరుగవుతున్న నాట్యరీతులకు సిరి సిరి మువ్వల శృతులు , సరి కొత్త జతులు నేర్పిన అభినవ భరతుడు నటరాజ రామకృష్ణ. 

ఆ మువ్వలు మాట్లాడతాయి. ఆ పాదాలు సున్నితం గా పుడమిని తాకుతాయి . ఆ నయనాలు నవరసాలొలుకుతాయి. ఆయన ప్రదర్శన లో భావాలు వెల్లువెత్తుతాయి. రంగాస్థలాన్నే జీవన తరంగ స్థలం గా మలచుకొన్న నటరాజు  పద్మశ్రీ, డాక్టర్ నటరాజ రామకృష్ణ.  కూచిపూడి నాట్యానికి గుర్తింపు రావాలని నటరాజ రామకృష్ణ భగీరథ ప్రయత్నం చేశారు . కళకి కొత్త కాంతినిచ్చారు. అంతరించి పోతున్న సంప్రదాయాలకు పునర్జన్మ నిచ్చారు.

కళాకేళి:

ఒకప్పుడు నాట్యం సామాజికంగా చాలా తక్కువ స్థాయి లో వున్న కళ. దేవుడికి చేసే నాట్య నివేదన గా, వినోద సాధనం గా మాత్రమే పరిమితమయ్యింది. ప్రత్యేకించి కూచిపూడి నాట్య మంటే మరింత చిన్న చూపు. కూచిపూడి సంప్రదాయ నాట్యం/ శాస్త్రీయం కాదని . అది కేవలం జానపద కళ  మాత్రమేనని, కొందరు కళారంగ ప్రముఖులు చులకన చేశారు. నటరాజ రామకృష్ణ ఈ వ్యాఖ్యలని ఒక సవాలుగా తీసుకొన్నారు . ఆంద్ర ప్రాంతంలో ఒక ఉద్యమమే చేపట్టారు . సదస్సులు, ప్రదర్శనలు నిర్వహించారు. కూచిపూడి శాస్త్రీయతని వెలికితెచ్చారు.  కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామం కూచిపూడి నాట్యకళ కి పుట్టినిల్లు. కూచిపూడికి సమీపం లోనే వున్న మొవ్వ గ్రామంలో నటరాజ రామకృష్ణ ఏంతో కాలం కళాసాధన చేశారు. కూచిపూడి నాట్యం కోసమే తాను  పుట్టానని భావించారు . ఆస్వాదించే ప్రతి రసజ్ఞుడికీ నాట్య నీరాజనం సమర్పించాలని తపించారు. క్షేత్రయ్య పదాలతో  పాదం కదిపి పదును పెట్టారు. కూచిపూడి కళా వైభవాన్ని ప్రపంచానికి చాటారు.     

నాట్య గురువు నటరాజ రామకృష్ణ ప్రస్తావన లేని తెలుగు నాట్య చరిత్ర అసంపూర్ణం. .  చరిత్ర శిధిలాల మధ్య శాశ్వత సమాధికి దగ్గరగా వున్న ఆంద్ర నాట్యాన్నిఆయన పునరుద్ధరించారు. విలాసినీ నాట్యం గా ఖ్యాతి పొంది,వేల ఏళ్ళ చరిత్ర గలిగిన నాట్యకళ ఆంద్ర నాట్యం.  మధుర భక్తిని చిలికే ఆంధ్రనాట్య అభినయం లో  శృంగారం కూడా  భక్తే . అంతరించిన రాజరికం, దేవదాసీ  సంప్రదాయం తో ఈ రీతి కుడా మరుగున పడింది. దేవదాసీల పై వున్న చిన్న చూపు వారి నాట్య కళ పైనా వుంది . అదేదో కానిపనన్నభావన అప్పట్లో రాజ్యమేలింది. బురదలో వికసించినా పద్మాల పవిత్రత తగ్గదు కదా ! నటరాజ రామకృష్ణ ఈ కళని పునర్జీవింప జేసే ప్రణాళికకు శ్రీకారం చుట్టారు.  దేవదాసీ నాట్య రీతులను రికార్డు చేశారు. ఊరూరూ తిరిగి వృర్ధులయిన  దేవదాసీలను కలుసుకొన్నారు. నెలల తరబడి చేసిన ఆయన కృషికి ప్రతిరూపమే "కళాకేళి". ఇలా ఎంతో శ్రమకోర్చి ఆంద్రనాట్యంలోని మర్మాలను ముందు తరాలకోసం భద్రపరిచారు .

పేరిణి శివ తాండవం:

 నటరాజ రామకృష్ణ ఒక నృత్య తపస్వి. ఆయన ప్రేరణ తో  వేదిక  చూసిన మరో అద్భుతం పేరిణి శివ తాండవం. ప్రపంచం లోనే అరుదైన నృత్యరూపకం.పురుషులకు మాత్రమే ... పరిమితమైన నృత్యం. దాదాపు 7 శతాబ్దాలకు పూర్వమే ఈ వీరనాట్యం ఉండేది. కాకతీయ యోధులు యుద్ధానికి వెళ్ళే ముందు ఈ కళను ప్రదర్శించే వారు. యుద్ధాని కి సన్నద్ధమవుతూ .. శివుణ్ణి ఆవాహన చేసే నృత్యం కనుక దీన్ని ప్రేరణ శివతాండవం అన్నారు. కాల క్రమంలో అది పేరిణి శివతాండవం అయ్యింది .

కాకతీయుల కుల దైవం రుద్రుడు.  యుద్దానికి ముందు శివుణ్ణి స్మరించి , తమను ఆవహించాలని పేరిణి శివతాండవం చేసేవారు యోధులు . తద్వారా శివమెత్తి శత్రు వినాశనం చేయగలరని వారి విశ్వాసం . కాకతీయులు నిర్మించిన దేవాలయాలపై కూడా ఈ నాట్య కళకి సంబంధించిన భంగిమలు కనిపిస్తాయి. అయితే ఆ తర్వాత పేరిణి కళ అంతరించి పోయింది . కేవలం రామప్ప దేవాలయ స్తంభాలపై మాత్రమే దాని ఆనవాళ్ళు మిగిలాయి. అలాంటి సమయంలో ప్రేరిణి శివతాండవానికి ప్రేరణ నిచ్చారు నటరాజ రామకృష్ణ. సోదరుడు శ్యాంసుందర్ శిల్పి కావడం ఇందుకు సహకరించింది.

రామప్ప శిల్పకళనే ఆధారం గా చేసుకొని, ధ్యాన సాధన తో పేరిణి భంగిమలను మదిలో రూపొందించుకొని, పదిలంగా ఆ కళా రూపాన్ని అందించ గలిగారు నటరాజ రామకృష్ణ. శిల్పాల కధలకు ఆయన కల్పన ప్రాణం పోసింది. సజీవమైన కధలు మువ్వలు కట్టి కళా పిపాసుల పాదాలకు ప్రేరణ నిచ్చాయి. అపూర్వ నృత్యాన్ని విశ్వవ్యాప్తం చేశాయి. పేరిణి శివ తాండవం లో ఒక శక్తి వుంది. ఒక ఉద్దీపన వుంది. చైతన్య దీప్తి వుంది. మొండి జబ్బులను సైతం నయం చేయగల మహత్తు వుంది.  వరంగల్ లో జరిగిన పేరిణి ఉత్సవాల్లో ఒక అద్భుతం చోటుచేసుకోంది. ఔత్సాహిక కళాకారుల నాట్య లాస్యానికి నటరాజ రామకృష్ణ ఉత్తేజితులయ్యారు. చక్రాల కుర్చీకే పరిమితమైన ఆ నటరాజు ఒక్కసారిగా లేచి నర్తించారు.          

విదేశీ అయినా , ఆయన తెలుగు నేపధ్యమే ఆంధ్రులకి వరం :

ఆంద్ర నాట్యం, పేరిణీ నాట్యం, నవ జనార్దన పారిజాతం  "మన ఆంధ్రుల ప్రాచీన లలిత కళా సంపద" అని గర్వంగా చెప్పగలుగుతున్నామంటే.. అది నటరాజ రామకృష్ణ  చలువే! నాట్య కళకే జీవితాన్ని అంకితం చేసిన ఈయన 1933 లో ఇండోనేషియా రాజధాని బాలీ లో ఉన్నతమైన కుటుంబం లో జన్మించారు . పుట్టింది విదేశమే అయినా ... తెలుగు కుటుంబ నేపధ్యం అతన్ని వెంటాడింది. తెలుగు నేలపై అనంత కీర్తికి నాంది పలికింది .

నటరాజ రామకృష్ణ  తల్లి దండ్రులకు రామకృష్ణ పరమహంస అంటే అమితమైన భక్తి. అందుకే అతనికి రామకృష్ణ అని నామకరణం చేశారు. నటరాజ అనేది బండారు సంస్థానం రాజావారిచ్చిన బిరుదు. నటరాజ రామకృష్ణ చిన్నతనం లోనే నాట్యం పట్ల ఆకర్షితులయ్యారు. కళా తృష్ణ తో ఎందరో గురువులను కలుసుకొన్నారు. మీనాక్షి సుందరం పిళ్ళై , వేదాంతం లక్ష్మీ నారాయణ శాస్త్రి , శ్రీమతి నాయుడుపేట రాజమ్మ, పెండెల సత్యభామ వంటి ఉద్దండుల వద్ద అభ్యాసం చేశారు. ఎన్నో నాట్య రీతులను ఆకళింపు చేసుకొన్నారు. భరత వేదాన్ని అభ్యసించి, నిరత నాట్యం గా జీవితాన్ని గడిపారు.  40 కి పైగా పుస్తకాలు రాశారు. వీటిలో ఆరింటికి భారత ప్రభుత్వ పురస్కారం లభించింది.

నాట్యాచార్యుడు నటరాజ రామకృష్ణ: 

రామకృష్ణ పరమహంస భక్తి తత్త్వంతో భగవంతుణ్ణి చూశారు. నటరాజ రామకృష్ణ నాట్యతత్త్వం తో భగవంతుణ్ణి దర్శింపజేశారు. నాట్యాచార్యుడిగా ఎందరో ఆణిముత్యాలను తయారు చేశారు. నాట్యపురోగతికి విశేష కృషి చేశారు. చేయూత నిచ్చారు. వృద్ధ కళాకారులు, వర్ధమాన కళాకారుల సహాయార్థం "నటరాజ రామకృష్ణ ఆంధ్ర నాట్యం" సంస్థని నెలకొల్పారు. శిధిలావస్థకు చేరిన తారామతి బారాదరి మొదలైన నాట్య మందిరాలను బాగు చేయించారు. జానపద కళాకారులైన చిందుకళాకారులను వెలుగులోకి తెచ్చారు. వారితో రవీంద్రభారతి వంటి చోట్ల ప్రదర్శనలు ఇప్పించారు. మిగతా నృత్యాలకు సమాన స్థాయిలో చిందు కళని  నిలబెట్టారు .నటరాజ రామకృష్ణ కళా సేవను గుర్తించి 1992 లో ఆంధ్రాయూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది.

గుప్తాభినయ ప్రతిభ:

ఆయన మువ్వలు ఉరుముల సవ్వడులు. మెలికలు మెరుపుల మెలకువలు. స్టిల్ కెమెరాకు కూడా చిక్కని వేగం అతని నాట్యం. నాట్యాభినయం లోనే అరుదైన గుప్తాభినయ ప్రతిభ కూడా నటరాజ రామకృష్ణ కు ఉండేదని ఆయన ఆత్మీయులు చెబుతారు .

 నటరాజ రామకృష్ణ ఎక్కడ ప్రదర్శన ఇచ్చినా .. ప్రజాదరణ ఘనంగా ఉండేది. లక్షల్లో ప్రజలు హాజరయ్యేవారు. కళలో మమేకమై అతని మువ్వలు రవళిస్తుంటే.. సాక్షాత్తు నటరాజే వేదికపైకి దిగివచ్చి నట్లుండేది. ఆ నృత్యం ఒక తపస్సులా సాగేది.  ఆ తపస్సే తనకి ఒక  అతీంద్రియ శక్తి ని అనుగ్రహించిందని స్వయం గా పలు సందర్భాలలో పేర్కొన్నారు. శరీరం నుండి బయటకి వచ్చి తన నాట్యాన్ని తానే  తిలకించ గల అనితర సాధ్యమైన శక్తి నాట్య సరస్వతీ ప్రసాదమని చెప్పారాయన.

పురస్కారాలు:

నటరాజ రామకృష్ణ  ప్రతిభకు ఎన్నో పురస్కారాలు దాసోహమన్నాయి.  పద్మశ్రీ , భారత కళాప్రపూర్ణ , భారత కళా సవ్యసాచి, కళా సరస్వతి వంటి బిరుదులు నటరాజు మెడలో అలంకారాలయ్యాయి.  స్వర్ణ కిరీటం నాట్యరాజుకి రాజ్యాభిషేకం చేసింది. 

నిర్యాణం :

నాట్యకళ ని శుద్ధం గా నమ్ముకోవడమే తప్ప అమ్ముకోవడం తెలియని  రామకృష్ణులు వృద్ధాప్యం లో చాలా ఇబ్బందులు పడ్డారు. శిష్యులే బంధువులయ్యారు. వయసు తో పాటు అనారోగ్యపు ఆటుపోట్లను ఎదుర్కొంటూ ... శిశ్యుడు శత్రుఘ్న సేవలతో సేదతీరారు. 2011 జూన్ 7న హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ .. అనంతలోకాలకు చేరుకొన్నారు .

నటరాజ పాద సుమరజమై  భువికి వచ్చిన సౌరభం  నటరాజులో లీనమయ్యింది . ఆ మువ్వల దాహం తీరనిది . మరేవ్వరూ ఆయన లేని లోటు పుడ్చలేనిది. “కృష్ణా! నీవు మరల నన్ను  ఈ ప్రపంచానికి పంపాలనుకుంటే-  జ్ఞాపకం  ఉంచుకో స్వామీ!, నేను నర్తకునిగా మాత్రమే పుడతాను” అని రాసుకొన్నారు నటరాజ రామకృష్ణ. ఆ కళా స్రష్ట కోసం కళాలోకం ఎదురు చూస్తూనే ఉంటుంది .

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore