పంచభీములు ఒకే సమయంలో జన్మించారా ?
పంచభీములు ఒకే సమయంలో జన్మించారా ? ఒకే ముహూర్తకాలంలో జన్మిస్తే, వాళ్ళ ప్రవర్తనలో తేడాలు ఎలా సంభవించాయి ?
- లక్ష్మి రమణ
పంచ బీములు ఒకే సమయంలో జన్మించారు. అందువల్ల వారిలో ముందుగా ఎవరు ఒకరిని చంపుతారో, మిగిలిన ముగ్గురూ కూడా అతని చేతిలోనే హతమవుతారు. అని మహాభారత ఇతిహాసంలో ఉన్నట్టు చాలా సినిమాల్లో చిత్రించారు . కానీ అది ఎంతవరకూ నిజం ? ఒకే సమయంలో ఒకే నక్షత్రంలో జన్మించిన ఈ పంచభీములు జన్మిస్తే, వారి జీవితాలు మాత్రం ఒకే విధంగా ఎందుకు కనిపించవు? పైగా ఆ పంచ భీములలో భీముడి చేతిలో మిగిలిన నలుగురు చనిపోతారు. పంచభీములు అని పేరొందిన ఆ ఐదుగురూ భీముడు, దుర్యోధనుడు, బకాసురుడు, జరాసందడు, కీచకుడు. ఈ విషయంలో నిజమేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం .
పంచ భీములు గా ప్రసిద్ధి కెక్కిన ఈ ఐదుగురూ ఒకేసారి జన్మించారనే ఆధారాలు ఎక్కడా లేవు. ఈ విషయానికి సంబంధించి కొన్ని విషయాలను పరిశీలిద్దాం. జరాసంధుడు కంసుని మామగారు. కృష్ణుడు కంసుని మేనల్లుడు. కనుక జరాసంధుడికి, కృష్ణుడికి మూడు తరాల వయోభేదం ఉంది. ఈ లెక్క ప్రకారం భీముడు, జరాసందుల మధ్య కూడా అంతే వయోభేదం ఉంది. మహాభారతం ప్రకారం భీముడు, దుర్యోధనుడు సమవయస్కులు. కృష్ణుడి కంటే కొద్దిగా చిన్నవాళ్లు.
భీమాది పంచ బలులు జన్మించిన జన్మ నక్షత్రాలు జన్మ సమయాలు లగ్న రహస్యాలు వేరువేరు కావడం వల్ల వారి జాతకాలు కూడా వేరు వేరు గానే ఉన్నాయి. కాబట్టి, జీవిత గమనాలు కూడా వేరు గానే ఉంటాయి. వ్యాస కృతమైన మహాభారతంలో ఎక్కడా కూడా ఈ ఐదుగురు ఒకే సమయంలో ఒకే నక్షత్రంలో జన్మించారని చెప్పలేదు.
వ్యాసభార తాన్ని అనుసరించి భీముడు దుర్యోధనుడు ఇద్దరు మాత్రమే ఒకే రోజున జన్మించారు. అది ఒకే రోజున జన్మించారు అనే చెప్పబడింది కానీ ఒకే సమయంలో కాదు. ఆ సందర్భంగా జరిగిన కథ ఈ విధంగా ఉంది ధర్మరాజు జన్మించిన వార్త వినగానే అప్పటికి గర్భవతిగా ఉన్న గాంధారి తనకంటే ముందుగా కుంతిదేవి సంతాన వతి అయ్యిందని ఆ పిల్లవాడు భవిష్యత్తులో రాజ్యార్హుడు కాబోతాడని ఆక్రోసంతో గర్భాన్ని మోదుకుంది అప్పుడు ఆమెకు గర్భ పతనం జరిగింది. ఆ సమయంలో వ్యాసమహర్షిని ప్రార్థించగా ఆ మహర్షి వేంచేసి, ఆ మాంస ఖండాన్ని నూట ఒక్క మొక్కలుగా విభజించి ఒక్కొక్క దానిని ఒక్కొక్క నేతి కుండలో ఉంచాడు. తనకు నూరుగురు కుమారులు ఒక కుమార్తె కావాలని కోరుకున్న గాంధారి అభీష్టాన్ని అనుసరించి, ఆయన ఆ విధంగా చేశారు. అలా ఉంచబడిన కుండల నుంచి దుర్యోధనాధుల జననం జరిగింది. ఆ విధంగా కుంతీదేవికి భీముడు జన్మించిన రోజునే, హస్తినాపురంలో దుర్యోధనుడు జన్మించాడని వ్యాసభారతం స్పష్టం చేస్తోంది.
ఇక, జరాసంధుడు భీముడి కంటే దుర్యోధనుడి కంటే కూడా బాగా వయోధికుడు. అందువల్ల వారైదుగురూ ఒకే సారి ఒకే సమయంలో జన్మించారనడం మాత్రం నిజం కాదని తెలియవస్తోంది . తదనుగుణంగానే , వారి వారి ప్రవర్తనలు కూడా ఉండడం ఇక్కడ గమనార్హం .
శుభం !!