Online Puja Services

దేవాలయాలకి బహుమతిగా ఇవి ఇస్తున్నారా ?

18.118.119.129

దేవాలయాలకి బహుమతిగా ఇవి ఇస్తున్నారా ? 
-సేకరణ 

పెళ్ళికో, ఫంక్షన్ కో, పేరంటానికో వెళ్లేప్పుడు వాళ్లకి ఏం  తీసుకెళ్ళాలి అని ఏంటో ఆలోచిస్తాం . అవి వారికి నచ్చుతాయా ?  ఉపయోగపడతాయా అని ఎన్నో రకాలుగా ఆలోచించి ఆ బహుమతిని ఖరీదు చేస్తాం . మరి భగవంతునికి ఏదైనా ఇవ్వాలంటే ఏం ఇవ్వాలి ? ఈ ప్రశ్నకి సమాధానం భవిష్యోత్తర పురాణం చెబుతుంది .  పూర్వకాలం దేవాలయాలని మహారాజులు నిర్మించేవారు . ఇప్పటి కాలంలో దేవాలయాల నిర్మాణం వదాన్యులైన భక్తుల సహాయ సహకారాలతోటే ఎక్కువగా కొనసాగుతోంది .  స్తొమత ఉంటె ఆలయాన్ని నిర్మించవచ్చు, అలా కాకుండా భగవంతునికి ప్రీతికరంగా ఏదైనా సమర్పించాలంటే ఏం ఇయ్యవచ్చో ఇక్కడ తెలుసుకుందాం . 

ఆలయ నిర్మాణం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు . మన దేశంలోని కొన్ని బృహత్తర ఆలయాలు వందల ఏళ్ళపాటు కష్టించి నిర్మించారంటే  కలుగుతుంది .  ప్రస్తుత కాలంలో ఎక్కడైనా కొత్తగా దేవాలయం నిర్మిస్తుంటే, ఆ ఆలయానికి ఏమి సాయం చేస్తే బాగుంటుందని ఆస్తికులు ఒక్కోసారి సందిగ్ధంలో పడుతుంటారు. అటువంటి సందేహాలకు , విష్ణు ధర్మోత్తర పురాణం తృతీయ ఖండం మూడు వందల నలభై ఒకటో అధ్యాయం చక్కని సమాధానం చెబుతుంది . 

 దేవాలయం అనేది ఒక పుణ్య వ్యవస్థ. దాని నిర్మాణ నిర్వహణలకు అందరూ సహకరిస్తేనే ఆ వ్యవస్థ చక్కగా కొనసాగుతూ ఉంటుంది. దర్శనానికి వెళ్ళిన వారికి శాంతిని ప్రసాదించేదిగానూ ఉంటుంది. అందుకే ఎవరికి చేతనైనంతలో వారు దేవాలయాలకు సహాయ సహకారాలను అందిస్తూ అవసరమైన వాటిని దానం చేయాలంటున్నాయి పురాణాలు.

ఆలయ గోడలకు సున్నం కొట్టించడం, ఆలయ ప్రాంగణాన్ని చక్కగా ఊడ్చి ముగ్గులు పెట్టి అందంగా తీర్చిదిద్దటంలాంటి శ్రమదానాలకు శ్రీమహావిష్ణులోక ప్రాప్తి కలుగుతుందని, అనంతమైన పుణ్యఫలం దక్కుతుందని చెబుతుంది .  అలాగే ఆలయానికి శంఖాన్ని దానం చేస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఆ తరువాత మానవజన్మ ఎత్తాల్సి వచ్చినా కీర్తిమంతుడే అవుతాడు. గంటను దానం చేస్తే మహా గొప్ప కీర్తిని పొందుతాడు. గజ్జలను, మువ్వలను ఇచ్చినవాడు సౌభాగ్యాన్ని పొందుతాడు.

చల్లదనం కోసం ఆలయ ప్రాంగణంలో పందిళ్ళు నిర్మిస్తే కీర్తి పొందటానికి, ధర్మబుద్ధి కలగటానికి కారణమవుతుంది. పైన ఎగిరే పతాకాలను ఇచ్చినవారు సకలపాపాల నుంచి విముక్తులై వాయులోకాన్ని పొందుతారు . ఆ పతాకాలు ఆలయానికి ఎంత శోభను కూర్చుతుంటే అంత యశస్సును దాత పొందుతాడు. చాందినీలు ఏర్పాటు చేసిన వాడు గొప్ప సుఖాలకు పాత్రుడవుతాడు. ఆలయంలో వేదికను నిర్మించి ఇచ్చినవాడు పృథ్వీపతి అవుతాడు. మనోహరమైన కుంభాన్ని ఇచ్చినవాడు వరుణలోకాన్ని, నాలుగు కలశాలను దానం ఇచ్చినవాడు నాలుగు సముద్రాల పర్యంతం ఉన్న భూమి మీద, అంతసుఖాన్ని అనుభవిస్తాడు. 

కమండలువును ఆలయానికిస్తే గోదాన ఫలితం దక్కుతుంది. వట్టివేళ్ళతో తయారు చేసిన చాపల లాంటివి ఇస్తే సర్వపాపాలు నశిస్తాయి. ఆలయానికి సమకూరిన గోవులను మేపటానికి గోపాలకుడిని ఇచ్చినా పాపవిముక్తే ఫలితం. చామరాలను దానం చేస్తే గొప్ప ధనప్రాప్తి కలుగుతుంది. దేవుడికి ఆసనాన్ని సమకూరిస్తే సర్వత్రా ఉత్తమ స్థానం లభిస్తుంది. పాదపీఠ ప్రదానం ఉత్తమగతికి సోపానం. ధ్వజ సమర్పణం లోకంలో గొప్పకీర్తిని పొందటానికి వీలు కల్పిస్తుంది. దేవుడికి ముఖ లేపనాలను అంటే ముఖానికి అలంకిరంచే గంధ ద్రవ్యాలను ఇచ్చినవాడు ఉత్తమరూప సంపత్తిని పొందుతాడు. దర్పణం (అద్దం) దానం చేసినా మంచిరూపం లభిస్తుంది. దేవుడి పరిచర్యల కోసం చిన్న చిన్న పాత్రలను ఇస్తే సర్వకామ ఫలప్రదమైన యజ్ఞం చేసినంత ఫలం దక్కుతుంది. 

ధ్యానం, సశ్యాలు, బీజాలు, బంగారం, వెండి, ఇతర లోహాలు ఇచ్చినవాడు అనంతరం పుణ్య ఫలితాన్ని పొందుతాడు. వెండి మంచి రూపానికి, బంగారం సర్వకోరికలు సిద్ధించటానికి దానం చేస్తుంటారు. పాడి ఆవును ఇస్తే గోలోకప్రాప్తి, పచ్చని పతాకాలతో కూడిన గరుడ ధ్వజాన్నిస్తే ఇంద్రలోకప్రాప్తి కలుగుతాయి. నీలపతాకాలతో కూడిన తాలధ్వజం సమర్పిస్తే ఉత్తమలోకాలు ప్రాప్తిస్తాయి. ఆలయానికి మహాద్వార తోరణాలను ఇచ్చినవాడికి ఉత్తమలోకాల వాకిళ్ళు తెరచి సిద్ధంగా ఉంటాయి. శయన, ఆసనదాతకు వైకుంఠంలో శాశ్వత స్థితి ఫలం, ఉత్తరీయాన్ని సమర్పిస్తే సర్వకామ ఫలప్రాప్తి, దేవాలయంలో శిల్పాలు, చిత్రాలు లాంటివి కావలసిన పదార్థాలను వాద్య పరికరాలను ప్రదానం చేసినవాడు దేవసేనలో స్థానాన్ని పొందుతాడని విష్ణు ధర్మోత్తర పురాణం పేర్కొంటోంది.

దేవుడిని ఆశ్రయించి ఉండేవాడికి ఏ కొద్దిపాటి ఇచ్చినా దైవానుగ్రహపాప్తికి కారణమవుతుంది. ఈ వరుసలోనే ధాన్యాలు, సశ్యాలు, రసాలు, శాకాలు, ఇచ్చిన వారికి పుణ్యంతో పాటు శోకరహితస్థితి కలుగుతుంది. వంట పాత్రలను ప్రదానం చేసినా పుణ్యఫలమే. పుష్పవృక్ష, తోటల ప్రదానం గ్రామాధిపత్యానికి, జలాశయ నిర్మాణం, లాంటివన్నీ భగవత్‌కృపను పొందటానికి కారణాలవుతాయని విష్ణుధర్మోత్తర పురాణం పేర్కొంటోంది. దేవాలయం ఒక పవిత్ర స్థానం. భక్తులు అక్కడ మనశ్శాంతిని పొందేందుకు వీలుంటోంది. అంతటి ఉత్తమ వ్యవస్థకు ఎవరికి చేతనైనంతలోవారు సహకరిస్తే ఆ పవిత్ర ఉత్తమ వ్యవస్థ చిరకాలం నిలిచి ఉంటుందన్న లక్ష్యంతోనే ఇలా దేవాలయాలు దాన విశేషాలను పురాణాలు పేర్కొంటున్నాయన్నది అంతరార్థం.

సర్వే సుజనాసుఖినోభవంతు. 

#temples

Tags: temples, gift

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore