కాళ్ళా గజ్జి కంకాళమ్మా-పాట గుర్తుందా
కాళ్ళా గజ్జి కంకాళమ్మా-పాట గుర్తుందా
-లక్ష్మీ రమణ
మన తెలుగింటి అమ్మలు పిల్లల్ని ఆడిస్తూ రకరకాల పాటలు పద్యాలూ పాడేవారు . వాటిల్లో ఎంతో శాస్త్ర విజ్ఞానము , సంప్రదాయమూ దాగుంది . ఆయుర్వేదం - ‘ప్రకృతిలోని ప్రతి మొక్కా అమృతోపమానమైనదే . దానికుండే ఉపయోగాలూ విశిష్టతలూ దానికున్నాయని’ వివరిస్తుంది . అలాంటి ఆయుర్వేద చిట్కాలు ఈ పాటలలో నిగూఢంగా ఉండేవి. అర్థంచేసుకొనే వయసొచ్చాక, అవి ఆ పిల్లలకి అవసరానికి ఆదుకునేవి.
ఉదాహరణకి ‘కాళ్ళా గజ్జి కంకాళమ్మా, వేగూచుక్కా వెలగామొగ్గ, మొగ్గా కాదూ మోదుగ నీరు, నీరుకాదూ నిమ్మల వారీ’’ అనే పాత పాట గుర్తుందా . ఇది పసితనంలో మనం కూడా ఆదుకునే ఉంటాం కదా . ఈ పాటలో కూడా చర్మవ్యాధి చికిత్స విధానాలు దాగి ఉన్నాయి. అప్పట్లో అట్లతద్దికి ఈ పాట పాడుకోవడం ఒక సంప్రదాయంగా ఉండేది . ఈ పండుగా నాటికి వర్షాకాలం అంతమయ్యి , చిరుచలి మొదలవుతుంది . అప్పటిదాకా కురిసిన వర్షాలకు పిల్లలకి కాళ్ళకి కురుపులు , గజ్జి వచ్చేది . దీనికి విరుగుడుగా వైద్యం ఈ పాటలో నిగూఢంగా ఉంది .
ప్రాసతో కూడిన ఈ పాటలో తెలుగు సాహిత్యంతో పాటు వైద్యాన్ని చెప్పేపాటిది . పాట మొదటి పాదంలో కాళ్ళాగజ్జి అంటే కాళ్లకు వచ్చే గజ్జి అనే కానీ గజ్జెలు అనే అర్థంలో అలంకార విశేషం మాత్రం కాదు. కంకాలమ్మ అనే పదం కంకోలం అనే పదానికి ప్రతిరూపం. కంకోలం అనే ఆకును గంగగారపాకు అని కూడా అంటారు. ఈ ఆకుని కూడా గోరింటాకును రుబ్బినట్టే రుబ్బి కాళ్లకు గజ్జి ఉన్నచోట రాస్తారు. అప్పటికీ నయం కాకపోతే లేత వెలగకాయలోని గుజ్జును తెల్లారగట్ల రాస్తారు. అయినా తగ్గకపోతే మోదుగచెట్టు ఆకులను రుబ్బి రాస్తారు. వ్యాధి తగ్గుముఖం పడుతుందని గమనించినప్పుడు పలుచగా చేసిన నిమ్మరసాన్ని రాస్తారు. వ్యాధి తగ్గుముఖం పట్టే సమయంలో నిమ్మరసం పని చేసినట్టే గుమ్మడిపండులోని గుజ్జు కూడా బాగా పనిచేస్తుందని వైద్యశాస్త్ర సంబంధ చిట్కాలను చిన్నప్పటి నుంచే పిల్లలకు ఆటపాటల రూపంలో మనవాళ్లిలా నేర్పించమని చెప్పారు.
అదన్నమాట సంగతి . అందుకే ఆపాటలని ఆప్యాయతతో రంగలించి వారసత్వంగా మన ముందుతరానికి కూడా నేర్పిద్దాం !