భాస్కరారాధన వలన కంటి ఆరోగ్యం
భాస్కరారాధన వలన కంటి ఆరోగ్యం మెరుగవుతుందని ‘బామ్మోవాచ’ !
-లక్ష్మీ రమణ
“ఆరోగ్యం భాస్కరాదిఛ్చేత్ అని ఆర్ష వాక్యం . సూర్యారాధన వలన ఆరోగ్యం చేకూరుతుంది .ప్రత్యేకించి కంటి సమస్యలు దూరమవుతాయి. అందుకే రోజూ సూర్య నమస్కారం చేసుకోవాలి . ఆట్టే, ఆదివారమ్ అని రాగాలు తీస్తూ.. ముసుగుతన్ని తొమ్మిదింటిదాకా నిద్రపోతే ఎలాగురా ! లే లే! ” మా బామ్మ రవిని అరుస్తోంది . “సూర్యుణ్ణి నేరుగా చూస్తే , కళ్ళు పోతాయి కానీ, కళ్ళ సమస్యలు ఎలాగండీ తగ్గుతాయి” మునగదీసుకొని గొణుగుతూ అటువైపు తిరుగుతూనే చెప్పాడు రవి . పెద్దావిడ ఊరుకుంటుందా ! చక్కగా వాడి పక్కనే సెటిలయ్యి , తల నిమురుతూ అదెలా సాధ్యమో వివరించింది . ఏమైనా బామ్మోవాచ వింటే వామ్మో అని మనమూ ఫాలో అవ్వాల్సిందే !! ఆ కథేమిటో చదవండి మరి !
నమస్సవిత్రే జగదేక చక్షసే |
జగత్ ప్రసూతి స్థితి నాశ హేతవే |
త్రయీ మయాయ త్రిగుణాత్మ ధారిణే |
విరించి నారాయణ శంకరాత్మనే ||
శ్రీ ఉషా సంజ్ఞా ఛాయా సమేత సూర్య నారాయణ పర బ్రహ్మణే నమః ఇదమర్ఘ్యం సమర్పయామి అని సూర్యునికి ముమ్మారు అర్ఘ్యయాన్ని సమర్పిస్తూంటారు కదా తాతగారు . ఎప్పుడైనా వాటి అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశావంట్రా నువ్వు ! అలా చేసుంటే, నీకీ సందేహం వచ్చేదే కాదు .
చూడు నాన్నా ! మన ఋషులు ఇచ్చిన సంప్రదాయాలు శాస్త్ర బద్ధత లేనివి కావు . మరోమాటలో చెప్పాలంటే , మన సంప్రదాయాల శాస్త్రీయతని నిరూపించే దిశగా సైన్స్ ఎదగాల్సి ఉంది .
ఇంతకీ మీ తాతగారు నిత్యమూ చేసే సూర్య స్తుతి లోని సవిత్రి అంటే సృష్టి కారకుడైన సూర్యునికి; ‘జగదేక చక్షసే’ అనే ఈ జగత్తు మొత్తానికీ నేత్రముగా ఉన్నటువంటి వానికి, జగత్ ప్రసూతి స్థితి నాశహేతవే - ఈ విశ్వసృష్టి, స్థితి, లయాలకు హేతువైనటువంటి సామములనే మంత్రములతో కూడిన చతుర్వేదమయునకు, త్రిగుణాత్మ ధారి అంటే సత్వ రజస్సు తమస్సు అనే గుణాలను ధరించిన వానికి , విరించి నారాయణ శంకరాత్మనే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడైన వానికి నమస్కారము చేస్తున్నాను అని భావము .
ఇది సూర్యుని దర్శిస్తూ చేయవలసినటువంటి స్తుతి. జగత్తుకే నేత్రమైనవాడు కాబట్టే, పరమాత్మ నేత్రముగా సూర్యుని అభివర్ణించారు . ఇందులో చెప్పుకున్నట్టు జగదేక చక్షుడికి ‘ దృష్టి వేల్పు’ అని మరొక పేరుంది . అందువల్ల ఆయన అనుగ్రహం చేత దృష్టి లభిస్తుంది. అది కేవలం మనుషులకి మాత్రమే కాదు, ప్రపంచానికి ఆయన లేకపోతే దృష్టే లేదు. చివరికి త్రిమూర్తులు కూడా ఆయన స్వరూపమే అని ఈ స్తుతి ద్వారా తెలుస్తోంది కదా !
పైగా సూర్యుని నుండీ వెలువడే ఉదయపు కిరణాలల్లో చూపుకి మేలుచేసేవి కూడా ఉంటాయి . సూర్య కిరణాల్ని విశ్లేషించి వాటికి ప్రత్యేకమైన పేర్లని , వాటి ప్రయోజనాన్ని పొందేలా పూజా విధానాలనే రూపొందించిన మన ఋషుల గొప్పదనాన్ని కాదనగలమా ! కాబట్టు , వెంటనే లేచి చక్కగా కాలకృత్యాలు తీర్చుకొని, స్నానం చేసి, సూర్యనమస్కారం , సంధ్యావందమ్ చేసుకో నాన్నా !” అంటూ అనునయించింది .
ఇక మా రవి , ఆ రవిని ఆరాధించేందుకు వెంటనే లేచాడు . ఇలాంటి అమ్మమ్మలు, నానమ్మలు ఉన్న ఉమ్మడి కుటుంబాలు తక్కువకావడమే బహుశా మనం గొప్ప సంప్రదాయాలు కోల్పోవడానికి కారణమేమో అనిపించింది నాకా క్షణం !!
సర్వేంద్రియానాం నయనం ప్రధానం:
#drusti #suryaradhana #bhaskararadhana #eyesight
Tags: sungod, surya, suryadev, dristi, drusti, eyesight, surya aradhana, bhaskara, aradhana,