కూచిపూడి కళా గమనమే ఆయన జీవన వేదం
కూచిపూడి కళా గమనమే ఆయన జీవన వేదం (శ్రీ వెంపటి చిన సత్యం )
-లక్ష్మీ రమణ
ఆ కనులలో కోటి భావాలు కదలాడ తాయి. ఆ గళం లో వేల నాదాలు పలుకుతాయి. కర భంగిమలలో భావాలు పలకరిస్తాయి. పాదాలకు జతులు తాళం వేస్తాయి. అతని ప్రదర్శనలు ప్రబంధాలను ఆవిష్కరిస్తాయి. కూచిపూడి కళా గమనమే ... తన జీవిత గమ్యం గా పయనం సాగించిన కళా మూర్తి శ్రీ వెంపటి చిన సత్యం.
కదిలే కూచిపూడి నాట్య శాస్త్రం శ్రీ వెంపటి చిన సత్యం. అభినవ సిద్ధేంద్ర యోగి గా పేరు తెచ్చుకొన్నారు. ఆయన పేరు చెబితే ... నాట్య లోకం పరవశిస్తుంది. సినీ ప్రపంచం గౌరవ వందనం చేస్తుంది. విశ్వవేదికలు వినమ్ర ప్రణామం చేస్తాయి. ఆయన అంతటి శిష్య పరంపరను, కీర్తి ప్రతిష్ఠ లను సంపాదించుకొన్నారు. వెంపటి చిన సత్యం కూచిపూడి వేదిక పై ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఆయన ఆరంగేట్రం కి ముందు వరకూ ... కూచిపూడి ఒక పురాతన కళ. మరుగవుతున్న సంప్రదాయ వైభవం. వెంపటి పరిచయం కూచిపూడికి పునర్జీవనమయ్యింది. నివురు గప్పిన నిప్పును ప్రపంచానికి పరిచయం చేసింది .
వెంపటి చిన సత్యం కూచిపూడి ఉషస్సు. ఆ మంజీరనాదం కళా ప్రేమికులకు హవిస్సు. ఆ నర్తనం నాట్యానికే మహస్సు. ఆంగిక అభినయ లయ కారకుడాయన. అద్భుతమైన ఎన్నో నృత్య రూపకాలు ఆయన కల్పనలో పురుడు పోసుకోన్నాయి.
కూచిపూడి నాట్య సంప్రదాయ పరిరక్షణకి, పునరుద్ధరణ కి, ప్రాచుర్యానికి ఎంతో కృషి చేశారు వెంపటి చిన సత్యం. ఈ నృత్య తపస్వి సృజియించిన రూపకాలు ఎంతో ప్రఖ్యాతిని పొందాయి. పురాణ - ఇతిహాసాలు, ప్రబంధాలలోని ఇతివృత్తాలే ఆధారంగా సుమారు 180 సోలో ప్రదర్శనలు, 15 రూపకాలకు ప్రాణం పోశారు. పద్మావతీ శ్రీనివాస కళ్యాణం, విప్రనారాయణ చరితం, కళ్యాణ శాకుంతలం, భామాకలాపం,రుక్మిణీ కళ్యాణం, హరవిలాసం, శివ ధనుర్భంగం, అర్థనారీశ్వరం మొదలైన కూచిపూడి రూపకాలు ఆయన కల్పనలో విఖ్యాతిని పొందాయి . ఇవే కాక విశ్వకవి రవీంద్ర ఠాగూర్ రచన ఆధారంగా శ్రీ వెంపటి చిన సత్యం రూపొందించిన ఛండాలిక కూచిపూడి ముద్రల్లో అలవోకగా ఒదిగి, మనోహరముర్తి గా నిలచింది.
కూచిపూడి నెమలికి కొత్త నడకలు నేర్పారు శ్రీ వెంపటి చిన సత్యం. ఈ పోకడ లపై అప్పట్లో ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత అవే పాదాలు వెంపటి వారిని అనుసరించాయి.ఆయన ప్రయోగాలన్నీ .. కూచిపూడి ఖ్యాతి ని ఇనుమడింప జేసినవే .
వెంపటి చిన సత్యం గారు కూచిపూడి సంప్రదాయం లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. నాట్యకళలో అలంకరణ కూడా ఒక భాగమే! కూచిపూడి ఆంగికానికి ఆహార్య శోభలతో కొత్త మెరుగులు దిద్దారు . తన దైన ప్రత్యేకశైలిలో మేకప్ రంగులద్దారు . దేవ దానవ మూర్తులకు, స్వయంవర శోభనలకు, వీర శైవులకు చోటున్న దృశ్యాలను ఉద్వేగపూరితం చేశారు. కూచిపూడి సంప్రదాయ ఆది విధానం, ప్రదర్శనా రీతి పక్కదారి పట్టకుండానృత్య రూపకాలకు మెరుగులు దిద్దారు . ప్రదర్శనా దృశ్యాన్ని సుసంపన్నం చేసేందుకు ...మేకప్ తో పాటు సంగీతం, లైటింగ్ ల పైనా తనదైన ముద్ర వేశారు. మొత్తంగా కూచిపూడిని కొత్త పుంతలు తొక్కించి సరి కొత్త అద్భుత ప్రదర్శనకి తెరతీశారు. భారత నాట్యం, ఒడిస్సి,మణిపురి నృత్యాలకంటే ... కూచిపూడి ఏమాత్రం తీసిపోదని విశ్వకళా వేదికలపై నిరూపించారు. కావలి విశ్వోదయా కళాశాల వారి కోసం ఆయన సమకూర్చిన శ్రీ కృష్ణ పారిజాతం నృత్య రూపకం తో ఈ బృహద్ కార్యానికి నాంది పలికారు.
కూచిపూడి పూర్వ వైభవాన్ని కోల్పోతున్న సంధికాలం లో ఆవిర్భవించిన నాట్యాచార్యులు చిన సత్యం గారు. మూలనిర్మాణం చెడకుండా కూచిపూడికి ఆధునిక హంగులద్దారు. అందుకే ఆయన ప్రదర్శనలకు జనం పోటెత్తేవారు. స్ఫూరద్రూపం, పచ్చని రంగు, కోటేరు లాంటి ముక్కు , విశాల వదనం, తెల్లటి వస్త్రాలు, చిరునవ్వు ఆయన ఆభరణాలు. క్షీర సాగర మధనం నృత్య రూపక ప్రదర్శన లో నట్టువాంగం నిర్వహిస్తూ ... శివుని పాత్ర అభినయిస్తూ .. రంగస్థలాన్ని విశ్వతరంగ స్థలంగా మార్చేసేవారు . పద విన్యాసాలను నాట్య శాస్త్ర సంప్రదాయానికి అనుగుణం గా ఆయన పరమ లలితం గా తీర్చి దిద్దారంటారు నిపుణులు.
చిన సత్యంగారు కూచిపూడి విశారదులే కాదు, చిత్రకారులు , గాయకులూ కూడా ! అప్పుడప్పుడూ ... నట్టువాంగం తో పాటు గానమాధుర్యాన్ని పంచేవారు. స్వతహాగా ఏంతో శాంతంగా వుండేవారు. ప్రదర్శన విషయంలో మాత్రం చాలా కఠినం గా వ్యవహరించేవారు . ఏ చిన్న పొరపాటును క్షమించేవారు కాదు .
ఒకసారి హైదరాబాదు లో శ్రీనివాస కళ్యాణం ప్రదర్శన ఇస్తున్నారు చిన్న సత్యం గారు . ఆ ప్రదర్శనకి పాడవలసిన గోపాలం గారు రాలేకపోయారు . దాంతో ఆ భాద్యతను తానే తీసుకొన్నారు. ఏవెలితీ తెలియనీయకుండా శ్రీనివాస కల్యాణం జరిపపించేశారు. మరోసారి ... ఆయన బృందం లో పాడే లోకనాథ శర్మ సరిగ్గా పాడట్లేదని శాశ్వతంగా వదులుకొన్నారు. సాధారణం గా చిన్న సత్యం గారి నృత్య రూపకాలకు భుజంగరాయ శర్మ గారు రచన చేసేవారు. దానికి అనుగుణం గా సంగీత రావు గారు సంగీతాన్ని సమకూర్చేవారు.
చినసత్యం గారికి కూచిపూడి నాట్యం పై ఒక ప్రామాణిక గ్రంధం ప్రకటించాలని బలంగా ఉండేది. కూచిపూడి నృత్య భంగిమలు, ముద్రలు అద్భుతమైన చిత్రాలుగా రాశారు. వాటిని కూచిపూడి కళను అభ్యసించే వారికి అనువుగా ఒక క్రమం లో పెట్టారు వాటి ఆధారం గా ఆంగ్లం లో ఒక గ్రంధాన్ని రాయాలని తపించారు. "ఆంగ్ల భాషలో ప్రావీణ్యం అంతగాలేదు. నేను తెలుగులో చెబుతాను. దాన్ని ఆంగ్లం లో రాయించాలి" అని తన ప్రియ శిష్యులతో చెప్పేవారు. అది తీరని కోరికగానే మిగిలిపోయింది. అండవల్లి సత్యనారాయణ గారు, పెమ్మ రాజు సూర్యా రావు గారు కలసి చిన సత్యంగారి గురించి ఇంగ్లీష్ లో ఒక పుస్తకాన్ని ప్రచురించారు . అదే మాస్టర్ విత్ ఎ మిషన్. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆయన అభిమతానికి అనుగుణంగా ఆ గ్రంథం వచ్చింది.
క్షీర సాగర మధనం చేస్తే ...ముందు విషమే పుట్టింది. ఆ తర్వాతే .. అమృతం పుట్టింది. కూచిపూడి మధనం చేసిన చినసత్యం గారికి జీవనయానంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురయ్యాయి. సినీ కళామతల్లి ఆశ్రయం తో గట్టెక్కారు. సుమారు 100 చలన చిత్రాలకు ఆయన నృత్య దర్శకత్వం వహించారు .
1929 అక్టోబర్ 25 న కృష్ణాజిల్లాలో తరతరాలుగా భాగవతులకు నెలవైన కూచిపూడి గ్రామం లో జన్మించారు శ్రీ వెంపటి చినసత్యం . శ్రీయుతులు చలమయ్య , వరలక్ష్మి దంపతులు ఆయన తల్లిదండ్రులు. ఏ గూటి చిలుక ఆపలుకే పలుకుతుంది కదా ! కూచిపూడి లో పుట్టిన చినసత్యం గారికి చిన్నప్పటి నుండే కూచిపూడి నృత్యంపై అభిరుచి మెండుగా ఉండేది. వేదాంతం లక్ష్మీ నారాయణ శాస్త్రి గారి వద్ద నాట్య కళని అభ్యసించారు. నటరాజ రామకృష్ణ గారు కూడా ఈయన శిష్యులే కావడం గమనార్హం. మువ్వ తొడిగిన చిన సత్యం, గురు శుశ్రూష లో సాటిలేని ప్రతిభను సొంతం కూచిపూడి స్వాతిముత్యమై ప్రభవించారు . కూచిపూడి కళా విశ్వరూపాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలనుకొన్నారు . కానీ ఆర్ధిక ఇబ్బందులు చిన సత్యం గారి లక్ష్యానికి అవరోధాలై నిలిచాయి . వాటిని అధిగ మించేందుకు చిత్ర పరిశ్రమ బాట పట్టాలనుకొన్నారు. చేతిలో చిల్లి గవ్వ లేదు. కాలినడకనే మద్రాసు చేరుకొన్నారు. అప్పటికే నృత్య దర్శకులుగా రాణిస్తున్నారు చిన సత్యం గారి అన్న పెద సత్యం గారు, వేదాంతం రాఘవయ్య గారు. వీరి ప్రోత్సాహం తో దేవదాసు , నర్తన శాల మొదలైన సుమారు నూరు చిత్రాలకు చిన సత్యం గారు నృత్య దర్శకత్వం వహించారు .
సినిమాల్లో నటించాలంటే ... నాట్యం తప్పనిసరిగా నేర్చుకోవలసిన రోజులవి. పౌరాణిక పాత్రలు, వెండి తెరపై సజీవ రూపాలై విరాజిల్లుతున్న సమయమది. అప్పుడు చిత్రసీమలో నటరాజై ఆవిర్భవించారు శ్రీ వెంపటి చినసత్యం. తన నాట్య విన్యాసాలతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసేవారు. చినసత్యం గజ్జె ఘల్లు మందంటే ... ఇక ఆ సినిమా హిట్ కొట్టినట్టే నని భావించేవారు . ఎన్టీఆర్ వంటి నట దిగ్గజం నర్తనశాల లో బృహన్నల పాత్ర కోసం ఈయన దగ్గర ప్రత్యేక శిక్షణ తీసుకొన్నారు.
కూచిపూడి నాట్య మర్మ మెరిగిన వెంపటి చినసత్యం చిత్రసీమ దృష్టిని నాట్యాభ్యాసం వైవు మరల్చగలిగారు. ఎన్టీఆర్ మాత్రమే కాదు, మరెందరో నటీ నటులు చినసత్యం గారి వద్ద కూచిపూడి శిక్షణ తీసుకొన్నారు. వైజయంతీమాల, మంజు భార్గవి, చంద్రకళ, ప్రభా రమేష్ వంటి ఎందరెందరో నట తిలకాలు ఆయన శిక్షణలో వాసికెక్కారు. మేటి నర్తకీ మణిగా పేరు పొందిన శ్రీమతి శోభా నాయుడు చిన సత్యం గారి శిష్యురాలే! అలా అనేక మందికి గురువుగా రాణించారు. ఆర్ధికంగా, సామాజికంగా తనకంటూ ఒక ప్రత్యెక స్థానాన్ని కష్టపడి సాధించారు. ఆయన నాట్య లాస్యం విదేశీయులని కూడా ఆకర్షించింది. ఆయన పుణ్యమా అని , విదేశాలలో అత్యంత ఆదరణకు నోచుకొంది మన కూచిపూడి కళ . ఈ పరిణామం అనేకమంది కళాకారులకు సువర్ణ గవాక్షాలను తెరిచింది.
అసంఖ్యాక మైన శిష్య ప్రశిష్య గణాలను సంపాదించుకొన్నారు వెంపటి చినసత్యం. నిరంతర కళా తపస్వి గా జీవనం సాగించారు. అఖండమైన ప్రజ్ఞ ఒక ఇరుకైన స్థలంలో , పరిమితులకు లోబడి ఎక్కువకాలం ఉండలేదు . బహుశా చలనచిత్రరంగం ఆ విశ్వకళాకారుని దాహాన్ని కళా దాహాన్ని తీర్చలేక పోయిందేమో .. . వెండితెర ప్రదర్శనలకు శలవిచ్చి, కూచిపూడి వేదికలకు పరిమితమయ్యారు. విదేశీ గడ్డ పైనా ప్రదర్శనలిచ్చారు. ఈ కళామతల్లి ముద్దు బిడ్డడిని దేశ విదేశాలలో ఎన్నో సత్కారాలు, సన్మానాలు, పురస్కారాలు, డాక్టరేట్ లు వరించాయి.
ప్రపంచ చరిత్రలో సంచలనాలు సృష్టించే ప్రదర్శనలు నిర్వహించడం వెంపటి చినసత్యం గారికే చెల్లింది.బృంద నాట్యానికి పేరుగాంచిన ఆయన ఆద్వర్యం లో ఒక మహా ప్రదర్శన జరిగింది. 2010లో హైదరాబాద్ లోని గచ్చి బౌలీ స్టేడియం లో 2800 మంది కళాకారులతో ప్రదర్శన నిర్వహించారు. గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో తెలుగోడి పేజిని సృష్టించారు. అప్పటి రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ ఆయనకు ఘన సన్మానం జరిపారు. చినసత్యం ప్రతిభను గుర్తించిన పరదేశం ఘనా సెప్టెంబర్ 25 ను వెంపటి చినసత్యం దినోత్సవం గా 1994 లో ప్రకటించింది. ఇది ఆయన తపస్సుకు విశ్వ వేదిక పట్టిన వజ్ర నీరాజనం.
1956 లో కేంద్ర ప్రభుత్వం చినసత్యం గారిని పద్మ భూషణ్ అవార్డు తో సత్కరించింది. 1963 లో ఆయన కూచిపూడి ఆర్ట్ అకాడమి ని చెన్నైలో స్థాపించారు. కూచిపూడి కళకి పర్యాయ పదమైన కీర్తిని సొంతంచేసుకొన్నారు. అయినా తనకి కళా భిక్ష పెట్టిన కూచిపూడిని మరువ లేదు . వారం పది రోజుల పాటు కుచిపుడిలో మకాం వేసి, సిద్దేంద్ర యోగి ఆరాధనోత్సవాలను దగ్గరుండి జరిపించే వారు . భారతీయ నృత్య రీతులలో నిష్ణాతులైన కళాకారులను ఆహ్వానించేవారు. వారితో ఔత్సాహిక కళాకారులకు శిక్షణ, సలహాలు ఇప్పించే వారు . ఆ రకం గా నాట్య కూచిపూడిలో విశ్వ కళా వేదికను నెలకొల్పేందుకు ఇతోధికం గా ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వయసు తో పాటు ఆరోగ్యం సహకరించక పోయినా తన కళా రాధనను మానుకోలేదు. తన చివరి శ్వాస వరకు కూచిపూడి సేవకు అంకిత మయ్యారు .
వెంపటి చినసత్యం 'భరణి కళాప్రపూర్ణ' సహా నాట్యరంగంలో అందు కున్న పురస్కారాలు లెక్కకు మిక్కిలి.ఆయన 2012 జూలై 29 న 84 ఏళ్ళ వయసులో నటరాజులో లీనమయ్యారు. భారతీయ నాట్యరీతుల్లో కూచిపూడికి సముచితస్థానం ఆర్జించి పెట్టిన వెంపటి చినసత్యం స్మృతి శాశ్వతం. శిష్య, ప్రశిష్య కోటి నాట్యం లో నిత్యం నర్తిస్తూనే వుంటారు ఆ నటరాజు. కూచిపూడి నాట్యం వున్నంతవరకు వెంపటి చినసత్యం చిరంజీవి.