Online Puja Services

కన్ను అదిరితే ఏం జరుగుతుంది ?

3.18.109.36

కన్ను అదిరితే ఏం జరుగుతుంది ?
-సేకరణ : లక్ష్మి రమణ        

కుడి భుజ మదిరే, కుడి కన్నదిరే , అన్నీ మంచి శకునములు, కన్యలాభ సూచనలే అని అర్జనుడు సుభద్రాణి కలిసేముందు పాడుకున్నట్టు  ఓ చిత్రరాజం చూపిస్తుంది .  మానవులకు కన్ను అదరడం సాధారణమే. ఒక్కోసారి కుడికన్ను.. ఒక్కోసారి ఎడమ కన్ను అదురుతూ ఉంటుంది. వీటి ఫలితాలని విశ్లేషించడం పురాణకాలం నుండీ ఉన్నమాటే ! పురుషులకు ఎడమ కన్ను.. మహిళలకు కుడి కన్ను అదరడం మంచిదికాదనే విశ్వాసం పురాణకాలం నుంచి ఉంది. అందుకే కుడి కన్ను అదరగానే ఏదో కీడు జరగనుందని మహిళలు ఆందోళన చెందుతారు. రావణుడు అపహరించడానికి ముందు సీతమ్మవారికి కూడా కుడి కన్ను అదిరినట్టు ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. 

పురుషునికి కుడి కన్ను, స్త్రీకి ఎడమ కన్ను అదిరితే మంచిదని శృతి వచనం . అలాగే పురుషునికి ఎడమకన్ను, స్త్రీకి కుడి కన్ను అదిరితే కీడు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక రెండు కన్నులు ఒకే మారు అదురుట స్త్రీ పురుషుల ఇద్దరికి శుభసూచకం.

ఇంకా కింది పెదవి భాగం అదిరితే- భోజన సౌఖ్యం, గడ్డం అదిరితే- లాభం, ఇతరుల ద్వారా సహాయ సహకారాలు అందుతాయి. ఇక కుడి చెక్కిలి అదిరితే- ధనప్రాప్తి, ఎడమచెక్కిలి అదిరితే- చోర బాధలు, కుడి భుజం అదిరితే భోగ సంపదలు- వంటి ఫలితాలుంటాయి.

అలాగే ఎడమ భుజం అదిరితే కష్టాలు ఎదురవుతాయి. రొమ్ము అదిరితే.. ధనలాభం, ధైర్యం, అరచేయి అదిరితే.. సంతాన ప్రాప్తి, గౌరవం కలుగుతుంది.

ఇది మన దేశంలోనే కాదు , వివిధదేశాలల్లో కూడా కన్ను అదరడాన్ని శకునంగానే భావిస్తుంటారు . కన్ను అదిరితే.. ఒక్కో దేశంలో ఒక్కో నమ్మకం ఉంది. 

హవాయి దేశంలో ఎడమ కన్ను కొట్టుకుంటే.. ఓ అపరిచితుడు జీవితంలోకి వస్తాడని, కుడి కన్ను అదిరితే... తమ ఇంట్లో కానీ, బంధువుల ఇళ్లలోగానీ పసి బిడ్డ జన్మిస్తుందని నమ్ముతారు. 

ఆఫ్రికాలో కన్ను పై రెప్ప కొట్టుకుంటే బంధువుల రాక అని, కింది రెప్ప కొట్టుకుంటే కన్నీళ్ల కుండపోత తప్పదని అంటారు. 

నైజీరియాలో ఏ కన్ను కొట్టుకున్నా చెడే జరుగుతుందని నమ్మకం.
 
ఇక చైనా దేశ ప్రజలకు కుడి కన్ను అదిరితే మంచిదని, ఎడమ కన్ను అదిరితే కీడు. అంతేకాదు, అదిరే సమయాన్ని బట్టి ఫలితాలు వేరుగా ఉంటాయంటారు. వారి నమ్మకం ప్రకారం.. ఉదయం 11గంటల నుంచి ఒంటి గంట మధ్య అదిరితే ఓ గొప్ప వ్యక్తిని కలుస్తారట. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్య అయితే కష్టాలు వస్తాయట. 3 నుంచి 5 గంటల మధ్య అయితే విదేశాల నుంచి అతిథులు వస్తారట. ఇలా వారికి విభిన్నమైన నమ్మకాలు ఉన్నాయి.

ఈ శకునాలు నిజమేనా కాదా , ఇలాగే జరుగుతుందా జరగదా అన్న మీమాంసలకన్నా , నమ్మకాలు బలమైనవి అంతే !

Quote of the day

As a single withered tree, if set aflame, causes a whole forest to burn, so does a rascal son destroy a whole family.…

__________Chanakya