విచిత్రమైన మోదకాలు గణపతికి ప్రియమైనవి ఎందుకయ్యాయి ?
విచిత్రమైన మోదకాలు గణపతికి ప్రియమైనవి ఎందుకయ్యాయి ?
సేకరణ
ఆగమోక్తమైన రూపంలో భాద్రపద శుద్ధ చవితి నాడు పార్వతీ నందనుణ్ణి శాస్త్రీయంగా పూజించిన వారికి జ్ఞాన, భక్తి, వైరాగ్యాలు లభిస్తాయి. నామజపం వల్ల పాపనాశానాన్ని, ధ్యానం వల్ల మోక్షాన్ని కటాక్షించే మూషికవాహనుణ్ణి వినాయక చవితినాడు ఖచ్చితంగా అర్చిస్తాం. గణపతి సాధారణంగా మూషిక వాహనుడై, ఉండ్రాళ్ళని చేత ధరించి కనిపిస్తారు . భారీకాయుడైన గణపయ్య బుజ్జి మూషికం మీదే ఎందుకు తిరుగుతారు? విచిత్రమైన మోదకాలు ఆయనకీ ప్రియమైనవి ఎందుకయ్యాయి ?
ఏకదంతుడైన విఘ్నేశ్వరుడు ఎన్నో రూపాలలో, ఎన్నో నామాలతో ప్రపంచవ్యాప్తంగా పూజలందుకొంటున్నాడు. భక్తులు వారి వారి మనోభావాలకు అనుసారంగా గణపతిని “శక్తి గణపతి”గా, “విఘ్నగణపతి”గా, “హేరంబ గణపతి”గా, “మహాగణపతి”గా, “నృత్యగణపతిగా”, “ఋణమోచక గణపతి”గా, “యోగ గణపతి”గా పూజిస్తుంటారు.
శిల్ప శాస్త్రం ప్రకారం గణపతి “ఆయుధాలు”, “సౌందర్య వస్తువులు”, “పూజా వస్తువులు” అనే మూడు విధాలైన విశేషాలను ధరించి దర్శనమిస్తాడు. సుమారు ఇరవై నాలుగు ఆయుధాలు, ఇరవై సౌందర్య వస్తువులు, పద్నాలుగు పూజావస్తువులను చేతిలో ధరించి, మూషిక వాహనుడై దర్శనమిచ్చే మహాగణపతిని పూజించడం వల్ల సకల అరిష్టాలు తొలగి, సర్వాభీష్టాలు నెరవేరుతాయి.
“గౌరీపుత్ర నమస్తేస్తు సర్వసిద్ధి వినాయక
సర్వసంకటనాశాయ గృహాణార్ఘ్యం నమోస్తు తే”
అంటూ పరమ పవిత్రమైన భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధ్యక్షుడైన మహాగణపతిని, అతని అంతర్యామి అయిన విశ్వంభరుణ్ణి పూజించి, అర్ఘ్యాన్ని అర్పించిన వారికి శుద్ధభక్తి, విశుద్ధ జ్ఞానం, పునరావృత్తిరహితమైన మోక్షం సిద్ధిస్తాయి. సర్వ శక్తుడైన మహేశపుత్రుణ్ణి, ఏకదంతుణ్ణి, షణ్ముఖ అగ్రజుణ్ణి వినాయక చవితి నాడు పూజించిన వారు బ్రహ్మవాదులై, మోక్షసాధనా మార్గంలో నడుస్తూ పరమపదాన్ని చేరుతారు. వినాయకుణ్ణి అర్చించి, కీర్తించిన వారికి విద్యాబుద్ధులతో బాటు అధ్యయన, అధ్యాపనా సామర్థ్యం ప్రాప్తిస్తుంది. “వివర్జిత నిద్రాయ నమః” అని పూజించేవారికి బుద్ధిశక్తిని, ధారణ సామర్థ్యాన్ని అందిస్తాడు ఈ వినాయకుడు. ప్రతి శుభకార్యాన్ని విఘ్నేశ్వర ప్రార్థన, పూజతో ఆరంభిస్తే ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా నెరవేరుతుంది. మందబుద్ధిని పరిహరించి, వేదజ్ఞానాన్ని ప్రసాదించే క్షిప్రవరదుడైన శంకర తనయుణ్ణి ఆర్తితో అర్చించిన మానవుల మనస్సులలోని కల్మషాన్ని తొలగిస్తాడు గణపతి .
మూషిక వాహనం – ఆధ్యాత్మిక అంతరార్థం
విద్యకు, విజ్ఞానానికి, బ్రహ్మతత్వ వివేచనానికి ప్రతీకగా విఘ్నేశ్వరుడు విచిత్రమైన మూషికవాహనాన్ని అధిరోహిస్తాడు. వింతైన మోదకాన్ని నైవేద్యంగా స్వీకరిస్తాడు. ఇంతకూ మూషికానికి, మోదకానికి గల ఆధ్యాత్మిక వైశిష్ట్యం ఏమిటి?
ఆదిపూజితుడిగా మోక్షదాయకమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించే లంబోదరుడు మూషికాన్ని తన వాహనంగా ఎంచుకున్నాడు. ఇందులో ఆధ్యాత్మిక గూఢార్థముంది. వెలుగంటే భయపడే ఈ అల్పజీవి నేలలో చీకటి బొరియలు చేసుకొని నివసిస్తుంది. చీకటిలో అత్యంత వేగంగా పరుగెట్టే ఎలుక ఇంద్రియ లౌల్యానికి నిదర్శనం. ఆవిధంగా అజ్ఞానానికి, భయానికి, కామక్రోధాలకు ప్రతీక అయిన ఎలుకపై సర్వ విద్యా సమన్వితుడైన విఘ్నేశుడు కూర్చోవడం ద్వారా మానవులు అజ్ఞాన నివృత్తిని సాధించే మార్గాన్ని ఉపదేశిస్తాడు. అంతరంగపు వెలుగును ఇచ్చే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడం, ఇంద్రియాలను నిగ్రహించడం, ధర్మాచరణతో నిర్భయులవడం వంటి లక్షణాలను సాధించడం ద్వారా మానవులు ముక్తిధామాన్ని చేరగలరని ఉపదేశించే దివ్యమూర్తి విఘ్నేశ్వరుడు.
మోదకం – అంతరార్థం
గణపతికి మోదకం అత్యంత ప్రియమైన తినుబండారం. అచ్చ తెనుగులో ఉండ్రాళ్ళుగా పిలువబడే ఈ మోదకం బొజ్జ గణపయ్యకు ప్రియమైన ఆహారం కావడం వెనుక ఓ ఆసక్తికరమైన కథనం ఉంది. పూర్వం దేవతలు సమస్త ఆధ్యాత్మిక జ్ఞానాన్ని దివ్యమైన మోదక రూపంలో కూర్చి పార్వతీ పరమేశ్వరులకు సమర్పించారట. జగజ్జనని అయిన పార్వతీదేవి ఆ మోదకాన్ని తన పుత్రులైన గణపతి, కుమారస్వాములకు చెరి సగం పంచి ఇవ్వబోయింది. ఈ విభాగాన్ని నిరాకరించిన పుత్రులిద్దరూ ఆ మోదకం తమకే కావాలని పట్టుబట్టారు. అప్పుడు గణపతి, కుమారస్వామి ఇద్దరిలో ఎవరు తమ భక్తిని నిరూపిస్తారో వారికే మోదకం దక్కుతుందని చెప్పింది పార్వతీదేవి.
తల్లి మాటను ఆలకించిన షణ్ముఖుడు తన మయూర వాహనం ఎక్కి వెనువెంటనే సమస్త తీర్థ క్షేత్రాలను దర్శించడానికి బయలుదేరాడు. వినాయకుడు మాత్రం “జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ” అంటూ తల్లిదండ్రులకు భక్తితో ప్రదక్షిణలు చేసాడు. విఘ్ననాయకుని వినయాన్ని, విజ్ఞతను వీక్షించిన హిమాలయ తనయ ఆ దివ్య మోదకాన్ని మూషికవాహనుడికి అనుగ్రహించింది. ఆవిధంగా మోదకం వినాయకునికి అత్యంత ప్రియమైన భక్ష్యంగా మారింది. ఆనాటి నుండి పార్వతీతనయుడు మోదకప్రియునిగా త్రిలోకఖ్యాతిని పొందాడు.
సంస్కృతంలో మోద అంటే అత్యంత ఉన్నతమైన సంతోషమని అర్థం. ఆవిధంగా మోదక అంటే సంతోషాన్ని కలిగించేదని అర్థం. జీవులకు నిజమైన సంతోషాన్ని కలిగించేది జ్ఞానం మాత్రమే అని సకల శాస్త్రాలు చాటుతున్నాయి. మోదకం పైనుండే పొరలు పంచభూతాలను సూచిస్తాయి. ఆ లోపల ఉండే మెత్తటి, తియ్యటి పూర్ణం భాగం ఆధ్యాత్మిక జ్ఞానానికి నిదర్శనం. ఈవిధంగా మోదకం ఈ లౌకిక ప్రపంచంలో ఉంటూనే మోక్షదాయకమైన వేదాంత జ్ఞానాన్ని సాధించే సూక్ష్మాన్ని బోధిస్తుంది. ముక్తిహేతువైన జ్ఞానదాయకునిగా కీర్తిని పొందిన గణపతి ’మోదక హస్తు’నిగా, ’మోదక ప్రియుని’గా సాక్షాత్కరిస్తూ భక్తుల తాపత్రయాలను తొలగించి, జ్ఞానప్రాప్తిని అందిస్తున్నాడు.
నటరాజ నాట్యానికి వాద్య సహకారాన్ని అందించే నృత్య గణపతిని, వేదవ్యాసుని భారతరచనకు సహకరించిన విద్యా గణపతిని, గోకర్ణక్షేత్రంలో శివుని ఆత్మలింగాన్ని స్థాపించిన విజయ గణపతిని – పూజించి గణపతి తత్వచింతన ద్వారా తృప్తి పరచి, మానసిక, వాచిక, కాయికాలనే మూడు విధాలైన పూజలను అర్పించాం.
శ్రీకృష్ణ – రుక్మిణీదేవి దంపతులకు ’చారుదేష్ణ’ అన్న పేరుతో ద్వాపరయుగంలో జన్మించిన మహాగణపతి, మనందరిని సంపూర్ణంగా అనుగ్రహించాలని ప్రార్థిస్తూ .. శలవు .