దిష్టిని తీసేందుకు వీటినే ఎందుకు ఉపయోగిస్తారు ?
దిష్టిని తీసేందుకు వీటినే ఎందుకు ఉపయోగిస్తారు ?
-లక్ష్మీ రమణ
'నరుడి దృష్టి సోకితే నల్లరాయి కూడా నలిగిపోతుంది' అనే మాట మనకు తరచూ వినిపిస్తుంది. దిష్టి తీయడమనే ప్రక్రియ అనాది నుంచి ఉన్నదే. ప్రతి ఒక్కరి కంటి నుంచి విద్యుత్ ప్రసారం జరుగుతూ ఉంటుంది. ఆ విద్యుత్ ప్రవాహం అవతలివారిపై వ్యతిరేక దిశలో పనిచేసినప్పుడు వాళ్లకి తలనొప్పి రావడం, వికారపెట్టడం, వాంతులు కావడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి అని పండితులు వివరిస్తున్నారు . ఈ దిష్టిని తీసేందుకు నిమ్మకాయలు, ఉప్పు , మిరపకాయలు, గుమ్మడికాయలు తదితరాలు ఉపయోగిస్తూ ఉంటారు. వీటినే దోస్తీకి ఎందుకు ఉపయోగిస్తారు అనేది ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం .
ఉప్పు మృత్యుదేవతకి చాలా ఇష్టం. అందుకే దానిని మృత్యు దేవతకి ఉపాహారంగా అంటే, కానుకగా సమర్పిస్తారు . ఇక నిమ్మకాయలు కాలభైరవ స్వరూపం . అందుకే దానిని అమ్మవారి త్రిశూలానికి కూడా గుచ్చుతారు . కాలభైరవుడి రక్షగా నిలబడ్డాక , ఇక హానికలిగించాల దుష్టశక్తి ఎవరు ? దిష్టితీయడానికి వాడే, ఎండుమిరపకాయలు కలిపురుష స్వరూపం . కలిపురుషుడి ప్రభావం ఉండడంవల్ల కలియుగంలో ప్రజలు అనేక పాపకర్మలు చేస్తారని ఆర్యోక్తి . కాబట్టి ద్రుష్టి సోకడంవల్ల సంభవించే ప్రమాదాన్ని వీటిని తిప్పి పడేయడం వల్ల అపమృత్యువు తొలగిపోతుంది . దానివల్ల సంభవించే చెడు దోషాలు దరిచేరకుండా ఉంటాయి .
గుమ్మానికి దిష్టి నివారణకు కట్టే, కొబ్బరికాయ ,గుమ్మడికాయ, నిమ్మకాయ వరుసగా సత్వ , రజ, తమో గుణాలకి ప్రతీకలుగా చెబుతారు విజ్ఞులు . పూర్వం రాజులు తమ వీరత్వాన్ని పదర్శిస్తూ , తాము ఉత్తరించిన శత్రువు తలని గుమ్మానికి వేళ్ళాడదీసేవారట . అంటే, దానర్థం ఇక్కడ ఇలా దుస్తుల్ని శిక్షించగల వీరుడున్నాడని చెప్పడమే. తంత్ర శాస్త్రం ప్రకారం కుష్మాండం (గుమ్మడికాయ ) శిరస్సుకి ప్రతీక . మాజోలికి వస్తే, ఇక మీ పని ఇంతే సంగతులని సవాలు విసిరే తత్త్వం ఉన్నవారు గుమ్మడికాయని కట్టుకోవాలి . కొబ్బరికాయ కూడా శిరస్సుగానే చెబుతారు . దానికి శిఖా ఉంటుంది . మూడు కళ్లుకూడా ఉంటాయి . కానీ స్వభావం సాత్వికం. సాత్వికమైన స్వభావంతో ఆధ్యాత్మిక చించనతో ఉండేవారు కొబ్బరికాయ కట్టుకుంటే సరిపోతుంది . ఇక , అనవసరంగా నా జోలికి రావొద్దు, నాగురించి ఆలోచించాల్సిన అవసరం నీకు లేదని ముందుగానే హెచ్చరించాలనుకునే తమో గుణ ప్రధానులు నిమ్మకాయలు గుమ్మానికి కట్టుకోవాలి . తంత్ర శాస్త్ర ప్రాధాన్యత గలవారు కూడా నిమ్మకాలే గుమ్మానికి కట్టుకోవాలని చెబుతూంటారు . ఇక గుర్రపునాడాలు , చిల్లంగి , గవ్వలు , నల్లమొలతాడు వంటివి వినియోగించడం కూడా ఈ కోవ క్రిందికే వస్తుంది .
ఉప్పు, మిరపకాయలు వంటివి అందుబాటులో లేనప్పుడు, దిష్టి తగిలిన వాళ్లు రేణుకాదేవిని స్మరించుకోవాలి. రేణుకాదేవి నామాలను స్మరించడం వలన ఆమె స్తోత్రాలు చదువుకోవడం మూలంగా దిష్టి ప్రభావం నుంచి వెంటనే బయటపడొచ్చు.
భోజనం చేసేటప్పుడు కూడా హఠాత్తుగా ఎవరైనా వస్తే వారిని కూడా భోజనానికి కూర్చోమని చెప్పాలి అంటారు పెద్దలు . లేదా వారికి కనీసం ఏదైనా పండో, పానీయమో ఇవ్వాలి. భోజనం వడ్డించుకున్న తర్వాత మొదటి ముద్ద తీసి కాకికి పెట్టాలి లేదా భగవంతుని తల్చుకుని కన్నులకు అద్దుకుని తినాలి .
ఇలా ప్రతి శనివారం లేదా ప్రతి అమావాస్యకు దిష్టి తీయడం చేయాలి. స్త్రీలు మాత్రం ఎప్పుడూ గుమ్మడికాయ పగుగొట్టకూడదు. అవివాహిత పురుషులు, పెళ్లై ఇంకా సంతానం కలగనివారు గుమ్మడి కాయ పగులగొట్టరాదు.
చివరగా ,ఇలా దిష్టితీసిన నిమ్మకాయలు , ఉప్పు, మిరపకాయలు తదితరాలు ఎక్కడంటే, అక్కడ పడేయకూడదు . వాటిని ఇతరులు తొక్కని ప్రదేశంలో వేయాలి . ఒకవేళ అలాంటి జాగ్రత్తని పాటించకపోతే, దిష్టి సోకడంవల్ల సంభవించే దోషంకన్నా వెయ్యి రేట్లు దోషం తగిలే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విషయం .