కర్ణుని భార్యల గురించి తెలుసా...?
కర్ణుని భార్యల గురించి తెలుసా...?
కౌరవులవైపున్న మంచివాడు కర్ణుడు. తన గౌరవం కోసం, గుర్తింపు కోసం తపన పడిన యోధుడు. దుర్యోధనుడు దుర్మార్గుడని తెలిసి కూడా కేవలం స్నేహం కోసం అతని వైపే పోరాడి అకారణంగా ప్రాణాలు కోల్పోయిన మంచి మిత్రుడు. మహాభారతంలో అర్జునుడిని ఓడించగల శక్తియుక్తులున్న వీరుడు. అతనిలోని ధీరుణ్ని, స్నేహశీలున్ని, ధర్మవాక్య పరిపాలకుడిని పుస్తకాలలో, సినిమాలలో, సీరియళ్లలో చూపించారు కానీ... అతని వ్యక్తిగత జీవితాన్ని మాత్రం ఎక్కడా చెప్పలేదు, చూపించలేదు. కర్ణుడికి పెళ్లయిందన్న సంగతి ఎంతమందికి తెలుసు? అతనికి ఇద్దరు భార్యలు, కొడుకులు కూడా ఉన్నారని చాలా మందికి తెలియదు. ఆ విశేషాలు తెలుసుకోండి.
కర్ణుని మొదటి భార్య పేరు వృశాలి. దుర్యోధనుడి రథసారధి అయినటువంటి సత్యసేనుడి కూతురు. తనను పెంచిన తండ్రి అధిరథుడి కోరిక మేరకు కర్ణుడు ఆమెను పెళ్లాడతాడు. వృశాలి వ్యక్తిత్వంలో కర్ణుడితో సమానమైనదని దుర్యోధనుడే పొగిడినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. ఈమెకి, కర్ణుని వల్ల ఏడుగురు కుమారులు కలిగినట్టు తెలుస్తోంది. కురుక్షేత్రంలో కర్ణుడి మరణానంతరం తాను చితిలో పడి అసువులు బాసింది వృశాలి.
ఇక కర్ణుడి రెండో భార్య పేరు సుప్రియ. ఈమె దుర్యోధనుడి భార్య భానుమతికి స్నేహితురాలు. ఈమె గురించి పెద్దగా విషయాలేవీ తెలియరాలేవు. ఈమెకి, కర్ణుని వల్ల వృషసేనుడు, సుశేనుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు.
కర్ణుని కుమారులంతా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు. అందులో ఒకరు తప్ప మిగతా అందరూ యుద్ధ భూమిలోనే వీరమరణం పొందారు.
- సేకరణ