కాకులు పితృదేవతల స్వరూపాలు ఎలా అయ్యాయి ?
కాకులు పితృదేవతల స్వరూపాలు ఎలా అయ్యాయి ?
-లక్ష్మీ రమణ
కోకిల పాటపాడితే విని మురుసిపోతాం . చిలకమ్మ మాటలకు ముచ్చటపడతాం . పాపపుట్టని చూసి దండం పెడతాం. కానీ కాకిని చూస్తే, విదిలించేవారేగానీ ఆదరించేవారేరీ ! సర్వభక్షకి అయిన కాకికి పితృదేవతలని పూజించేప్పుడు మాత్రం చేతులెత్తి నమస్కరిస్తాము . కానీ ఈ కాకి పితృదేవతల స్వరూపంగా ఎలా మారింది అంటే, దానికి మన ఇతిహాసాలు ఇలా సమాధాన మిస్తున్నాయి .
రామాయణంలో రాక్షసోత్తముడు రావణాసురుడు ఈ కధకి మూలమయ్యారు . ఆయన దేవలోకాన్ని జయించారు . నవగ్రహాలనీ తన స్వాధీనం చేసుకోవాలనుకున్నారు . గ్రహాలని అదుపు చేయగలిగితే, వాటిగతుల వల్ల ఏర్పడే ఇబ్బందులు జ్యోతిష్యశాస్త్రరీత్యా ఉండవు కదా! ఇంద్రజిత్తు జన్మసమయంలో అలా వారిని అవసరమైన స్థానాలలో బంధించగా, శనీశ్వరుడు తన కాలుని జరిపి తనస్థానాన్ని మార్చారు . దాంతో కాలిని కోల్పోయారనే కథ తెలిసిందేకదా! రావణాసుడు అంతటి గ్రహగతులని నిర్దేశించగలిగిన పండితుడు, దేవలోకాన్ని జయించగలిగిన వీరుడు, శివుని జ్యోతిర్లింగాన్ని తీసుకురాగలిగిన భక్తుడు కూడా . అందుకే ఆయన రాక్షసోత్తముడు .
సరే, ఈ వీరుడు తనదాకా వస్తే , తనపరిస్థితి ఏంటని ఆలోచించాడు యమధర్మరాజు . ఆయన రావణాబ్రహ్మ నుండీ తప్పించుకునే మార్గం కోసం చూస్తుంటే, అక్కడ ఒక కాకి కనిపించింది. ధర్మదేవుడు కాకిని తప్పించుకొనే మార్గం చెప్పమని అడిగారు . ఒత్తిడిలో ఎంతటి వారికైనా ఆలోచన నశిస్తుంది కదా ! అప్పుడా కాకి నిన్ను నాలోకి చేరుకో యమరాజా , నేను నిన్ను తప్పిస్తాను అన్నది . అలా యముడు కాకి రూపంలోకి మారిపోయి , రావణుడి బారినుండీ తప్పించుకున్నారు .
తనని రక్షించిందన్న కృతజ్ఞతతో , కాకిజాతికి ఒక అపురూపమైన వరాన్ని అనుగ్రహించారు . అదేమంటే , “ఎవరైతే, అమావాస్యనాడు గానీ, మాతా , పితరులు ,బంధువులు కైవల్యాన్ని పొందిన తిథులలో గానీ, మహాలయ పక్షాలలో గానీ కాకికి ఆహారాన్ని పెడతారో, వాళ్ల బంధువులు నరకంలో ఉన్నప్పటికీ కూడా తృప్తిని , సంతోషాన్ని పొందగలరు” అని . ఇక అప్పటినుండీ కాకికి పితృకార్యాలలో పిండాన్ని తమ పితరుల తృప్తికోసం పెట్టడం ఆచారంగా మారింది. కాకి ఆ పిండాన్ని స్వీకరిస్తే , పితరులు సంతృప్తిని పొందారని వారసులు ఆనందిస్తారు . కాకి ఒకవేళ పితృదేవతలకు సమర్పించిన పిండాన్ని ముట్టక పొతే, వారి కోరిక తీరకుండా అసంతృప్తితో దేహాన్ని విడిచారని వారసులు విశ్వసిస్తూ ఉంటారు .
దీనికి సంబంధించినదే మరోకథకూడా ప్రాచుర్యంలో ఉంది . ఇది కూడా త్రేతాయుగం నాటిదే! ఇంద్రుని కుమారుడు జయంతుడు కాకి రూపంలో వచ్చి సీత కాలికి గాయం చేస్తారు . ఇది చూసిన రాముడు కాకి కన్ను పొడిచేస్తారు. తర్వాత జయంతుడు తన తప్పును గ్రహించి శ్రీరాముడిని క్షమాపణ కోరుతారు. అప్పుడు రాముడు అతడిని క్షమించి ఈ రోజు తర్వాత మీకు ఇచ్చిన ఆహారం పూర్వీకులు అందుకుంటారని చెబుతాడు. అప్పటి నుంచి కాకిని పూర్వీకుల రూపంగా భావిస్తారు.
మొత్తానికి యముడిని తన రూపంలోకి ఆహ్వానించిన కాకి ధర్మదేవతయ్యింది. శని దేవునికి వాహనమై ప్రసిద్ధిని పొందింది. పితృస్వరూపమై పిండాన్ని ఆరగించి పితృదేవతల సంతృప్తికి కారణమయ్యింది. అందుకే కాకిని తేలికగా చూడకండి.