Online Puja Services

ప్రపంచ హృదయ కాన్వాస్ పై రవివర్మ సంతకం

18.224.73.124

ప్రపంచ హృదయ కాన్వాస్ పై రవివర్మ సంతకం - అజరామరం
-లక్ష్మీ రమణ . 

కుంచె పడితే .. అపర లక్ష్మి దేవే సాక్షాత్కరిస్తుంది. వీణా పాణి కచేరీకి సిద్ధమంటుంది. చిన్ని కృష్ణుడు యశోదమ్మను అల్లరి పెడతాడు . ఆ కుంచే  ఓ భూప్రపంచం. దానికి  ఎలాంటి  పృథ్వీ తత్వం  ఉన్నదో  తెలీదు. ఆ  ఆకర్షణా  శక్తి ముందు పువ్వుల్లాగా పల్లె అందాలన్నీ సాష్టాంగ పడతాయి. అది సౌందర్యాన్ని ఆవిష్కరించే ఓ కళా  కల్పవృక్షమే . ఆ కుంచె పేరు రాజా రవివర్మ .

రవి వర్మ సంప్రదాయ , పాశ్చాత్త చిత్రకళల మేళవింపుకి పేరెన్నికగన్న చిత్రకారుడు. భారత, రామాయణ ఘట్టాలను తైల వర్ణ చిత్రాలుగా మలచి మంచి గుర్తింపు పొందారు. సొగసైన చక్కని  చిన్నదాన్ని చిత్రించినా , సౌందర్యలహరి అయినా ఆ అమ్మలగన్న అమ్మని చిత్రించినా  అతనికి అతనే సాటి. చీరకట్టుకే తెలియని సొగసులని కుంచకట్టులోనే చూపిస్తాడు. అమ్మతనంలోని అనురాగాన్ని కుంచె రంగులకి ఆపాదిస్తాడు . కాన్వాసుపై రసరమ్య చిత్రాన్ని , సజీవంగా ఆవిష్కరిస్తారు . 

రసజ్ఞుడైన చిత్రకారుడు , రాజా రవివర్మ 1848 ఏప్రిల్ 29,  కేరళ రాష్ట్రం లో తిరువనంతపురానికి 25 మైళ్ళ దూరంలోని కిలమానూరు రాజప్రాసాదములో జన్మించారు . ఉమాంబ తాంబురాట్టి, నీలకంఠన్ భట్టాద్రిపాద్ దంపతులు ఆయన తల్లిదండ్రులు.  చిన్నారి రవివర్మ  బంధువు,  ట్రావెన్కూర్ మహారాజా, అయిల్యమ్ తిరునాళ్ దగ్గర చిత్రరచనను అభ్యసించారు.చిన్నతనములోనే రవి ప్రతిభకు ముగ్ధుడైన అయిల్యమ్ తిరునాళ్  మరింతగా ప్రోత్సహించాడు. దాంతో ఆస్థాన చిత్రకారుడయిన శ్రీ రామస్వామి నాయుడు దగ్గర రవి వర్మ శిష్యరికం చేశాడు. తైల వర్ణ చిత్రకళను బ్రిటీషు దేశస్థుడయిన థియోడార్ జెన్సన్ వద్ద నేర్చుకున్నాడు.

 పాశ్ఛ్యాత్య చిత్రకళా శైలి, అందులోని భావ వ్యక్తీకరణ, రవివర్మను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అవి అప్పటి భారతీయ చిత్రకళాశైలికి ఎంతో భిన్నంగా కనిపించాయి. సహజంగానే వాటి ప్రభావం రవి వర్మ కుంచెపైనా పడింది . పాతికేళ్ళ వయసునాటికే ఆయన వియన్నాలో జరిగిన చిత్ర ప్రదర్శనలో పాల్గొని బహుమతిని సాధించాడు.

 1873 లో వియన్నా చిత్ర ప్రదర్శన తర్వాత రవివర్మ చిత్ర వైభవం ప్రపంచానికి పరిచయమయ్యింది. ఆ తర్వాత రవివర్మ బాగా వెలుగులోకి వచ్చారు. 1904లో అప్పటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ రవివర్మ ప్రతిభను గుర్తించి "రాజా" అన్న బిరుదును ప్రదానం చేశారు. ఆనాటినుంచి రవివర్మ పేరుకు ముందు రాజా అన్న బిరుదు స్ఠిర పడింది. రాజా రవివర్మ చిత్రాల ఇతివృత్తాల కోసం భారత దేశమంతా విస్తృతం గా పర్యటించాడు . వివిధ ప్రాంతాల ఆచార వ్యవహారాలు సునిశితంగా పరిశీలించాడు. ఆ తర్వాత వాటిని సజీవ చిత్రాలుగా రూపొందించాడు. రవివర్మ ఊహల్లో దక్షిణ భారత స్త్రీలు  సౌందర్య రాసులుగా తోచారు.  దక్షిణ భారత స్త్రీలలాగా దేవతా మూర్తులను ఊహించి చిత్రించేవాడు రాజా రవివర్మ.

 భారత ఇతిహాసాలు, పురాణాల్లోని పాత్రలు -ఎందరో కళా ప్రేమికుల ఊహలకు రెక్కలిచ్చాయి. వారి కళకి పదును పెట్టాయి . భారత జాతికి మేటి రత్నాలని అందించాయి . రవివర్మ చిత్రాలకు అవే ప్రేరణ నిచ్చాయి . రవి కుంచె జాలువారిన వర్ణాల ధారలో తడిసి జీవం పోసుకోన్నాయి. రామాయణం , భారతం , భాగవత  ఘట్టాలు రవి వర్మ కాన్వాస్ పై అద్భుత వర్ణ చిత్రాలయ్యాయి.  పౌరాణిక పాత్రలన్నీ రవివర్మ చిత్రాల్లో సజీవంగా ఒదిగిపోయాయి. ఉత్తరాదిలో పర్యటించినప్పుడు, "శకుంతల దుష్యంతులు", "నలదమయంతి" కధలలోని దృశ్యాలను అపురూప వర్ణచిత్రాలుగా మలచాడు.

 ప్రసిద్ధు లైన వారి చరిత్రలు పులపాన్పు లేమీ కాదు. అడుగడుగునా విమర్శలు వేధిస్తున్నా ... వెనుదిరగని ధైర్యం, పట్టుదల అడుగడుగునా ఆ కథలని నడిపించాయి . చరిత్రలుగా  నిలబెట్టాయి.  రవివర్మ ఎంత అద్భుతమైన చిత్రకారుడైనప్పటికి .... ఎన్నో విమర్శలు, వివాదాలు ఎదుర్కొన్నారు. సంప్రదాయ, పాశ్చాత్త చిత్ర కళ ల మేళవింపు లో వర్ణాలద్దుకొన్న రవివర్మ చిత్రాలపై పరిశోధన చేసేందుకు సరైన సమాచారం లేకపోవడం నిజం గా శోచనీయం .  

తంజావూరు శైలి లోనే కాక పాశ్చాత్య పద్ధితిలో కూడా రవివర్మ  ప్రావీణ్యం సంపాయించారు. మైసూరు, బరోడా ఇలా ఎన్నో నగరాలు తిరుగుతూ,  ప్రతిభకు మెరుగులు దిద్దుకొన్నారు. తనదైన  శైలిలో పారంపరిక చిత్రలేఖనాన్ని సవాలు చేస్తూ ఆయిన గీసిన బొమ్మలను చాలా మంది తూలనాడారుకుడా ! రవివర్మ కీర్తి  పతాకానికి రంగుపులమాలని  ఎందరో  ప్రయత్నించారు. మానవులతో సమానంగా హిందూ దేవతలను చిత్రీకరించారట, సహజత్వానికి దూరంగా జిలుగులు అద్దాడట. భారతీయ చిత్రలేఖన విలువలు   పాటించనేలేదట . అతని శైలే  ప్రదర్శనాత్మకంగా, ఛాందసంగా ఉంటుందట.  ఇలా ఎన్నోసాకులతో ఆ  చిత్రాలను తోసిపుచ్చారు.  అయినా ఇవేవీ అతని ప్రతిష్టకి అడ్డుకాలేడు .

 ఎన్నివిమర్శలు వచ్చినా అతను స్పందించలేదు. అసలు లెక్కచెయ్యలేదు. అయితే,  రవివర్మ చిత్రాలపై పరిశోధన చేయాలనుకొనే ఔత్సహికులకు కొదవ లేదు.  కాని వారి పరిశోధనకు  పూర్తి  ఆధారాలు లేవు. అందుకే అవన్నీ అసంపూర్తిగా మిగిలి పోయాయి .  రవివర్మ చిత్ర కళ గురించి ఎటువంటి పుస్తకాలూ ప్రకటించలేదు. కాని రవివర్మ తమ్ముడు, సి.రాజరాజవర్మ రాసిన దినచర్య కొంతవరకు ఉపయోగపడుతోంది. రాజరాజవర్మ స్వతహాగా మంచి పేరున్న చిత్రకారుడు. ఆయన రవివర్మకు చిత్రాలు గీయడం లో సహాయము చేసేవాడు. అతని ఆంతరంగిక సహాయకుడు కూడా. అయితే ... ఈ డైరీ ఆధారం గాను పూర్తి వివరాలు ఇప్పటికీ స్పష్టంగా తెలియవు .  ఉన్న సమాచారం ఆధారం గానే రవివర్మ చిత్రకళ పై  ఇంగ్లీషు, తమిళ భాషల్లో ఎన్నో పుస్తకాలు అచ్చయ్యాయి. రాజ రాజ వర్మ చిత్రాల్లో రవివర్మ కుటుంబాన్ని కొంతవరకు చూడవచ్చు

 వివాదాలు , విమర్శలు పక్కన పెడితే ... రవివర్మ కుంచె ఒక సమ్మోహనం. ఆ కాన్వాస్ పై పల్లె అందాలు విరుస్తాయి. పురాణాలు పలకరిస్తాయి. ప్రేమలు పులకరిస్తాయి . మనసు రంజింపజేస్తాయి. ఓ  ప్రేరణగా నిలుస్తాయి .

 రవివర్మ వర్ణాల వానలో ... తడిసిన అందాలు ప్రపంచాన్నే మాయ చేసాయి. భారతీయ చిత్తరువంటే .. రవివర్మదేనన్నాయి. కళా చరిత్ర లో చెరగని చిత్తరువు గా నిలిపాయి. కిలమానూరు ప్యాలెస్ లో అతని కుంచె పలికిన రాగాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోంది. దాదాపు 160 చిత్రాల అపూర్వ సంపదను తిరువనంతపురం చిత్ర ఆర్ట్ గ్యాలరీ లో భద్రపరిచారు. రవివర్మ చిత్రాల శైలి ఎందరో ప్రముఖుల పై ప్రభావం చూపింది. చలనచిత్రాలకు ప్రాణం పోసింది. భారత చలన చిత్ర ఆద్యుడు దాదాసాహెబ్ ఫాల్కే కు ప్రేరణ నిచ్చాయి. చిత్రకళకు రవివర్మ మహోన్నత ఉపకారం చేశారు. కేరళ ప్రభుత్వం రాజా రవివర్మ పురస్కారాన్ని అందిస్తోంది . కళలు, సంస్కృతి అభున్నతికి కృషి చేసిన వారికి ఏటా ఈ పురస్కారాన్ని ఇస్తారు. కేరళలోని మావలికెర లో ఒక ఫైన్ ఆర్ట్స్ కళాశాలను కూడా నెలకొల్పారు.

  ప్రకృతి ఆ కాన్వాస్ పై ఒంపులు తిరుగుతుంది. కన్ను చెదిరే అందాలను ఆవిష్కరిస్తుంది.ఆకాశం అమ్మాయయితే ఎలా వుంటుందో రవివర్మ చిత్రాలు చెబుతాయి. అపురూప మనిపించే చిత్రాలతో ... భారత కీర్తిని గగనతలాన రెపరెపలాడించిన వర్ణ సమ్మోహనం , అక్టోబర్ 2, 1906 వ తేదీ న శాశ్వతం గా దివికేగింది. ప్రపంచ హృదయ కాన్వాస్ పై రవివర్మ సంతకాన్ని శాశ్వతం గా ముద్రించుకోంది.

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore