Online Puja Services

విష్ణు వక్షస్థల స్థితాయ నమః

3.14.7.99

విష్ణు వక్షస్థల స్థితాయ నమః అని స్తుతించిన వారికి అష్టైశ్వర్వాలు లభిస్తాయి. 
సేకరణ 

ఒక రోజు వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీహరికి సేవలు చేస్తుండగా, సంతుష్టుడైన శ్రీహరి, ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకామె ఏ భార్య అయినా భర్త అనురాగాన్నే కోరుకుంటుంది. మీ అనురాగం నాకు పుష్కలంగా లభిస్తున్నప్పుడు నాకంటే అదృష్టవంతురాలెవరు ఉంటుంది చెప్పండి అని అంది. ఆమె మాటలను విన్న శ్రీహరి, అందుకు అమెకు పరమేశ్వరానుగ్రహం కూడా కలిసిరావాలని , దానికోసం ఆయన్ని  ప్రసన్నం చేసుకోమని ఆదేశించారు. లోకోపకార లేకుండా శ్రీహరి ఏకార్యక్రమాన్ని తలపెట్టరు కదా ! 

అలా శ్రీహరి అనుజ్ఞను పొందిన లక్ష్మీదేవి, భూ లోకానికి చేరుకుని తపస్సు చేసుకునేందుకు తగిన స్థలాన్ని వెదుకుతుండగా, అటుగా వచ్చిన నారదుడు అనువైన చోటును చూపిస్తాడు. అయన సూచన ప్రకారం శ్రీశైల క్షేత్ర సమీపంలోని పాతాళ గంగను చేరుకుని ఓ అశ్వత్ధ వృక్షం నీడన తపస్సు మొదలు పెట్టింది. అయితే, తపస్సును ప్రారంభించే ముందు గణపతిని ప్రార్థించకుండా పొరపాటు చేసింది. అందుకు కోపగించుకున్న వినాయకుడు లక్ష్మీదేవి తపస్సుకు ఆటంకం కలిగించమని సరస్వతీదేవిని ప్రార్థిస్తాడు.

గణనాథుని విన్నపం మేరకు, లక్ష్మీదేవి తపస్సుకు విఘ్నాలు కలుగజేయ సాగింది సరస్వతీదేవి. లక్ష్మీదేవి ఎంతగా శివ పంచాక్షరీ జపం చేద్దామనుకున్నప్పటికీ తపస్సుపై ఆమె మనస్సు లగ్నం కాకపోవడంతో దివ్యదృష్టితో అసలు సంగతిని గ్రహించిన లక్ష్మీదేవి, వినాయక వ్రతాన్ని చేసి ఆయన అనుగ్రహన్ని పొందుతుంది. ఆనాటి నుండి ఘోర తపస్సు చేయసాగింది లక్ష్మీదేవి. అయినా పరమేశ్వరుడు ప్రత్యక్షం కాలేదు.

ఆమె చట్టూ పుట్టలు పెరిగి, అనంతరం ఆమె దేహం నుండి దివ్య తేజోమయి అగ్ని బయటకు వచ్చి సమస్తలోకాలను దహించడానికి బయలుదేరింది. అది చూసిన ఋషులు, దేవతలు పరమేశ్వరునికి మొర పెట్టుకున్నారు. అప్పుడు పరమశివుడు నందీశ్వరుని భూ లోకానికి పంపాడు. ఒక బ్రాహ్మణుని వేషంలో లక్ష్మీదేవి వద్దకు వచ్చిన నందీశ్వరుడు, ఆమె అభీష్ఠం నెరవేరలంటే రుద్ర హోమం చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోమని చెప్పాడు. అయితే స్వామి నివేదనకు ఒక శరీరావయాన్ని సమర్పించాలని చెప్పి వెళ్ళిపోయాడు.

వెంటనే లక్ష్మీదేవి సప్తర్షులను ఋత్విక్కులుగా నియమించుకుని ఏకాదశి రుద్ర యాగాన్ని ప్రారంభించింది. యాగం నిర్వఘ్నంగా ముగియడంతో, హోమ గుండం నుంచి ఓ వికృత రూపం బయటకు వచ్చి ఆకలి, ఆకలి అని కేకలు వేయసాగింది. అప్పుడు లక్ష్మీదేవి తన ఖడ్గంతో తన వామ భాగపు స్తనాన్ని ఖండించి శక్తికి సమర్పించబోగా, ఆ శక్తి స్థానంలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై, లక్ష్మీ దేవిని కరుణించి, ఆమె వక్షభాగంలో ఏలాంటి లోపం లేకుండా చేసి, వరం కోరుకోమన్నాడు. అప్పుడామె సర్వవేళలా తనకు శివానుగ్రహం కావాలని ప్రార్ధించింది. 

అందుకు ప్రసన్నుడైన పరమశివుడు, తథాస్తు నీవు విష్ణు వక్షస్థలంలో స్థిరంగా ఉంటావు. నీ నామాల్లో విష్ణు వక్షస్థల స్థితాయ నమః అని స్తుతించిన వారికి అష్టైశ్వర్వాలు లభిస్తాయి. నీ నివేదిత స్థనాన్ని ఈ హోమ గుండం నుంచి ఓ వృక్షంగా సృష్టిస్తున్నాను. దీనిని భూ లోకవాసులు బిల్వవృక్షంగా పిలుస్తారు. మూడు దళాలతో ఉండే మారేడు దళాలతో పూజించే వారికి సర్వశుభాలు కలుగుతాయి అని చెప్పాడు. 

 

Quote of the day

If you shut the door to all errors, truth will be shut out.…

__________Rabindranath Tagore