అప్పు - ఆలస్యం
అప్పు - ఆలస్యం
నా కుమార్తె పెళ్ళికొరకు కొంత ధనం అవసరమై కాంచీపురంలోని ముదలియార్ గారిని అప్పు అడిగాను. తను నాకు ఇవ్వడానికి ఒప్పుకుని, ఫలానా రోజు మధ్యాహ్నం మూడుగంటలకు వచ్చి కలవాల్సిందిగా చెప్పాడు. నేను చెంగల్పేట్ నుండి బయలుదేరి అతను చెప్పిన రోజు కాంచిపురం చేరుకున్నాను. ఆయనను కలిసే ముందు ఒకసారి కంచి పరమాచార్య స్వామివారిని దర్శించుకుందామని శ్రీమఠానికి వెళ్ళాను. మద్యాహ్నం రెండుగంటలకే నాకు మాహాస్వామివారి దర్శనం లభించింది.
అంతేకాక ఎప్పుడూ లేనిది మహాస్వామివారు ఆ ఎండలో తీరుబడిగా అన్ని విషయాలు నాతో ముచ్చటించడం మొదలుపెట్టారు. నా మనస్సంతా మూడుగంటలకు ముదలియార్ దగ్గరకు వెళ్ళాలని ఉంది. వెళ్ళడానికా స్వామివారు అనుమతి ఇవ్వట్లేదు. ఆఖరికి సాయింత్రం అయిదున్నరకి స్వామివారు నన్ను వెళ్ళనిచ్చారు.
వెంటనే ముదలియార్ ఇంటికి పరుగులాంటి నడకతో చేరుకున్నాను. చెప్పిన సమయానికి రానందున అతను మనసు నొచ్చుకుని ఇస్తాడన్న డబ్బులు ఇవ్వడేమో అని మనసులో చాలా భయంగా ఉంది. భయం భయంగానే ఇంటి తలుపు తట్టాను. ఆయనే స్వయంగా తలుపు తీసి ప్రేమతో లోపలికి ఆహ్వానించాడు. ఆయన నాతో, “నేను నిన్ను మూడుగంటలకు రమ్మన్నాను. కాని నేను కొద్దిగా పనిఉండి బయటకు వెళ్ళి ఇదిగో ఇపుడే వచ్చాను. అంతేకాక పంచాగం చూస్తే ఈరోజు సాయింత్రం ఆరుగంటల దాకా సమయం మంచిది కాదు అని తెలిసింది. నిన్ను ఆరుగంటలకు రమ్మని చెప్పి ఉంటే బావుండేది అని అనుకున్నాను. కాని నీకై నువ్వే మంచి సమయానికి వచ్చావు. ఇప్పుడు ముహూర్తం కూడా భేషుగ్గా ఉంది. ఇప్పుడు తీసుకో నీకు అప్పుగా ఇస్తానన్న ధనం” అని అన్నారు.
నన్ను ఎవరో తలపై గట్టిగా కొట్టినట్టు అనిపించింది. నాకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వకుండా పరమాచార్య స్వామివారు అంతసేపు నన్ను అక్కడ ఎందుకు ఉంచుకున్నారో ఇప్పుడు అర్థం అయ్యింది.
--- పి.కె. రామనాథన్, చెన్నై-24. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 6
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
t.me/paramacharyavaibhavam
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం