వెయ్యిన్ని ఎనిమిది రకాలు కూరలు

వెయ్యిన్ని ఎనిమిది రకాలు కూరలు - వాటన్నింటినీ వండివడ్డించిన సాధ్వీమతల్లి!
-సేకరణ : లక్ష్మి రమణ
కూరలన్నీలెక్కించండి . కూరగాయలు, ఆకుకూరలు , దుంపలు అన్ని కలుపుకుంటే , లెక్క వెయ్యి దాటిందా ? అయినా వాటిల్లో పితృకార్యాలకి (శ్రార్ధ విధులకు) వడ్డించతగినవి మళ్ళీ వేరు చేస్తే, ఆ జాబితా మరింత చిన్నదైపోవడం లేదూ ! వెనకటికి ఒక మహర్షిని భోక్తగా ఆహ్వానిస్తే, వెయ్యిన్ని ఎనిమిది రకాల కూరగాయలతో వండి వడ్డిస్తానంటేనే వస్తానన్నారట . పిలిచిందేమీ సామాన్యుడు కాడుమరీ . సరే అన్నారు .
అలా తమ పితరుల శ్రాద్ధ భోజనానికి భోక్తగా రమ్మని పిలిచింది వశిష్ఠ మహర్షి అయితే, ఆ కోరిక కోరింది విశ్వామిత్రుల వారు . గాయత్రీ మహామంత్రాన్ని మానవాళి శ్రేయస్సుకోసం అందించిన ద్రష్ట . వసిష్ఠ మహర్షి భార్య అరుంధతి. ఇప్పటికీ వివాహం చేసుకున్న దంపతులకి ఆదర్శ దంపతులైన ఆ పుణ్య దంపతుల జంటని తారాలోకంలో దర్శనం చేయమంటారు .
సరే, వసిష్ఠ మహర్షి విశ్వామిత్రులవారు కోరినట్టే, “వెయ్యిన్ని ఎనిమిది రకాల కూరలు ఉపయోగించి వంట చేయమని అరుంధతికి చెబుతాను. మీరు మా పితృతిధి నాడు భోక్తగా రావలసి”నదని కోరారు . ఆరోజు రానే వచ్చింది విశ్వామిత్రులు వసిష్ఠుల వారి ఆశ్రమానికి విచ్చేశారు . ఆశ్రమాలలో ఉండే మునిపుంగవులకి మనలాగా అన్ని రకాల కూరగాయలు దొరికే అంగడి ఉంటుందా ఏమిటి ? దొరికినవాటితోనే , మితమైన ఆహారాన్ని తీసుకుంటూ తపోనిష్టలో ఉండే మహానుభావులు కదా వారు !
అరుంధతీదేవి , విశ్వామిత్రులవారికి అరటి ఆకు పరచి కాకర కాయకూర, పనస పండు మరియు నల్లేరు తీగతో పచ్చడి చేసి ఇంకా కొన్ని మితమైన కూరలు మాత్రము వాడి చేసిన వంటను వడ్డించింది. వాటిల్లో వెయ్యిన్ని ఎనిమిది కూరలు విశ్వామిత్రునికి లెక్కకి రాలేదు . దాంతో ‘ఇందులో వెయ్యిన్ని ఎనిమిది కూరలు ఎక్కడున్నాయి ?’ అంటూ ప్రశ్నించారు .
అప్పుడామె ముందుకు వచ్చి ఈ శ్లోకాన్ని విశ్వామిత్రులకు చెప్పారు .
‘కారవల్లీ శతం చైవ వజ్రవల్లీ శత త్రయం పనసమ్ షట్ శతశ్చైవ శ్రాద్ధకాలే విధీయతే ‘
దీని అర్థము శ్రాద్ధ సమయములో వడ్డించిన ఒక కాకరకాయ నూరు కూరగాయలకు సమానము. మరియు వజ్రవళ్ళి [ నల్లేరు ] పచ్చడి మూడు వందల కూరలకు సమానము.పనసపండు ఆరు వందల కూరలకు సమానము.
ఇవి మూడూ కలిపితే మొత్తం వెయ్యి కూరలు.ఇవికాక ఇంకొక ఎనిమిది రకాల కూరలు వండి వడ్డించినాను అంది నమస్కరించి వినయముతో.
ఇది విని విశ్వామిత్రులు తబ్బిబ్బై, నోటమాట రాక చక్కగా ఆ నాటి పితృతృప్తికరమైన భోజనము చేసి వెళ్లారుట.