పెళ్ళి శుభలేఖలమీద వినాయకుడి బొమ్మ
పెళ్ళి శుభలేఖలమీద వినాయకుడి బొమ్మని ముద్రించడం వెనుక చాలా కారణాలే ఉన్నాయట !
లక్ష్మీ రమణ
పెళ్లయినా, పేరంటమైనా, శుభకార్యాలు ఏవి సంకల్పించినా ప్రధమ పూజలు అందుకునేది మాత్రం వినాయకుడే ! అందులో సందేహమే లేదు. విఘ్నాలు పగపడితే, మనం మాత్రం ముందుకు ఎలా వెళ్ళగలం ! వాటిని తొలగించమని పెళ్లి పత్రికలమీద ఆస్వామి బొమ్మని వేయించుకుంటాం , అని సులభంగా చెప్పేస్తారేమో, ఇందులో మర్మం అంత సులువైనది కాదట . దీని వెనుక మరింత విశిష్టమైన కారణాలున్నాయంటున్నారు పండితులు .
వినాయకుని విఘ్నధిపతిగా శుభలేఖల మీద ముద్రించుకుంటారు. ఇక ఆయన గురు స్వరూపుడు. సిద్ధి, బుద్ధి కలిగినవాడు . కాబట్టి గురు అనుగ్రహంతో ఆ వివాహ బంధం పదికాలాలు చల్లగా ఉండాలనే ఆకాంక్షతో ఆయన రూపాన్ని ముద్రిస్తారు.
ఇక చిన్నదైనా, పెద్దదైనా ప్రతి విషయం పట్ల సూక్ష్మ దృష్టిని, విశ్లేషణాత్మక శక్తిని కలిగి ఉండాలని వినాయకుడికి ఉండే చిన్నపాటి కళ్లు చెబుతాయి. ఆ విధంగా కలిసి ముందుకు సాగే భావి జీవితంలో దంపతులు తమ సమస్యలని విశ్లేషించుకోవాలనే అర్థం ఇందులో దాగుంది .
సృష్టిలో జీవించే ప్రతి ప్రాణిని సమ దృష్టితో చూడాలని, అందరికీ సమన్యాయం ఉండాలని వినాయకుడికి ఉండే తొండం సూచిస్తుంది. అదే ఆంతర్యాన్ని తమ జీవితాలకి అన్వయించుకోవాలనే అర్థంతో కూడా వినాయకుని శుభలేఖలమీద ముద్రిస్తారు .
వినాయకుడికి ఉండే రెండు దంతాల్లో ఒకటి చిన్నదిగా మరొకటి పెద్దదిగా ఉంటుంది కదా. అయితే పెద్దగా ఉన్న దంతం నమ్మకాన్ని సూచిస్తే, చిన్నగా ఉన్న దంతం ప్రతిభను, నైపుణ్యాన్ని, తెలివితేటలను సూచిస్తుంది. దంపతుల్లో ఒక్కరిపైనా ఒకరికి ఉండవలసినది నమ్మకమేకదా ! దానిని నిలబెట్టుకోవడానికి అవసరమైన ప్రతిభా నైపుణ్యాలనీ పెంపొందించుకోమనీ ఆ స్వామి రూపం సూచిస్తుంది .
ఎవరి జీవితంలోనైనా జరిగే కేవలం ఒకే ఒక్క, అతి పెద్ద పండుగైన వివాహానికి, రెండు మనసులు, రెండు జీవితాలు ఒకటిగా ముడిపడే వేడుకకి ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు కలగకూడదనే నమ్మకంతో వివాహ ఆహ్వాన పత్రికలపై ఆయన బొమ్మను ముద్రిస్తారు.
ఇవన్నీ పక్కనపెడితే, తొండము ఏకదంతము, చిన్ని కళ్ళూ ఉన్న ఆ వినాయకుడి రూపం ఎంతో అందంగా, ఆ పత్రికకు అందాన్ని తెచ్చి పెట్టె విధంగా రకరకాల రంగుల్లో వొదిగిపోతూ ఒక దివ్యమైన అందాన్ని తెచ్చిపెడుతుందంటే, అతిశయోక్తి కాదు . అదన్నమాట సంగతి !