జైపూర్ లో జరిగిన ఒక వింత సంఘటన.
జైపూర్ లో జరిగిన ఒక వింత సంఘటన.
-సేకరణ: లక్ష్మి రమణ
శ్రీకృష్ణుడి మెప్పుని సైతం సాధించిన ఖాటు శ్యాంకు, తమ కోరికలను తీర్చడం ఓ లెక్కేమీ కాదన్నది భక్తుల నమ్మకం. మూడు బాణాలతో ముల్లోకాలనూ జయించగల ఆయనకు, తమ కష్టాలను కడతేర్చడం చిటికెలో పని అన్నది, ఆయనను నమ్ముకున్నవారి విశ్వాసం.
ఘటోత్కచుని కుమారుడైన బర్బరీకుడు మహాబలశాలి. అతను కనుక కురుక్షేత్రంలో పాల్గొంటే యుద్ధం తారుమారైపోతుందని గ్రహించిన శ్రీకృష్ణుడు ఏకంగా బర్బరీకుని తలను తనకు కానుకగా అడుగుతాడు. అలా బర్బరీకుడు శ్రీకృష్ణునికి తృణప్రాయంగా అందించిన తల రాజస్థాన్ లోని ఖాటు అనే గ్రామంలో పడిందట. అ శిరస్సుని దర్శించుకునేందుకు ఏటా దాదాపు 40 లక్షల మంది జనం ఖాటు గ్రామానికి చేరుకుంటారని అంచనా!
రాజస్తాన్- ఖాటు జైపూర్ కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖాటు ఒక కుగ్రామం. పదవ శతాబ్దంలో ఒకరోజు ఖాటులో ఓ వింత చోటు చేసుకుంది. ఖాటులోని ఓ ప్రదేశం వద్ద నిలబడిన ఆవు ధారగా పాలుని కురిపించడం మొదలుపెట్టింది. ఆ ప్రదేశంలో ఏదో మహిమ ఉందని గ్రహించిన గ్రామస్తులు, అక్కడి నేలని తవ్వగా అరుదైన సాలిగ్రామం రూపంలో ఉన్న బర్బరీకుని తల కనిపించింది. అలా కలియుగంలో బర్బరీకుడు తన పేరుతో పూజలందుకుంటాని శ్రీకృష్ణుడు అందించిన వరం నిజమయ్యే సమయం ఆసన్నమైంది. బర్బరీకుని శ్యాంబాబాగా, ఖాటు గ్రామంలో వెలిశాడు కాబట్టి ‘ఖాటు శ్యాం’గా కొలుచుకోసాగారు భక్తజనం.
ఆ సాలిగ్రామం భక్తుల ఇంట పూజలందుకుంటుండగానే, ఖాటు ప్రాంతాన్ని ఏలుతున్న ‘రూప్ సింగ్ చౌహాన్’ అనే రాజుకి ఓ కల వచ్చింది. ఖాటు శ్యాం శిరసు కనిపించిన స్థలంలో కనీవినీ ఎరుగని విధంగా ఓ ఆలయాన్ని నిర్మించమన్నదే ఆ కలలోని సారాంశం. దానికి అనుగుణంగానే రూప్ సింగ్ 1027లో ఓ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించాడు. దానికే తరువాతి కాలంలో మార్పులూ చేర్పులూ చేశారు.
ఖాటు శ్యాం శిరస్సు కనిపించిన చోటుని శ్యాంకుండ్ గా పిలుచుకుంటారు భక్తులు . ఈ కొలనులో కనుక స్నానం చేస్తే సర్వ పాపాలూ, సకల రోగాలూ నశిస్తాయన్నది భక్తుల నమ్మకం. ఆ పక్కనే ఉన్న శ్యాం బగీచా అనే అందమైన పూల తోట నుంచే ఆలయంలోని ఇలవేల్పుని అలంకరించేందుకు కావల్సిన పుష్పాలను సేకరిస్తారు. ఇక ఖాటు శ్యాం ఆలయానికి దగ్గర్లోనే గౌరీశంకర ఆలయం పేరుతో ఒక శివాలయం ఉంది. ఈ శివాలయం కూడా అత్యంత పురాతనమైనదే. మహిమ కల్గినదే! ఔరంగజేబు సైనికులు ఒకనాడు ఈ శివాలయంలోని లింగాన్ని ధ్వంసం చేయబోగా, శివలింగం నుంచి రక్తధార వెలువడిందట. దాంతో భయపడిన సైనికులు తోక ముడిచారని అంటారు.
కానీ ఈ వీరుని కథ వ్యాసభారతం లోగానీ, ఆంధ్రమహాభారతంలో గానీ మనకి కనిపించదు. ఈ కథకి మూలం తెలికపోయినా , శ్యాంబాబాగా ప్రజల మన్ననలు పొందుతున్నారు బార్బరీకుడు .