Online Puja Services

దక్షిణాచారం, వామాచారం అంటే ఏమిటి ?

18.119.192.2

దక్షిణాచారం, వామాచారం అంటే ఏమిటి ? 
సేకరణ: లక్ష్మి రమణ  

తంత్రాలు, తంత్ర ప్రక్రియలు చాలా ప్రాచీనమైనవి.ఇష్టకామ్యసిద్ధి కోసం ప్రాచీనకాలం
నుండి తంత్ర ప్రక్రియలు చేయటం జరుగుతూనే ఉన్నది. శాస్త్రగ్రంథాలలో
తంత్రశాస్త్రానికి చాలా ప్రాధాన్యాన్ని ఇచ్చారు.

‘విష్ణుర్వరిష్ఠో దేవానాం హ్రదానాముదధిస్తధా
నదీనాంచ యథాగంగా పర్వతానాం హిమాలయః
అశ్వత్థః సర్వవృక్షాణాం రాజ్ఞామింద్రో యధావరః
దేవీనాంచ యథాదుర్గా వర్ణానాం బ్రాహ్మణో యథా
తథా సమస్త శాస్త్రాణాం తంత్రశాస్త్ర మనుత్తమం
సర్వకామప్రదం పుణ్యం తంత్రంవై వేదసమ్మితం’ 

దేవతలలో విష్ణువు , నదులలో గంగానది , పర్వతాలలో హిమాలయాలు , వృక్షాలన్నింటిలో అశ్వర్థ వృక్షము , రాజులందరిలో ఇంద్రుడు , దేవతలందరిలో దుర్గాదేవి , వర్ణాలంన్నింటిలో వేదాన్ని వ్యాప్తి చేయు బ్రాహ్మణులు ఎలాగైతే ఉత్తములో, శాస్త్రాలన్నింటిలో తంత్రశాస్త్రం అభీష్టాలనూ తీర్చేది , శాస్త్రాలన్నింటి లోనూ ఉత్తమమైనది అని  చెప్పబడింది . 

మహావిశ్వతారతంత్రంలో దాదాపు 64 తంత్రగ్రంధాల ప్రస్తావన ఉంది. వాటిలో మేరుతంత్రము, శారదాతిలకతంత్రము ప్రామాణికమైన గ్రంధాలు. కౌళావళి నిర్ణయమనే గ్రంధంలో 72 తంత్రగ్రంధాలు ప్రస్తావించబడినాయి. అవి రుద్రయామళము, బ్రహ్మయామళము, విష్ణుయామళము, శక్తియామళము, భావ చూడామణి, తంత్ర చూడామణి, కుల చూడామణి తదితరాలు .

వామాచారులు, దక్షిణాచారులని తంత్రవాదులు / సాధకులు రెండు రకాలు.

వామాచారం మద్యం మాంసం తధా మత్స్యం ముద్రా మైధునమేవచ
మకార పంచకంచైవ దేవతా ప్రీతికారకం

మద్యము, మాంసము, మత్స్యము, ముద్ర, మైధునము ఇవి అయిదు పంచ మకారాలు.
ఈ మకార పంచకంతో చేస్తేనే తప్ప, మంత్రసిద్ధి కలుగదని వామాచార సంప్రదాయబద్ధమైన
కులతంత్రాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా, సదాచార నిషిద్ధములైన ఈ వామాచారాన్ని
సంప్రదాయ విరుద్ధంగానే భావించాలి. 

వస్తుతః పంచ మకారాలు ప్రతీకాత్మకాలు.
బ్రహ్మరంధ్రం నుంచి స్రవించే మధువునే మదిర అంటారు. 
వాసనారూపమైన పశుత్వాన్ని ఖండించటమే మాంసం. 
ఇడా పింగళా నాడుల మధ్య ప్రవహించే శ్వాసలే మత్స్యం. 
ప్రాణాయామ ప్రక్రియల చేత ప్రాణాన్ని అవరోధించి,
సుషుమ్నానాడిలో నశింపజేయడమే ముద్ర. 
సహస్రారంలోని శివునితో శక్తిరూపమైన కుండలినిని మేళవించడమే మైధునం. 

కాలాంతరంలో, అవివేకులు, శరీరభోగనిష్ణాతులు ఈ సాధనను వక్రమార్గం పట్టించారు.
వామాచార ప్రక్రియలను వ్యతిరేకించుటకు ఇదే కారణం.

దక్షిణాచారం:

దక్షిణాచారానికి శౌచం ప్రధానం. ఆహార విహారాదులలో కఠిన నియమ నిష్టలతో
ఉండి సాధన చేయాలి. జపదీక్ష చేసే స్థలం విషయంలో కూడా జాగ్రత్త అవసరం.
దీక్షా సమయంలో ఏకభుక్తులై, భూశయనులై, బ్రహ్మచర్యాన్ని అవలంబించాలి.
ఏది ఏమైనా, వామాచారులు, దక్షిణాచారులు ఒకరి మార్గంలో మరొకరు
ప్రవేశించటాన్ని తంత్రశాస్త్రాలు నిషేధిస్తున్నాయి. వేదవిద్య అయినటువంటి
గాయత్రీ మంత్రసాధన వామాచారంలో చేయాలనుకోవటం ఎంత బుద్ధిహీనమో,
ఆవిధంగానే, ఉచ్ఛిష్టగణపతి విద్యను దక్షిణాచారంలో సాధించదలచటమూ
అంతే బుద్ధిహీనము.

తంత్రగ్రంధాలలో శాక్తేయవిద్యల ప్రస్తావన వచ్చినప్పుడు దశమహావిద్యలకు
ఉన్న ప్రాధాన్యం కనిపిస్తుంది. ఈ దశమహావిద్యల ఆవిర్భావం గురించి
అనేకరకాలైన కథలు వ్యాప్తిలో ఉన్నాయి. దేవీభాగవతంలో కథ ఈరకంగా ఉంది.

దక్షప్రజాపతి పిలవని యజ్ఞానికి వెళ్ళితీరాలని సతీదేవి పట్టుపట్టటంతో శివుడు క్రోధించాడు. క్రోధాగ్నిరూపుడైన శివుని చూసి, సతీదేవికి అంతకుమించిన కోపం కలిగి భీషణరూపం ధరించింది. శివుడు విముఖుడై వెళ్ళిపోవడానికి ఉపక్రమించగా, సతీదేవి దశరూపాలు
ధరించి దశదిశలా అడ్డు నిల్చున్నది. ఆ దశరూపాలే దశమహావిద్యా రూపాలు.

కానీ, శివపురాణంలో మరో కథ ఉంది.

రురుడనే రాక్షసుని కుమారుడు దుర్గముడు. బ్రహ్మ వలన వరం పొంది
సమస్త వేదాలాను అపహరించుకుపోయాడు. వేదోక్త కర్మలు, యజ్ఞయాగాదులకు
ఆటంకం కలిగింది. దేవతల ప్రార్ధనలు విని, వేద పునరోద్ధారణకు దేవి నడుం కట్టింది.
ఆ దేవి శరీరం నుండి ఉధ్బవించిన మూర్తులే : కాళి, తార, ఛిన్నమస్త, బగళాముఖి, మాతంగి, ధూమావతి, భువనేశ్వరి, షోడశి, కమలాత్మిక, భైరవి. వీరే దశమహావిద్యలు. వామాచారులు భిన్నమైన పద్ధతుల్లో ఈ దశమహా విద్యల సాధన చేస్తుంటారు .  

ఇది కేవలం చదువరుల అవగాహన కోసమేనని , ఎవరినీ కించపర్చడానికి కాదని పఠనాశక్తిపరులు గమనించాలి .

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore