జడలో ఇంత రహస్య విజ్ఞానమా !
జడలో ఇంత రహస్య విజ్ఞానమా !
-లక్ష్మీ రమణ
కృష్ణా ముకుందా కన్నే కిష్కిందా… జడతో నా మనసు లాగేసిందా… అని ఒక సినీ కవి అంటే, ఓ వాలు జడా, మల్లెపూల జడా,ఓ పాము జడా .ఆ సత్య భామ జడా అంటూ ఓ గోపాలుడు జడ వెనుకపడతాడు . మెళ్లో పూసల పేరు, తల్లో పూవుల సేరు, కళ్లెత్తితే సాలు, కనకాబిసేకాలు అన్న ఎంకి , నాయుడు బావ నండూరి వారి మాట అప్పటికీ ఇప్పటికీ సాహిత్యాభిమానుల కలల్లో రాజ్యం చేస్తూనే ఉందిగా ! అసలు , ఈ జడమీద కవితలు , పాటలు అల్లడం ఇప్పటి కథ కాదు . దీని వెనుక నాటి కాలం కాకలుతీరిన సంస్కృతాంధ్ర కవీంద్రులూ ఎందరో ఉన్నారు . ఆ మహానుభావుల మాటకేమొచ్చేగానీ జడకథెమో చెప్పగరాదా అంటారా ? అయితే చదవండి మరి !!
ఒకప్పుడు పల్లెటూళ్లలో చక్కగా తలంటుకుని , పట్టుపావడా కట్టుకొని, నడుములు దాటినా భారీ కురులని సొగసుగా దువ్వి , వాటికి జడగంటలు పెట్టుకొని , వయ్యారంగా అమ్మాయిలూ నడిచి వెళ్తుంటే , ప్రక్రుతి కాంతే పరవశంతో నడిచి వస్తున్నట్టు అనిపించేది . వేసవి కాలంలో అయితే , ఓపక్క మండుటెండకి చెమటలు కక్కుతున్నాసరే , ఆ సాయంకాలాల్లో నల్లని తుమ్మెద కురుల్లో , విరిసిన తెల్లని మల్లెల్లి జడనిండా తురుముకున్న అమ్మాయిలు , మూర్తీభవించిన రాధామాతల్లాగా ఉండేవాళ్ళు . వాళ్ళని చూసి పరవశించిపోయే మాధవులు ఊరంతా కళ్లుచేసుకొని చూస్తుండేవాళ్ళు .
ఈ కాలంలో మనం పాశ్చత్య సంస్కృతికి అలవాటుపడి సంప్రదాయాన్ని పక్కన పెడుతున్నాం . కానీ పాశ్చాత్యులు మన సంప్రదాయాన్ని అలవరుచుకుంటున్నారు . యెర్రని వారి శిరోజాలని అల్లి జాడలు , ముడులు వేసుకుంటున్నారు . హరేరామ హరేకృష్ణ సంస్థవారు పుణ్యమా అని రష్యాలో ఈ సంస్కృతి బాగా పరిఢవిల్లుతోంది .
ఇంత అందమైన జడలో ఎంతో అర్థముందంటున్నారు పండితులు . నాడీ విజ్ఞానాన్ని తెలిపే సంప్రదాయంగా జడని అభివర్ణిస్తున్నారు . నాడుల గురించి వివరిస్తూ ,
ఇడా భాగీరథీగంగా పింగళా యమునానదీ
తయోర్మధ్యా గతా నాడీ సుషూమాఖ్యా సరస్వతే
త్రివేణీ సంగమయాత్ర తీర్థరజః సఉచ్చతే
తత్రస్నానం ప్రకుర్వీత సర్వ పాపై: ప్రాముఖ్యతే
అంటుంది జ్ఞానసంకలనీ తంత్రం. గంగ ,యమునా , సరస్వతుల పవిత్రత్రివేణీ సంగమం మనలోనే ఉన్నదంటుంది . వాటినే వెన్నెముకని ఆశ్రయించి ఉన్న ఇడ , పింగళ , సుషుమ్న నాడులుగా పేర్కొంటుంది . ఇక్కడ జడని కవులు , పండితులూ పాముతో పోల్చడాన్ని గురుచేసుకోవడం అవసరం . హిందూ స్రీలు జడవేసుకొనేప్పుడు మూడు పాయలుగా జుట్టుని విడదీస్తారు . ఆ మూడూ సర్ప స్వరూపిణి అయిన పరమపావన ప్రక్రుతి స్వరూపం కుండలినీ శక్తి జాగృతి వాహికలు ఇడ , పింగళ , సుషుమ్న అని పిలిచే నాడులకి సంకేతాలు . వెన్నెముకు సమాంతరముగా చివర వరకూ సాగే ఈ జడ మూలాధారమునుండి సహస్రారమునకు చేరుకొనే కుండలినీ సంకేతము.
జడ పై భాగము తలపై విప్పారిన పాము పడగవలే ఉండే సహస్రార పద్మమునకు సాంకేతికము. మూడు పాయల ముడుల వలె ఇడా, పింగళ నాడులు పెనవేసుకు ఉంటాయి. అంతర్లీనముగా ఉన్న మూడవ పాయ సుషుమ్న నాడికి సంకేతము. అందుకే దానిని అంతర్వాహిని అయిన సరస్వతిగా పేర్కొనడాన్ని ఇక్కడ మనం గమనించాలి .
ఇంత ఆధ్యాత్మిక రహస్యాన్ని మన హిందూ సనాతన ధర్మము,సంస్కృతి స్త్రీల జడలలో దాచింది. ఈ విధముగా స్త్రీలకు మాత్రమే కలుగు కొన్ని వ్యాధులనుండి వారి స్వయం రక్షణకు మార్గము లను మన పూర్వీకులు పొందు పరిచారు. కాబట్టి అమ్మాయిలూ , అమ్మాలని , నానమ్మాలని కాస్త పట్టించుకోండి . జడ వేసుకొని చక్కగా పూవులు తురుముకోండి . పూలదండల మాటున చేరిన గోదామాత కేశములే నాకిష్టమని , అనుగ్రహించిన గోవిందుడి లాగా , మీ ముకుందుడు ముగ్దుడైపోతాడు . నమ్మండి మరి !!